Shah Rukh Khan Ram Charan : ఓడలు బండ్లు బండ్లు ఓడలు కావడం అంటే ఇదేనేమో. ఒకప్పుడు బాలీవుడ్ కి సౌత్ చిత్రాలంటే చిన్న చూపు. ముఖ్యంగా టాలీవుడ్ అనే ఒక పరిశ్రమ ఉందని నార్త్ మేకర్స్ గుర్తించేవారు. కొద్దోగొప్పో తమిళ చిత్రాల గురించి అక్కడ చర్చ జరిగేది. ఇప్పుడు అంతా మారిపోయింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం టాలీవుడ్ వైపు చూస్తుంది. తెలుగు సినిమాలు గ్లోబల్ సినిమా వేదికపై మెరుస్తుంటే, అంతర్జాతీయ అవార్డ్స్ కొల్లగొడుతుంటే… బాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రెడిట్ మొత్తం రాజమౌళికే ఇవ్వాలి. ఆర్ ఆర్ ఆర్ రూపంలో ఆయన మరో వెండితెర అద్భుతం ఆవిష్కరించారు.

భారతీయులకు మించిన ఆదరణ పాశ్చాత్యులు ఆ చిత్రంపై చూపిస్తున్నారు. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి గాను న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుతో గౌరవించబడ్డారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుకి రెండు విభాగాల్లో నామినేట్ అయ్యింది. ఆస్కార్ అవార్డ్స్ లో ఒక విభాగంలో షార్ట్ లిస్ట్ అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ అందుకునే అవకాశం కలదని ఇండియన్ ఫిల్మ్ వర్గాలు నమ్ముతున్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనం. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ స్వయంగా ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఆస్కార్ వస్తుందని కామెంట్ చేశారు.
నేడు ఆయన నటించిన పఠాన్ మూవీ ట్రైలర్ విడుదలైంది. తెలుగు ట్రైలర్ రామ్ చరణ్ విడుదల చేశారు. అందుకు కృతజ్ఞతలు తెలుపుతూ షారుక్ ట్వీట్ చేశారు. సదరు ట్వీట్లో షారుక్… ”థాంక్యూ రామ్ చరణ్. మీరు ఆస్కార్ ఇంటికి తెచ్చాక, నన్ను కూడా ఓసారి తాకనివ్వండి” అని కామెంట్ చేశారు. షారుక్ వంటి స్టార్ రామ్ చరణ్ కి కృతజ్ఞతలు చెప్పడం, తెలుగు సినిమా ఆస్కార్ గెలుస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేయడం… గొప్ప పరిణామం. తెలుగు హీరోలతో పాటు సినిమాల స్థాయి ఎక్కడికో వెళ్లిందని చెప్పడానికిది నిదర్శనం. బాలీవుడ్ కూడా తెలుగు సినిమా గొప్పతనాన్ని ఒప్పుకుంటున్నారని చెప్పినట్లు అయ్యింది.
ఇక షారుక్ రిక్వెస్ట్ కి స్పందనగా చరణ్… ‘ఖచ్చితంగా షారుక్ సర్, ఆ అవార్డు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీది’ అని కామెంట్ చేశాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత షారుక్ ఖాన్ మూవీ చేశారు. వరుస పరాజయాలతో సతమతమైన షారుక్ కొన్నేళ్లు గ్యాప్ తీసుకొని పఠాన్ మూవీలో నటించారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పఠాన్ తెరకెక్కింది. రెండున్నర నిమిషాల ట్రైలర్ దుమ్మురేపింది. ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిన పఠాన్ హాలీవుడ్ మూవీస్ ని తలపించింది. దీపికా లుక్ కేక పుట్టించింది. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్ అబ్రహం విలన్ రోల్ చేశారు. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించారు.
Of course @iamsrk Sir!
The award belongs to Indian Cinema❤️ https://t.co/fmiqlLodq3— Ram Charan (@AlwaysRamCharan) January 10, 2023