Homeఆంధ్రప్రదేశ్‌Mohan Babu- Somu Veerraju: మోహన్ బాబు - సోము వీర్రాజు భేటి వెనుక కథేంటి..?

Mohan Babu- Somu Veerraju: మోహన్ బాబు – సోము వీర్రాజు భేటి వెనుక కథేంటి..?

Mohan Babu- Somu Veerraju
Mohan Babu- Somu Veerraju

Mohan Babu- Somu Veerraju: రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. రాష్ట్రంలో కీలకమైన నేతలుగా భావిస్తున్న, సినీ గ్లామర్ ఉన్న వారిపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. అందుకు అనుగుణంగా పార్టీల్లో చేరికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ – టీడీపీ మధ్య నేతల జంపింగ్లు మొదలయ్యాయి. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరటం దాదాపు ఖరారు అయినట్లు చెబుతున్నారు. అదే సమయంలో మరికొందరు ప్రముఖులను తమ పార్టీలోకి ఆహ్వానించే ప్రక్రియను బిజెపి వేగవంతం చేసింది. అందులో భాగంగానే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రముఖ నటుడు మోహన్ బాబుతో సమావేశమై గంటకు పైగా చర్చించారు. ఈ భేటీ తరువాత కీలక నిర్ణయం ఉండబోతుందని బిజెపి నేతలు చెబుతున్నారు.

మోహన్ బాబు ఇంటికి వెళ్లిన సోము..

తిరుపతిలోని మంచు మోహన్ బాబు ఇంటికి పార్టీ నేతలతో కలిసి సోము వీర్రాజు వెళ్లారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దతు కోరేందుకు వెళ్లినట్లు చెబుతున్నారు. రాయలసీమ బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సన్నారెడ్డి దయాకర్ రెడ్డికి మద్దతుగా సోము వీర్రాజు ప్రచారం చేస్తున్నారు. పార్టీ నేతలతో సమావేశం తర్వాత మోహన్ బాబు సోము వీర్రాజు దాదాపు గంట సేపు ఏకాంతంగా చర్చించారు. ఇందులో పలు రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పట్ల ఆసక్తి ఉన్నవారి చేరికలను వేగవంతం చేయాలని పార్టీ నాయకత్వం రెండు రాష్ట్రాల నేతలకు సూచించడంతో అందుకు అనుగుణంగానే నాయకులు కార్యాచరణ ప్రారంభించారు. ఏపీలో త్వరలో బిజెపిలో భారీగా చేరికలు ఉంటాయని కొద్ది రోజుల క్రితమే పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు. అందులో భాగంగానే మాజీ సీఎం కిరణ్ చేరిక ఖాయమైంది. ఇప్పుడు మరో ఇద్దరు ముఖ్యనేతల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.

మోహన్ బాబు ఆలోచన ఏమిటి..?

ఎన్టీఆర్ హయాంలో టీడీపీ లో పనిచేసిన మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతుగా ప్రచారాన్ని చేపట్టారు. జగన్ సీఎం కావాలని కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు కలవలేదు. మంచు విష్ణు మాత్రం జగన్ ఇంటికి వెళ్లి కలిశారు. మోహన్ బాబుకు టీటీడీ చైర్మన్, రాజ్యసభ ఎంపీ లేదా ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇస్తారని ప్రచారం సాగింది. మోహన్ బాబు మాత్రం తాను జగన్ సీఎం కావాలని కోరుకున్నానని ఎటువంటి పదవి ఆశించలేదని స్పష్టం చేశారు. కానీ కొద్ది నెలల క్రితం అనూహ్యంగా మోహన్ బాబు హైదరాబాదులో టిడిపి అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో మోహన్ బాబు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సాయిబాబా ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించేందుకు కలిసినట్లు చెప్పుకొచ్చారు. కానీ రాజకీయంగా మోహన్ బాబు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతానికి రాజకీయంగా దూరంగా ఉన్నప్పటికీ ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఆయనపై ప్రధాన పార్టీల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.

Mohan Babu- Somu Veerraju
Mohan Babu

బిజెపిలోకి ఎంట్రీ ఇస్తారా..?

మోహన్ బాబు పలు సందర్భాల్లో ప్రధాన మోడీ పైన అభిమానాన్ని చాటుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానితో సమావేశమయ్యారు. ఆ సమయంలోనే బిజెపిలో మోహన్ బాబు చేరుతున్నారన్న చర్చ పెద్ద ఎత్తున సాగింది. కానీ ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం క్రమేన వేడెక్కుతోంది. బిజెపి పెద్దలు పార్టీలోకి వచ్చేవారిని గుర్తించి చర్చలు జరపాలని రాష్ట్ర నాయకత్వానికి సూచించడంతో ఆ దిశగానే కార్యాచరణ ప్రారంభించారు. తాజా మోహన్ బాబు – సోము వీర్రాజు భేటీ వెనక చేరికల అంశం దాగి ఉందన్న ప్రచారం సాగుతోంది. అయితే మోహన్ బాబు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారన్న ఆసక్తి అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో నెలకొంది.

 

పవన్ కళ్యాణ్ రాష్ట్రంపై ప్రేమ రాజకీయాల కతీతం || Hats off to Pawan Kalyan || Ok Telugu

Exit mobile version