Viral News : కుక్కకు ఇంత అన్నం పడేస్తే.. అలా పెట్టినందుకు కృతజ్ఞతగా యజమానిపై విశ్వాసం చూపిస్తుంది. అదే పాముకు పాలు పోస్తే.. పాలు పోశారనే విశ్వాసం కూడా లేకుండా కాటు వేస్తుంది.. ఇవే కదా మన చిన్నప్పటి నుంచి చదువుకుంది. అయితే సర్పం విషయంలో ఇది తప్పని నిరూపిస్తోంది ఓ నాగుపాము. తమను కాపాడితే.. యజమానిపై విశ్వాసం చూపిస్తామని చేతల్లో నిరూపిస్తోంది.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం భూజరం పేట కూకట్లపల్లి గ్రామ శివారులో కర్నే హరీష్ రెడ్డి అనే వ్యక్తికి మామిడి తోట ఉంది. ఆ మామిడి తోటకు రక్షణగా అతడు కంచె నిర్మించాడు. అది ఇనుప తీగలతో నిర్మించింది కావడంతో.. అందులో ఒక నాగుపాము చిక్కుకు పోయింది. దీంతో పాపం అనుకుంటూ హరీష్ రెడ్డి దాన్ని కాపాడాడు. దానిని మట్టు పెట్టకుండా వదిలిపెట్టాడు. దీంతో ఆ పాము బతుకు జీవుడా అనుకుంటూ సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లిపోయింది.
ఇక అప్పటినుంచి ఆ పాము ప్రతిరోజు మా మామిడి తోట వద్దకు వస్తోంది. అక్కడే పని చేసుకుంటున్న హరీష్ రెడ్డిని చూస్తోంది. ఒక చెట్టుపైకి ఎక్కి పడగవిప్పి అటు ఇటు చూస్తోంది. హరీష్ రెడ్డి వెళ్లిపోయిన తర్వాత ఆ పాము కూడా అడవిలోకి జారుకుంటున్నది. ఆ పాము అలా వస్తుండటాన్ని చూసిన స్థానికులు ముందుగా భయపడ్డారు. తర్వాత హరీష్ రెడ్డి చెప్పింది విని ఆశ్చర్యపోయారు. పడగవిప్పి హరీష్ రెడ్డికి, అతడి చేనుకు కాపలా కాస్తున్న తీరును చూసి విస్తు పోయారు. పడగవిప్పిన ఆ పామును చూసి దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు.. కాగా ఈ దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల నుంచి ప్రజలు వస్తుండటం విశేషం.