Protecting Sparrow : పక్షులు… అవి ఒక జాతికాదు.. నాశనం చేయబడిన పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించే సాధనాలు. మొక్కల జీవితాన్ని ప్రభావితం చేసే గొప్ప గుణాలు ఉన్న జీవులు. తమ ప్రయాణంలో ఆహార గింజలను తమ వెంట తీసుకెళతాయి. మలవిసర్జజనతో విత్తనాలుగా మారుస్తాయి. అవి మొలకెత్తి మొక్కలు.. ఆపై చెట్లగా మారి మానవ మనుగడకు ఇతోధికంగా సాయమందిస్తాయి. కానీ టెక్నాలజీ మాటున పక్షి జాతి అంతరించిపోతోంది. చేజేతులా మనమే నాశం చేసుకుంటున్నాం. మూడు దశాబ్దలు కిందట పల్లెలు, పట్టణాలు, నగరాలు అన్న తేడా లేకుండా విహరించే పక్షులు..నేడు కుగ్రామాలకే పరిమితమవుతున్నాయంటే..అది మానవ తప్పిదమే.
ఇది పలానా జాతి పక్షి అని పిల్లలకు పేపర్లు, కంప్యూటర్లు చూపించేస్థాయికి పరిస్థితి వచ్చేసింది. ఏ జీవి ఏమైపోతే మనకెందుకు? మన జీవనం సవ్యంగా వెళుతుంది కదా? అని పరితపించే జనం ఉన్న నడుమ అరుదైన పక్షి జాతికి చోటులేకుండా పోతోంది. అయితే అంతరించిపోయిన పిచ్చుక జాతిని కాపాడే గురుతర బాధ్యతను తీసుకున్నారు తమిళనాడులో కరిసాలపట్టి గ్రామస్థులు. ఆ గ్రామంలో ప్రతిఇంటా పిచ్చుకుల కిలకిలారావాలు వినిపిస్తుంటాయి. సందడి చేస్తుంటాయి. తేనె పిచ్చుకలు, పాకు పిచ్చుకలు, వాలటి పిచ్చుకలు, వానపడి పిచ్చుకలు, అడకలంగురువి, కంబివాల్ పిచ్చుకలు ఇలా వర్ణభరిత శోభితంగా ఆ గ్రామంలో దర్శనమిస్తుంటాయి.

అయితే పక్షి జాతి సంరక్షణలో అక్కడి ప్రజలు చూపే శ్రద్ధ మరవరానిది. ఈ పిచ్చుకుల జీవన ప్రమాణం 13 సంవత్సరాలుగా కాగా.. సెల్ టవర్ల రేడియేషన్ ప్రభావం కారణంగా అర్ధాయుష్షుతో మరణిస్తున్నాయి. అందుకే గ్రామస్థులు తమ వంతుగా వాటి ఆయుష్షును పెంచాలని చూస్తున్నారు. పిచ్చుకలకు ప్రతిరోజూ ఒక ప్రదేశంలో నీటిని ఉంచుతున్నారు.అలాగే పిచ్చుకల జాతులను పెంపొందించాలనే లక్ష్యంతో పక్షికి గూడుగా దాదాపు 15 నుంచి 20 అడుగుల పొడవున్న వెదురు చెట్టుకు రంధ్రం చేసి పిచ్చుకలు గుడ్లు పెట్టి పొదిగేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు.అదేవిధంగా, చెక్క పలకలతో ఇంటి ఆకారంలో ఒక చిన్న పిచ్చుక గూడును తయారు చేసి ఇళ్ల తలుపుల వద్ద ఉంచుతున్నారు. దీంతో అక్కడకు వచ్చిన పక్షులు సేదతీరుతున్నాయి. పిల్లలతో సమానంగా పక్షులను పెంచడం ఇక్కడ ఆనవాయితీ. పక్షి ప్రేమికులుగా మారిన కరిసాలపట్టి గ్రామస్థులు గ్రేట్ అన్నమాట.