
YS Viveka Case: వివేక హత్యకేసు ఓ కొలిక్కి తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సీబీఐ అరెస్టులు ముమ్మరం చేసింది. ఈ నెలాఖరుకు ఫైనల్ రిపోర్టు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నో మలుపులు తిరుగుతున్న వివేకా హత్య జరిగినప్పటి పరిణామాలు ఒకసారి పరిశీలిస్తే, ప్రస్తుతం జరుగుతున్న దానికి పొంతన ఉండదు. నిజం ఎప్పటికీ దాగదు, అబద్ధం ఎన్నటికీ అతగదని నాలుగేళ్లలో జరిగిన రిపోర్టును బట్టి ఇట్టే తెలిపిసోతుంది.
సరిగ్గా 2019 ఎన్నికల ముందు వివేకా హత్య జరిగింది. అప్పటికే జగన్ పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. జైలుకు కూడా వెళ్లివచ్చారు. టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. పాదయాత్ర కూడా ముగిసింది. రాష్ట్రం మొత్తం చుట్టేశారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివేకా హత్య జరిగింది. ఆ మరుక్షణమే దానికి సానుభూతిగా మలుచుకునే ప్రయత్నాలు చేసినట్లు ప్రస్తుతం జరుగుతున్న అరెస్టులను బట్టి అర్థమవుతోంది.
వివేకా హత్య జరిగినప్పుడు వైసీపీ నేతలు, జగన్ పొంతన లేకుండా మాట్లాడారు. కానీ, అప్పుడు సాక్షిని అడ్డు పెట్టుకున్న జగన్ చంద్రబాబు కత్తి చేతిలో పట్టుకున్నట్లు నిలువెత్తు ఫొటో ఒకటి ‘‘నారాసుర రక్త చరిత్ర’’ అని ముద్రించారు. అప్పట్లో సాక్షిని మిగతా ప్యాపర్ల కంటే చాలా తక్కువ ధరకు అందిస్తున్నారు. ఇంటింటికి ఫ్రీగా కూడా పంచిపెట్టారు. జగన్ ను అణగదొక్కేందుకు చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారని కథనాలు వండివార్చారు. రాజకీయ ఆధిపత్యం కోసమే చంద్రబాబు హత్యా రాజకీయాలకు సిద్ధపడ్డారని జగన్ పలుమార్లు అన్నారు. చిన్నాన్న హత్య కేసును నిష్ఫక్షపాతంగా విచారణ జరిపించి నిజానిజాలను నిగ్గు తేల్చాలని గవర్నర్ ను కూడా ఫిర్యాదు చేశారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే సీబీఐ ఎంక్వైరీ వేయిస్తానని ప్రకటించారు.
ప్రజల్లో సానుభూతి, సెంటిమెంట్ ను పొందేందుకు జగన్ సఫలీకృతులయ్యారు. వివేకా హత్య జరిగినప్పుడు ఒక లేఖ ఆయన దగ్గరలోనే పడి ఉందని పోలీసులు చూపారు. జగన్ అప్పట్లో ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఈ విషయంపై దుమదుమలాడారు. ‘‘ చిన్నాన్నను పడక గదిలో గొడ్డలితో నరికి, బాత్రూంలో తీసుకెళ్లి పడవేశారు. ఒకటి కాదు నాలుగుసార్లు తలపై గొడ్డలి వేటు ఉంది. మూర్చవచ్చి పడిపోయినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కుట్ర కోణంలా ఉంది’’ అని జగన్ అన్నారు. టీడీపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదు. నిజా నిజాలు బయటకు రావాలి. ఎంత పెద్దవారైనా బయటకు రావాలి. రాష్ట్రంలో దుష్ట రాజకీయాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత సీబీఐ ఎంక్వైరీ అడుగు కూడా ముందు పడకపోవడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అయితే, ఆ లేఖ వట్టిదేనని తేలిపోయింది.

చంద్రబాబే వివేకాను దగ్గరుండి హత్య చేయించారనేలా జగన్, వైసీపీ నేతలు అప్పట్లో మాట్లాడుతూ సానుభూతి పండించే ప్రయత్నం చేశారు. ఆదినారాయణ రెడ్డిని టీడీపీలో చేర్చుకొని, వైసీపీ వాళ్లను దెబ్బకొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించడం దుర్మార్గమని అన్నారు. కేసును చంద్రబాబు సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదని జగన్ ప్రశ్నించారు. దీనిపై హైకోర్టులో ఒక పిల్ కూడా వేసేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వివేకా హత్య విచారణ విషయంలో సైలెంట్ అయిపోయారు. 2020 ఫిబ్రవరిలో హై కోర్టుకు ఎలాంటి విచారణ ఉత్తర్వులు అవసరం లేదని, మూసేయాలని అనడం విస్మయానికి గురిచేసింది.
కాగా, అవినాష్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై 2021 నవంబరు 19న అసెంబ్లీలో జగన్ మాట్లాడారు. చిన్నాన్న కొడుకు, నాకు సొంత తమ్ముడు అయిన అవినాష్ రెడ్డి ఎందుకు హత్య చేయిస్తారని ఖండించారు. ఒక కన్ను మరొక కన్నును పొడుచుకుంటుందా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు అధికారం కోల్పోయాక తమ కుటుంబంలో పొరపొచ్చాలు తీసుకువచ్చేందుకు వక్రీకరించి మాట్లాడుతున్నారని అన్నారు. చాలా బాధేస్తుంది అన్నారు.
ఇదిలా ఉండగా, ఎంపీ విజయసాయిరెడ్డి అయితే, వివేకా ఏకంగా గుండెపోటుతోనే చనిపోయినట్లు స్టేట్ మెంట్ ఇచ్చేశారు. ఆయన మరణం తనను కలిచివేసిందని, ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన ఆయన పార్టీకి దూరమవడం దురదృష్టకరమని అన్నారు.
కాగా, సీబీఐ వేస్తున్న ప్రతి అడుగు అవినాష్ రెడ్డి చుట్టూనే తిరుగుతుంది. ఆయన అనుచరుల్లో ప్రధానంగా శివశంకర్ రెడ్డి, ఉదయ్ లను అరెస్టయ్యారు. తాజాగా వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు కలకలం సృష్టిస్తుంది. కేసును కొలిక్కి తీసుకువచ్చే క్రమంలో దూకుడు పెంచిన సీబీఐ గూగుల్ టేకోవర్ వంటి అధునాతన టెక్నాలిజీ సాయం తీసుకొని పకడ్బందీగా ముందుకు వెళ్తుంది. నిజానిజాలు ఇంకా వెల్లడించలేదు. అరెస్టులు ఇంతటితో ఆగుతాయా లేక టీడీపీ ఆరోపిస్తున్నట్లు తాడేపల్లి చివరి వ్యక్తి వరకు అరెస్టులు ఉంటాయా అన్నది మరికొద్ది రోజుల్లోనే తెలియనున్నది.