
Heart Transplant : ఒక విద్యార్థి బ్రెయిన్ డెడ్ ఆ కుటుంబంలో అంతులేని విషాదం మిగల్చగా.. మరో కుటుంబంలో మాత్రం వెలుగులు నింపింది. బ్రెయిన్ డెడ్ అయిన విద్యార్థి కుటుంబసభ్యుల త్యాగం.. మరో చిన్నారికి పునర్జన్మ ఇచ్చింది. గుండె మార్పిడి చికిత్స సక్సెస్ కావడంతో చిన్నారి ప్రాణాలతో బయటపడగా.. కుమారుడి అవయవాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు ఆ తల్లిదండ్రులు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మల్లారెడ్డి మోహన్, గిరిజాకల్యాణి దంపతుల కుమారుడు కిరణ్ చంద్ అనే కుమారుడు ఉన్నాడు. ఇటీవల పదో తరగతి పరీక్షలు రాస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. విశాఖలోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా బ్రెయిన్ డెడ్ అని వైద్యులు నిర్థారించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు ఇలా అయ్యేసరికి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. వారి బాధను చూసిన వైద్యులు అవయవదానంపై వారికి అవగాహన కల్పించారు. దీంతో వారు అవయవ దానానికి ముందుకొచ్చారు. గుండె, కళ్లు, కిడ్నీలు, లివర్ దానానికి ముందుకు రావడంతో జీవన్ దాన్ వివరాలు పొందుపరిచారు.
జీవన్ దాన్ ద్వారా తెలుసుకొని..
ఇటువంటి పరిస్థితుల్లో జీవన్ దాన్ ద్వారా వివరాలు తెలుసుకున్న తిరుపతిలోని పద్మావతి హృదయాలయ వైద్యులు సంప్రదించారు. ఓ చిన్నారి అంపశయ్యపై ఉందని.. తక్షణం గుండె మార్పిడి అవసరమని చెప్పుకొచ్చారు. దీనికి కిరణ్ చంద్ తల్లిదండ్రులు సమ్మతించారు. దీంతో హుటాహుటిన గుండెను తిరుపతి హృదయాలయ తరలించే ఏర్పాటుచేశారు. గ్రీన్‌ఛానల్ ద్వారా విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో బాలుడి గుండెను ఆదివారం సాయంత్రం 6.14 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి తీసుకొచ్చారు. ఎయిర్ పోర్టు నుంచి గుండె ఉన్న బాక్సుతో ప్రత్యేక అంబులెన్సు సాయంత్రం 6.19 గంటలకు బయలుదేరింది. రహదారి వెంబడి పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. భారీ వర్షంలోనూ పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్సు చేస్తూ నిలబడ్డారు. ఇలా.. 6.26 గంటలకు రామకృష్ణాపురం సర్కిల్, 6.28కి గాజులమండ్యం సర్కిల్, 6.34కి తనపల్లి క్రాస్, 6.37కి రామానుజపల్లి సర్కిల్, 6.40కి వెస్ట్ చర్చి సర్కిల్, 6.44కి రామకృష్ణ థియేటర్ సర్కిల్ మీదుగా 6.46 గంటలకు శ్రీ పద్మావతి హృదయాలయానికి అంబులెన్సు చేరింది. వెనువెంటనే గుండెను ఆస్పత్రి లోపలకు తీసుకెళ్లి శస్త్రచికిత్స ప్రారంభించారు
నిరుపేద కుటుంబం..
నెల్లూరు జిల్లా తడ మండలం రామాపురానికి చెందిన అన్బరుసు, గోమతి దంపతులకు ఐదున్నరేళ్ల పాప రితిక ఉంది. రెండేళ్ల వయసు నుంచి రితిక తరచూ అనారోగ్యం బారిన పడుతూ ఉండేది. ఎంతమంది డాక్టర్లకు చూపించినా నయం కాలేదు. చివరకు పాపకు గుండె సమస్య ఉందని డాక్టర్లు నిర్థారించారు. . గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించారు. అయితే గుండె మార్పిడి శస్త్రచికిత్సకు రూ. 20 లక్షలకుపైగా ఖర్చవుతుందని అక్కడి వైద్యులు చెప్పారు. శ్రీసిటీలో పనిచేసుకునే తనకు అంత ఖర్చు పెట్టుకునే స్థోమత లేదని అన్బరుసు చెప్పడంతో అక్కడి డాక్టర్లు సలహా ఇచ్చారు. తిరుపతిలోని పద్మావతి హృదయాలయాన్ని సంప్రదించాలని సూచించారు. దీంతో అక్కడకు నాలుగు నెలల కిందట పాపను ఇక్కడకు తీసుకొచ్చారు. పాపకు గుండె మార్పిడి చేయాలని.. సరిపడా గుండె దొరికితే శస్త్రచికిత్స చేస్తామని ఇక్కడి వైద్యులు చెప్పారు. పాప వివరాలను జీవన్‌దాన్ కింద నమోదు చేశారు. కిరణ్ చంద్ బ్రెయిన్ డెడ్ కావడం, ఆ గుండె సరిపోతుందని నిర్థారణ కావడంతో రితిక కు అమర్చారు. కిరణ్ చంద్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటామని అన్బరుసు కన్నీటిపర్యంతమవుతూ చెబుతున్నాడు.