Viral News : కొన్ని సార్లు మన జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అవి మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంటాయి. అలాంటి ఒక వింత సంఘటనే లండన్‌లో జరిగింది. 25 ఏళ్ల బెక్కా రీడ్ అనే అమ్మాయి 2022 మే 16న తన స్నేహితులతో వాలీబాల్ ఆడుతుండగా బంతి స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయింది. దాన్ని తీసుకోవడానికి బెక్కా పూల్‌లోకి దిగగానే ఆమె తల పూల్ అడుగున ఉన్న కాంక్రీట్ బేస్‌కి బలంగా తగిలింది. ఈ ప్రమాదం ఎంత భయంకరమైనదంటే తన జీవితం ఆ ప్రమాదం తర్వాత పూర్తిగా మారిపోయింది.
మీడియాతో బెక్కా రీడ్ మాట్లాడుతూ .. “అది విప్లాష్ (మెడకు తగిలే గాయం) అనిపించింది. అదే బాధతో నేను లండన్‌కు తిరిగి వచ్చాను. అక్కడ ఎక్స్‌రే తీయించుకున్నాను. రిపోర్ట్ చూసిన డాక్టర్ నన్ను ఆశ్చర్యంగా చూస్తూ నువ్వు ఎలా బతికున్నావ్? అని అడిగారు. తర్వాత డాక్టర్లు నాకు కొన్ని మందులు ఇచ్చారు. అవి వేసుకున్న తర్వాత నేను మంచం మీద స్పృహ లేకుండా పడుకునేదాన్ని. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నాకు చాలా నొప్పిగా ఉండేది కానీ ఎటువంటి గాయం బయటికి కనిపించలేదు. దీని గురించి డాక్టర్లతో మాట్లాడినప్పుడు.. వీపు, భుజాల కండరాలు నా వెన్నుపూస కదలకుండా ఆపాయని లేకపోతే నా తల పూర్తిగా విరిగిపోయేదని చెప్పారు.’’ అని చెప్పింది.
రెండు ఆపరేషన్ల తర్వాత డాక్టర్ ఏమన్నారంటే?
డాక్టర్లు బెక్కాతో మాట్లాడుతూ “నువ్వు చాలా ఫిట్‌గా ఉన్నావు. ఈ గాయానికి నీ శరీరం బాగా సహకరించింది. ఇంకెవరైనా అయితే సరిగ్గా నడవడమే కాదు, మాట్లాడటం కూడా కష్టమయ్యేది” అన్నారు. డాక్టర్ల మాటలు విన్న తర్వాత బెక్కా రీడ్ ధైర్యం తెచ్చుకుని మళ్లీ జిమ్‌కు వెళ్లడం మొదలుపెట్టింది. కానీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. దాంతో ఆమె NHS 111కి కాల్ చేసింది. ఆమెను నార్త్ మిడిల్‌సెక్స్ యూనివర్సిటీ హాస్పిటల్‌లోని సంబంధింత విభాగానికి పంపారు. అక్కడ ఆమెకు C5, C6 వెన్నుపూసలు విరిగిపోయాయని తెలిసింది.
ఆ తర్వాత బెక్కా రీడ్ ను రాయల్ లండన్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆమెకు రెండు పెద్ద ఆపరేషన్లు జరిగాయి. రాడ్లు, స్క్రూలు వేసి ఆమె మెడను స్థిరీకరించారు. సర్జన్ మాట్లాడుతూ, బెక్కా రీడ్ వెయిట్ లిఫ్టింగ్ అలవాటు వల్ల ఏర్పడిన అసాధారణమైన కండరాలు ఆమె ప్రాణాలను కాపాడాయని చెప్పారు.