Uttar Pradesh: ఆ యువతికి 23 ఏళ్ల వయసు ఉంటుంది. ఒక అబ్బాయి తో ప్రేమలో పడింది. మనసులు కలవడంతో తనువులు కూడా కలిశాయి. దీంతో ఆ యువతి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని కొద్ది రోజులపాటు ఆ యువతి దాచి ఉంచింది. తీరా ఇంట్లో తెలియడం.. ఆ తర్వాత పరిణామాలు ఆమె జీవితంలో ఊహించని మలుపునకు కారణమయ్యాయి. ప్రస్తుతం ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఉత్తర ప్రదేశ్ లోని హాపూర్ జిల్లా నవాడ్ ఖుర్డ్ గ్రామానికి చెందిన ఓ 23 ఏళ్ల యువతి స్థానికంగా ఉండే ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరి మనసులు కలవడంతో శారీరకంగా వారిద్దరు దగ్గరయ్యారు. ఇలా కొన్ని నెలలపాటు జరిగింది. దీంతో ఆ యువతి గర్భం దాల్చింది. ఆ విషయాన్ని కొద్ది రోజులు దాచినప్పటికీ.. ఆమె శరీరంలో వస్తున్న మార్పులను తల్లి పసిగట్టింది. దీంతో ఆమె నిలదీసింది. తల్లి గట్టిగా ప్రశ్నించడంతో ఆ యువతి జరిగిన విషయం మొత్తం చెప్పింది. వాస్తవానికి ఈ విషయం ఆ యువకుడితో చెబితే అతడు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. పెళ్లి కాకుండా గర్భవతి అయ్యావని, నీవల్ల మా పరువు మొత్తం పోయిందని ఆ యువతి తల్లి, సోదరుడు ఆగ్రహానికి గురయ్యారు. ఆమెను తీవ్రంగా దూషించారు. దాడి చేసేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు.
అయితే ఆ యువతి బిక్కుబిక్కుమంటూనే ఆ ఇంట్లో ఉంటోంది. ఇలా ఒక రోజు ఆ యువతిపై ఆమె తల్లి, సోదరుడు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఆ మంటలు తాకిడికి ఆమె శరీరం 70% కాలిపోయింది. స్థానికులు గమనించి ఆమెను ఒక ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన సౌకర్యాలు ఉండే మరో ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన యువతీ తల్లి, సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. “బాధితురాలికి పెళ్లి కాలేదు. అదే గ్రామంలో ఉన్న ఒక యువకుడితో ఆమె ప్రేమలో పడింది. వారిద్దరూ శారీరకంగా పలుమార్లు కలుసుకున్నారు. అందువల్లే ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో వారు ఆవేశానికి గురయ్యారు. తల్లి, సోదరుడు గురువారం ఆ యువతని సమీపంలో ఉన్న అడవికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె పై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని” అడిషనల్ ఎస్పీ రాజ్ కుమార్ అగర్వాల్ ప్రకటించారు. అయితే ఈ సంఘటనపై మరింత దర్యాప్తు చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, కన్నతల్లి, సోదరుడు పెట్రోల్ పోసి నిప్పు అంటించడం.. ఆ మంటల ధాటికి ఆ యువతి శరీరం 70% వరకు కాలి పోవడం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..కాగా, ఆ యువతి వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించడమే ఆమె తల్లి, సోదరుడి ఆగ్రహానికి కారణమైందని స్థానికులు చెబుతున్నారు. ఇంత జరిగినప్పటికీ తల్లి, సోదరుడిలో కొంచెం కూడా పశ్చాత్తాపం కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు.