
Sukumar- Vijayendra Prasad: ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం రాజమౌళిది. వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చి స్టార్ డైరెక్టర్ గా ఎదిగాక కూడా ఆయన తనని తాను తగ్గించుకుని మాట్లాడతారు. ఓ మూవీ ఈవెంట్లో ‘మా ఆవిడ నన్ను పూరి జగన్నాధ్ దగ్గరకెళ్లి త్వరగా సినిమాలు ఎలా తీయాలో నేర్చుకోండని సలహా ఇచ్చింది. ఆయన అనుమతిస్తే కొన్నాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తాను’ అని రాజమౌళి అన్నారు. పక్కనే పూరి జగన్నాధ్ ఆ మాటలకు వాటేసుకుని గట్టిగా నవ్వేశారు. బహుశా ఆయనకు ఈ గుణం తండ్రి విజయేంద్ర ప్రసాద్ నుండి సంక్రమించిందేమో. విజయేంద్ర ప్రసాద్ చాలా పాజిటివ్ గా మాట్లాడతారు.
తనపై వచ్చే ఆరోపణలకు కూడా స్పందించే తీరు గొప్పగా ఉంటుంది. మగధీర, ఛత్రపతి, యమదొంగ, బాహుబలి 1 అండ్ 2, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలకు కథలు సమకూర్చిన ఆయన ఇండియాలోనే నెంబర్ వన్ సినిమా రైటర్ గా ఎదిగారు. ఆయన రాసిన హిందీ చిత్రాలు భజరంగీ భాయ్ జాన్, మణికర్ణిక బాలీవుడ్ లో కూడా అద్భుతం చేశాయి. రచయితగా ఇంత సాధించినా విజయేంద్ర ప్రసాద్ యంగ్ జనరేషన్ దర్శకులు, రచయితలు తనకు స్ఫూర్తి అంటారు.
ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు పూరి జగన్నాధ్ రైటింగ్ కి నేను పెద్ద ఫ్యాన్. అదే సమయంలో శత్రువులా ఫీల్ అవుతా. నా వాల్ పేపర్ ఆయన ఫోటోనే ఉంటుందని… లైవ్ లో చూపించాడు. దేశం మెచ్చిన దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, పూరి జగన్నాధ్ ఫోటో వాల్ పేపర్ గా పెట్టుకోవడం ఊహించని పరిణామం. తాజాగా మరో దర్శకుడి మీద ఆయన ప్రశంసలు కురిపించారు.

దర్శకుడు సుకుమార్ రైటింగ్ చాలా బాగుంటుంది. పూరి, సుకుమార్ రైటింగ్స్ లో నేను విశృంఖలత చూశానని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. పుష్ప మూవీ చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయని చెప్పుకొచ్చారు. అలాగే సుకుమార్ ని చూస్తే నాకు అభద్రతాభావం, ఈర్ష్య కలుగుతాయని వెల్లడించారు. విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విజయేంద్ర ప్రసాద్ ఎప్పటికప్పుడు యంగ్ జనరేషన్ వర్క్ గమనిస్తూ, స్ఫూర్తి పొందుతూ తనని తాను అప్డేట్ చేసుకుంటూ సక్సెస్ అవుతున్నారనిపిస్తుంది.