Dubbed Movies 2022: అసలు సిసలైన సినిమా ప్రేమికులు తెలుగు ఆడియన్స్. భాషాబేధం లేకుండా మంచి సినిమా అంటే ఎక్కడలేని అభిమానం కురిపిస్తారు. అద్భుతమైన విజయాలు అందిస్తారు. సినిమాకు ప్రాంతీయ, భాషా భేదాలు లేవని నమ్మిన నిఖార్సైన సినిమా పిచ్చోళ్ళు. అలాగే నచ్చితే ఏ ప్రాంత హీరోకైనా అభిమానులు అయిపోతారు. అందుకే ఇతర భాషల చిత్రాలకు తెలుగులో ఎనలేని ఆదరణ దక్కుతుంది. దశాబ్దాలుగా టాలీవుడ్ లో డబ్బింగ్ చిత్రాలు చారిత్రాత్మక విజయాలు సాధిస్తున్నాయి. భాషా, భారతీయుడు, ఒకే ఒక్కడు, ఉపేంద్ర, ప్రేమాలయం, ప్రేమ పావురాలు… ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది.

2005లో డబ్బింగ్ చిత్రాలు టాలీవుడ్ ని ఏలాయి. స్ట్రయిట్ సినిమాలను కూడా వెనక్కి నెట్టి బాక్సాఫీస్ కొల్లగొట్టాయి. ఆ ఏడాది టాలీవుడ్ పై కోలీవుడ్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. గజిని, అపరిచితుడు, చంద్రముఖి, పందెం కోడి చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే మెల్లగా టాలీవుడ్ పై డబ్బింగ్ చిత్రాల ప్రభావం తగ్గుతూ వస్తుంది. కమల్ హాసన్, రజినీకాంత్ చిత్రాలు సైతం పూర్తిగా ఆదరణ కోల్పోతున్నాయి. ఒకప్పుడు తెలుగు స్టార్స్ కి సమానంగా రజినీ, కమల్ చిత్రాల ఓపెనింగ్స్ ఉండేవి.
మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత డబ్బింగ్ చిత్రాలు టాలీవుడ్ లో సత్తా చాటాయి. అయితే ఈసారి డామినేషన్ శాండిల్ వుడ్ ది అయ్యింది. నాలుగు కన్నడ చిత్రాలు తెలుగులో సూపర్ హిట్స్ గా నిలిచాయి. ముందుగా కెజిఎఫ్ 2 గురించి చెప్పుకోవాలి. 2018లో వచ్చిన పార్ట్ 1 కి కొనసాగింపుగా వచ్చిన కెజిఎఫ్ 2 అంచనాలకు మించి విజయం సాధించింది. వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో కెజిఎఫ్ 2 రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో కెజిఎఫ్ రూ. 83 కోట్ల షేర్ అందుకొని అతిపెద్ద విజయం నమోదు చేసింది. వరల్డ్ వైడ్ తెలుగు వెర్షన్ రూ. 100 కోట్లకు పైగా షేర్ సాధించింది.

నిద్రలేచిన సింహం జూలు విదిలించి బాక్సాఫీస్ ని వేటాడింది. విక్రమ్ మూవీతో లెజెండరీ హీరో కమల్ హాసన్ రికార్డులను ఊచకోత కోశాడు. దశాబ్దాలుగా హిట్ లేక ఆకలితో ఉన్న కమల్ తన మార్కెట్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. విక్రమ్ వరల్డ్ వైడ్ రూ. 450 కోట్లు రాబట్టింది. తెలుగులో రూ. 7 కోట్లు హక్కులు కొనగా… రూ. 18 కోట్ల షేర్ రాబట్టి డబుల్ ప్రాఫిట్ ఇచ్చింది. ఇక కాంతార ఈ దశాబ్దపు అద్భుతం. కలెక్షన్స్ పరంగా వెండితెర చిత్రరాజంగా నిలిచింది. రిషబ్ శెట్టి మాయ చేయగా కాంతార వరల్డ్ వైడ్ రూ. 420 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కాంతార చిత్ర బడ్జెట్ కేవలం రూ. 16 కోట్లు. తెలుగులో రూ. 2 కోట్లకు కొంటే రూ. 32 కోట్లకు పైగా షేర్ రాబట్టినట్లు సమాచారం. వీటితో పాటు కిచ్చా సుదీప్ విక్రాంత్ రోణా, రక్షిత్ శెట్టి చార్లీ 777, కార్తీ సర్దార్, రన్బీర్ కపూర్ బ్రహ్మాస్త్ర బ్రేక్ ఈవెన్ దాటి హిట్ స్టేటస్ అందుకున్నాయి.