Dil Raju: సీజన్ ఏదైనా సినిమా బిజినెస్ నా కనుసన్నల్లో నడవాలని దిల్ రాజు ఫీలింగ్. ఆయన పైకి చెప్పకపోయినా చర్యలు అలాగే ఉన్నాయి. మిగతా చిత్రాలకు థియేటర్స్ దొరక్కుండా మీరు పెద్ద స్కెచ్ వేస్తున్నారటగా… అని అడిగితే, అంతా తప్పుడు ప్రచారం అన్నారు. సంక్రాంతికి విడుదలయ్యే ప్రతి సినిమాకు థియేటర్స్ దొరుకుతాయి. అలాగే సినిమా బిజినెస్ ఏ ఒక్కడు శాసించలేడు, బాగున్న సినిమాను జనాలు చూస్తారు. సంక్రాంతి చిత్రాలకు థియేటర్స్ పంపకాలు ఇంకా జరగలేదు. అదంతా… పండగకు వారం పది రోజుల ముందు తేలే వ్యవహారం, అని వివరణ ఇచ్చాడు.

సంక్రాంతి చిత్రాల థియేటర్స్ లిస్ట్ బయటకు వస్తున్న నేపథ్యంలో దిల్ రాజు మీద వినిపించిన ఆరోపణలే నిజమయ్యాయి అనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో మెజారిటీ థియేటర్స్ వారసుడు చిత్రానికి దక్కాయి. మిగిలిన థియేటర్స్ వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య పంచుకున్నాయి. అలాగే కొన్ని థియేటర్స్ అజిత్ తెగింపు చిత్రానికి కేటాయించారు. వైజాగ్ సిటీలో మేజర్ రెవెన్యూ ఇచ్చే మెలోడీ, సంగం థియేటర్స్ లో దిల్ రాజు వారసుడు విడుదల చేస్తున్నాడు. మొత్తంగా దిల్ రాజు వారసుడు చిత్రానికి 8 స్క్రీన్స్ సంపాదించారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు చెరొక నాలుగో ఐదో స్క్రీన్స్ దక్కాయి.
తన మూవీకి ఏపీ/తెలంగాణాలలో పెద్ద సంఖ్యలో థియేటర్స్ రాబట్టి దిల్ రాజు తన పంతం నెగ్గించుకున్నారు. తన ఆధిపత్యం కొనసాగుతున్న వేళ ఆయన తడబడటం అనుమానాలు కలిగిస్తుంది. వారసుడు చిత్రాన్ని ఏ తేదీన విడుదల చేయాలనే విషయంలో ఆయన కంగారు పడుతున్నాడనేది స్పష్టంగా తెలుస్తుంది. మొదట వారసుడు జనవరి 12న విడుదల చేస్తున్నట్లు చెప్పాడు. అంటే వీరసింహారెడ్డితో పాటు అదే రోజు వారసుడు థియేటర్స్ లోకి వస్తుందని అనుకున్నారు.
జనవరి 12 కాదని ముందుకు జరిపి జనవరి 11గా నిర్ణయించాడు. ఆరోజు అజిత్ తెగింపు విడుదల అవుతుంది. తాజా సమాచారం ప్రకారం జనవరి 11న తమిళ వర్షన్ వారిసు మాత్రమే విడుదల చేయబోతున్నారట. వారసుడు చిత్రాన్ని దిల్ రాజు 11న విడుదల చేయడం లేదట. ఆయన మరో తేదీని ఎంచుకునే పనిలో ఉన్నారట. సినిమాను రిలీజ్ చేసుకోవడానికి థియేటర్స్ సిద్ధంగా ఉన్నాయి. అంతా ఆయన అనుకున్నట్లే జరుగుతుంది. అయినప్పటికీ ఈ తడబాటు ఏమిటో అర్థం కావడం లేదు.

సంక్రాంతి రేసులో బాలయ్య, చిరంజీవి వంటి బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి దిల్ రాజు తడబడుతున్నాడో, లేక తన తెలివి తేటలతో కన్ఫ్యూజ్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు. దిల్ రాజు చర్యలను టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. డిస్ట్రిబ్యూషన్ రంగంలో అపార అనుభవం ఉన్న దిల్ రాజు తప్పుడు నిర్ణయాలు అయితే తీసుకోడు. ఇక మొదటి నుండి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ ని దెబ్బ తీయాలని ప్రణాళికలు వేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగానే వారసుడు విడుదల తేదీ వెనక్కి ముందుకు అంటూ తికమక పెడుతున్నాడా? అనే సందేహాలు కలుగుతున్నాయి.