
Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయా? కొద్దిరోజుల్లో అరెస్ట్ లు ప్రారంభం కానున్నాయా? సీబీఐ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారా? కేంద్ర పెద్దలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా? ఇక మిగిలింది అరెస్ట్ లేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తెలంగాణకు మారిన తరువాతే సీబీఐ దూకుడు పెంచింది. ఎలాగైనా నిందితులకు శిక్షపడేలా చూడాలని సీబీఐ అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. అటు కేంద్ర పెద్దల నుంచి సైతం ఆదేశాలు రావడంతో శరవేగంగా పావులు కదుపుతున్నారు. అనుమానితుల విచారణను పూర్తిచేసి వీలైనంత త్వరగా కేసును ఒక కొలిక్కి తేవాలని భావిస్తున్నారు.
తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డికి విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు. దీంతో ఈ అంశం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏదో జరగబోతుందన్న సంకేతం మాత్రం వెలువడుతోంది. గత ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో ఈ ఎపిసోడ్ వైసీపీకి రాజకీయంగా ఎంతగానో మైలేజ్ ఇచ్చింది. కానీ ఎన్నికల అనంతరం తదనంతర పరిణామాలతో అదే అంశం వైసీపీ మెడకు చుట్టుకుంది. ప్రధానంగా ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. వారి వెనుక కీలక వ్యక్తులు ఉన్నట్టు ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టుగానే అనుమానితల విచారణలు జరిగాయి. ఇప్పుడు ఏకంగా ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులివ్వడం గమనార్హం.
వివేకా హత్య ఘటన జరిగినప్పటి నుంచి సాక్షాధారాలు చెరిపించే వరకూ అన్ని చేతులు అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. సీబీఐ విచారణకు ఇప్పటికే అవినాష్ రెడ్డి ఒకసారి హాజరయ్యారు. ఆయనిచ్చిన కీలక వాంగ్మూలంతో కీలక ప్రజాప్రతినిధుల పేర్ల బయటకు వచ్చినట్టు ప్రచారం జరిగింది. అదే సమయంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని…లోక్ సభ స్పీకర్ అనుమతి తీసుకున్నారని కూడా టాక్ నడిచింది. వివేకా హత్య గురించి తనకు ఉదయమే తేలిసిందని అవినాష్ రెడ్డి వాదిస్తున్నారు. అటువంటప్పుడు వేకువజామున మూడున్నర గంటలకే జగన్, భారతీ పీఏలతో ఎందుకు సంప్రదించారన్న అంశంపైనే సీబీఐ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తంగా వివేకా హత్య కేసుచిక్కుముడి విప్పడం సీబీఐకి అంత సమయం పట్టదు. కానీ పొలిటికల్ హై ప్రొఫైల్ కేసు కావడం, రాజకీయ ఒత్తిళ్లు కారణంగా కావాలనే జాప్యం చేసినట్టు విమర్శలున్నాయి.

అయితే తెలంగాణకు కేసు మారిన తరువాత సీబీఐ వేగం పెంచింది. ఏపీలో రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు సీబీఐ అధికారుల్లో కసిని పెంచాయని తెలుస్తోంది. అందుకే నిందితులను వదలకూడదని డిసైడ్ అయినట్టు సమాచారం. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో దర్యాప్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే రెండోసారి ఎంపీ అవినాష్ రెడ్డి విచారిస్తున్నారు. అటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి సైతం నోటీసులిచ్చారు. దీంతో వివేకా హత్య కేసు విచారణ క్లైమాక్స్ కు వచ్చినట్టేనని అంతా భావిస్తున్నారు.