Homeజాతీయ వార్తలుTelangana Politics: ఈసారి తెలంగాణలో హంగ్‌ వస్తే పరిస్థితి ఏంటి?

Telangana Politics: ఈసారి తెలంగాణలో హంగ్‌ వస్తే పరిస్థితి ఏంటి?

Telangana Politics
Telangana Politics

Telangana Politics: తెలంగాణలో మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసింది. ఇక తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌ పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినా ప్రజలు రెండు ఎన్నికల్లో ఆదరించలేదు. ఈసారి తామే అధికారంలోకి వస్తామని అంచనా వేస్తోంది. ఇక తెలంగాణలో దూకుడు మీద ఉన్న బీజేపీ ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అనేలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రజల్లో కూడా ఇప్పటికే కొంత పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయం అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

Also Read: Jagan- Early Elections: ముందస్తు ఎన్నికలపై క్లారిటీ.. తేల్చేసిన జగన్

బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత..
తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కుటుంబ, రాచరిక తరహా పాలనతో అన్నివర్గాల వారు విసిగిపోయారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, పేదల్లో కేసీఆర్‌ పైలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. నెలనెలా ఠంచన్‌గా వేతనాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఉద్యోగుల్లో పాలకులపై ఉన్న వ్యతిరేకత గతంలో అనేక ప్రభుత్వాలను కూల్చింది. తాజాగా తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు కూడా అదే పరిస్థితి అన్న భావన వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 40 మందిపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఆ పార్టీ అంతర్గత సర్వేలోనే తేలింది. అయినా గులాబీ బాస్‌ కేసీఆర్‌ మాత్రం సిట్టింగులకే సీట్లు అని ప్రకటించారు. అదే జరిగితే బీఆర్‌ఎస్‌కు తీవ్ర నష్టం తప్పదని ఆ పార్టీ నేతలో పేర్కొంటున్నారు. ఇటీవల ఎర్రబెల్లి కూడా తాను సర్వే చేశానని కొంతమందిపై వ్యతిరేకత ఉందని ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో సంచలనమయ్యాయి.

కాంగ్రెస్‌పై విశ్వాసం లేక..
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు గుర్తింపు ఉన్నప్పటికీ అధికారానికి మాత్రం దూరంగానే ఉంటుంది. రెండు పర్యాయాలు ఓటర్లు అధికారానికి దూరంగానే ఉంచారు. ఈసారి సానుభూతి ఉంటుందని, అధికారం వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌కు సరైన ప్రత్యామ్నాయాన్ని ప్రజలు నిర్ణయించుకోలేకపోతున్నారు. పార్టీలు కూడా ఆ భరోసా ఇవ్వలేకపోతున్నాయి. 2018లో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్‌కు ఓటు వేసినా.. అభ్యర్థులను గెలిపించినా వారు పార్టీలో ఉంటారన్న విశ్వాసం ప్రజల్లో సన్నగిలింది. దీంతో ప్రజలు కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయంగా భావించడం లేదు.

ప్రత్యామ్నాయంగా బీజేపీ..
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే బీజేపీ మాత్రమే బీఆర్‌ఎస్‌కు ఎదుర్కొగలదు అన్న భావన తెలంగాణ ప్రజల్లో ఉంది. మరోవైపు డబులింజన్‌ సర్కార్‌తో తెలంగాణకు లబ్ధి కలుగుతుందన్న అభిప్రాయం మెజారిటీ ప్రజల్లో వ్యక్తమవుతోంది. అయితే బీజేపీలో బలమైన అభ్యర్థులు లేకపోవడం ఆ పార్టీకి మైనస్‌గా మారుతోంది. వివిధ పార్టీల నుంచి పార్టీలోకి వచ్చేవారిపైనే ఆపార్టీ ఆధారపడడం, సొంత పార్టీ నేతలు బలమైన నేతలుగా ఎదగకపోవడంతో కొన్ని వర్గాలు ఓటు వేయడానికి వెనుకాడుతున్నాయి. యువత ఎక్కువగా కమలంవైపే చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ రైతులు, పేదలను ఆకట్టుకోగలిగితేనే అధికార బీఆర్‌ఎస్‌కు పోటీ ఇస్తుందన్న అభిప్రాయం రాజకీయ పండితుల్లో ఉంది.

Telangana Politics
Telangana Politics

హంగ్‌ వస్తే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొన్న నేపథ్యంలో ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా రాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ పండితులు, మూడు ప్రధాన పార్టీల అంతర్గత సర్వేలో కూడా పూర్తి మెజారిటీ రాదనే ఫలితాలే వచ్చాయి. దీంతో హంగ్‌ కాయమన్న భావన మూడు పార్టీలో ఉంది. వీటిని బలపరుస్తూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజార్టీ రాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హంగ్‌ ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. తన 35 ఏళ్ల రాజకీయ అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి 60 సీట్లు రావని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కేసీఆర్‌ కలవక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో అందరం కష్టపడితే 40–50 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండటం మాత్రం ఖాయమన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ నేతల్లోనూ ఇదే అభిప్రాయం ఉంది. కానీ వారు బయటకు చెప్పడం లేదు. బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతను అధిగమించేందుకు కేసీఆర్‌ వామపక్షాలతో పొత్తు కోసం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరు పది నుంచి 15 అసెంబ్లీ స్థానాల్లో ప్రభావితం చూపుతారన్న లెక్కలు ఇప్పటికే గులాబీ బాస్‌ వేసుకున్నట్లు సమాచారం. అయితే వారితో పొత్తు పెట్టుకుంటే ఎన్ని సీట్లు ఇస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పొత్తు ఆశిస్తున్న బీఆర్‌ఎస్‌ అధినేత వారు తెలంగాణలో సీట్లు అడిగితే ఏం నిర్ణయం తీసుకుంటార్న చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు ఇటీవల అసెంబ్లీలో కాంగ్రెస్‌ అనుకూల వ్యాఖ్యలు చేయడం వెనుక కూడా పొత్తుల ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌ ఎవరినీ ఊరికే పొగడరని, దాని వెనుక లెక్కలు వేరే ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: CM Jagan: సీట్లు, కేటాయింపులు.. అంతా ‘రెడ్ల’ మయం.. జగన్ ఇష్టా‘రాజ్యం’

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular