Wedding Season: మూడు ముళ్ళు.. ఏడు అడుగులు.. నిండుగా బంధువులు.. మెండుగా సంబరాలు.. ఒకప్పుడు పెళ్లంటే ఇలానే జరిగేది. కానీ ఇప్పుడు పెళ్లి స్వరూపం పూర్తిగా మారిపోయింది. కుటుంబాలలో ఆర్థిక స్థిరత్వం పెరిగిపోవడంతో ఆడంబరం ఎక్కువైంది. పెళ్లి వేదిక నుంచి హనీమూన్ దాకా ప్రతి ఒక్కటి కార్పొరేట్ కళ సంతరించుకున్నాయి. వధూవరులు, మరి బంధువులు ఉత్తి చేతులతో వస్తే చాలు.. మంగళ స్నానం నుంచి హనీమూన్ దాకా అన్ని పలు కార్పొరేట్ సంస్థలు చక్క పెడుతున్నాయి. ఇందులో దండిగా ఆదాయం ఉండటంతో పెద్ద పెద్ద కంపెనీలు కూడా పలు ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. అందువల్లే పెళ్లిళ్ల కాలం ఒక వ్యాపార సీజన్ అయిపోయింది. ప్రస్తుతం కార్తీక మాసం సమీపిస్తున్న నేపథ్యంలో దేశంలో పెళ్లిళ్ళ సీజన్ ప్రారంభమైంది.
పెద్ద బిజినెస్
దేశంలో పెళ్లిళ్ల సీజన్ పెద్ద బిజినెస్‌గా మారింది. ఈ ఏడాది నవంబరు 23 నుంచి వచ్చే ఏడాది (2024) జూలై వరకు కొనసాగే ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా జరిగే 35 లక్షల మూడు ముళ్ల బంధాలతో రూ.4.25 లక్షల కోట్ల వ్యాపార అవకాశాలు ఏర్పడతాయని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేస్తోంది. ఇందులో రూ.లక్ష కోట్ల వ్యాపారం ఢిల్లీలో జరిగే 3.5 లక్షల పెళ్లిళ్లతోనే సమకూరనుంది. దీంతో బంగారం, దుస్తులు, మ్యారేజ్ హాల్స్, డెకరేటర్స్, క్యాటరింగ్ సంస్థలు, ఈవెంట్ మేనేజర్లకు మంచి డిమాండ్ ఏర్పడనుంది.
తాహతు కొద్దీ ఖర్చు
పెళ్లిళ్ల పాటు పెళ్లి ఖర్చు లూ పెరిగిపోతున్నాయి. కట్న కానుకలతో పాటు వధూవరుల తల్లిదండ్రులు ఖర్చులకు ఏ మాత్రం వెనకాడడం లేదు. కొంతమంది తల్లిదండ్రులైతే అప్పులు చేసి మరీ తమ పిల్లల పెళ్లిళ్లు గ్రాండ్‌గా చేసేందుకు ఇష్టపడుతున్నారు. గత ఏడాది దేశవ్యాప్తంగా 32 లక్షల పెళ్లిళ్లు జరిగితే.. రూ.3.75 లక్షల కోట్ల వ్యాపార అవకాశాలు ఏర్పడినట్లు సీఏఐటీ చెబుతోంది. ఈ సీజన్‌లో జరిగే 16 లక్షల పెళ్లిళ్లలో ఒక్కో పెళ్లికి సగటున రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఖర్చవుతుందని ఓ అంచనా. ఇంకో 12 లక్షల పెళ్లిళ్లకు సగటున రూ.10 లక్షలు, ఆరు లక్షల పెళ్లిళ్లకు రూ.25 లక్షలు ఖర్చవుతాయని తెలుస్తోంది. మిగతా లక్ష పెళ్లిళ్లకు సగటున రూ.50 లక్షల నుంచి రూ.కోటిపైన ఖర్చు చేస్తారని సమాచారం.
వ్యాపారులు రెడీ
ఈ వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వ్యాపారులు ఇప్పటికే సిద్ధమయ్యారు. అడిగిందే తడవుగా అందించేందుకు నగలు, బట్టలు పెద్దఎత్తున స్టాక్ చేశారు. మొత్తం పెళ్లి ఖర్చులో 20 శాతం వధూవరుల బట్టలు, నగలకే ఖర్చవుతుందని అంచనా. మిగతా 80 శాతం మాత్రం ఇతరత్రా ఖర్చులు. మొత్తం మీద ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్ పెద్ద బిజినెస్ సీజన్ కానుంది.