Madhya Pradesh: మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. లైంగిక చర్యలు శృతిమించుతున్నాయి. దీంతో సమాజంలో వారి మనుగడ ప్రశ్నార్తకంగామారే అవకాశం ఉంది. నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఉన్నా వారికి భయం కలిగించడం లేదు. ఉరిశిక్షలు అమలు అవుతున్నా మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు వేధింపులు మొదలు. ఈ నేపథ్యంలో వారు బయటకు రావాలంటే భయమే వేస్తోంది. ఒంటరిగా కనిపిస్తే అంతే సంగతి. మనుషుల్లో పశువులు దాగి ఉన్నట్లుగా వారి చేష్టలుండటం గమనార్హం. మానవ నాగరికత పరిణతి చెందుతున్న క్రమంతో మనుషుల్లో జంతు సంస్కృతి కూడా పెరుగుతోంది. ఎక్కడికైనా తోడు లేకుండా వెళ్లాలంటే ఇబ్బందే. మనిషి కోతి నుంచి పుట్టాడని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు ఏముంటాయి.

తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తన పనుల కోసం ఆటోలో ఎక్కింది. ఆమె ఎక్కినప్పుడు ఇద్దరు మహిళలు ఉండగా వారు మధ్యలో దిగిపోయారు. అనంతరం ఓ ఇద్దరు యువకులు ఎక్కారు. దీంతో వారు ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి ఆటో డ్రైవర్ కూడా సహకరించడంతో ఆమె ఆటోనుంచి దూకి ఇంటికి వెళ్లింది. జరిగిన విషయం తల్లిదండ్రులకు చెబితే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు నిందితుల కోసం ఆరా తీస్తున్నారు. ఒంటరిగా మహిళలు ఎక్కడకు వెళ్లలేని పరిస్థితి.
మరో ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గుర్హాకాలా గ్రామంలో యువతిని దారుణంగా హత్య చేశారు. తమ మాట వినడం లేదనే కోపంతో తండ్రి, అన్న కలిసి ఆమెను తుదముట్టించారు. యువతి మరో గ్రామంలోని ఓ యువకుడిని ప్రేమించింది. దీంతో వారు అప్పుడప్పుడు కలుసుకునేవారు. విషయం ఇంట్లో వారికి తెలియడంతో పద్ధతి మార్చుకోవాలని సూచించారు. కానీ ఆమె ప్రవర్తనలో మార్పు కనిపించలేదు. దీంతో ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. కత్తితో దాడి చేసి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం పశువుల పాకలో పాతిపెట్టారు. మళ్లీ ఏం తెలియనట్లు తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు మొదట వీరిని అనుమానించి ఆరా తీయగా మొత్తం కథంతా బయటకు వచ్చింది. పరువు కోసం సొంత కూతురును హత్య చేసిన తండ్రి, సహకరించిన అన్నయ్య కటకటాలపాలయ్యారు.

మహిళలపై జరుగుతున్న దారుణాలు చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఘోరాలు చూస్తుంటే మానవ సమాజంలో ఇంతటి దాడులు చోటుచేసుకోవడం ఏ పరిణామాలకు దారి తీస్తుందో తెలియడం లేదు. రోజురోజుకు వైపరీత్యాలు పెరుగుతున్నాయి. ప్రతి నిమిషానికి కొన్ని ఆకృత్యాలు జరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మానవాళి మనుగడ ప్రశ్నార్థకంలో పడే అవకాశాలున్నాయి. ఆడవారి రక్షణకు ప్రభుత్వాలుఎన్ని చర్యలు తీసుకున్నా ఆగడం లేదు. నేరాలు ఇంకా ఎక్కువవుతున్నాయి. రాబోయేకాలంలో మహిళలపై దాడులు తగ్గే విధంగా కఠినమైన చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.