Homeజాతీయ వార్తలుBJP Operation Akarsh: బీజేపీ ఆపరేషన్‌.. టచ్‌లోకి ‘హస్తం’ నేతలు!

BJP Operation Akarsh: బీజేపీ ఆపరేషన్‌.. టచ్‌లోకి ‘హస్తం’ నేతలు!

BJP Operation Akarsh: తెలంగాణలో బడా నేతల చేరికలకు ద్వారాలు తెరిచిన కమలనాథులు ఆపరేషన్‌ ఆకర్ష్‌ వేగవంతం చేశారు. తాజాగా టీకాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ ముఖ్యనేతలతో పలువురు కాంగ్రెస్‌ నాయకులు టచ్‌లోకి వచ్చినట్టు సమాచారం. వీరిలో మాజీ మంత్రులు మొదలుకుని మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతరస్థాయిల నాయకులు 15 నుంచి 20 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

BJP Operation Akarsh
BJP Operation Akarsh

పలువురితో సంప్రదింపులు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు పార్టీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్, ఇతర ముఖ్యనేతలతో కాంగ్రెస్‌ నాయకులు సంప్రదింపులు సాగించినట్టు తెలుస్తోంది. పలువురు కాంగ్రెస్‌ నాయకులకు దగ్గరగా ఉన్నవారు, వారి అనుచరులు ఈటలతో ఆయన నివాసంలో భేటీ అయి సంబంధిత నాయకులతో ఫోన్లో మాట్లాడించినట్టు సమాచారం. బీజేపీ చేరికల కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని కూడా పలువురు కాంగ్రెస్‌ నేతలు సంప్రదించినట్టు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్‌లో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఆ పార్టీ నేతలతో సత్సంబంధాలు కలిగిన మాజీ మంత్రులు డీకే.అరుణ, మర్రిశశిధర్‌రెడ్డి కూడా చేరికలపై హస్తం పార్టీ నేతలతో చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం.

టికెట్‌ హామీపై సస్పెన్స్‌..
బీజేపీలో చేరేవారికి మాత్రం టికెట్ల కేటాయింపుపై అటు సంజయ్, ఈటల, కొండా ఇతర నేతలు ఎవరూ కూడా ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. పార్టీలో చేరాక సంబంధిత నియోజకవర్గంలో పలుకుబడి, రాజకీయ ప్రాబల్యం, ప్రజల్లో మద్దతు వంటి అంశాలపై పార్టీపరంగా చేసే సర్వే ఆధారంగానే బలమైన అభ్యర్థికి టికెట్‌ ఇస్తామని బీజేపీ నాయకత్వం స్పష్టం చేస్తోంది. ఇదిలాఉంటే తనతో సంప్రదింపులు జరిపిన నేతలు, వారికి సంబంధించిన సమాచారాన్ని ఈటల రాజేందర్‌ సోమవారం రాత్రి పార్టీ జాతీయ నాయకత్వానికి పంపినట్లు సమాచారం.

అధిష్టానం అనుమతి తర్వాతే..
జాతీయ, రాష్ట్ర నాయకత్వాలకు ఆయా పేర్లను తెలియజేసి తదుపరి చేపట్టే కార్యాచరణకు గ్రీనన్‌ సిగ్నల్‌ కోసం రాష్ట్ర పార్టీ నేతలు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి, అసంతృప్త స్వరాలు ఒక్కసారిగా పెరగడంతోపాటు అధికార టీఆర్‌ఎస్‌లోనూ తొలిసారిగా ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రి మల్లారెడ్డిపై బహిరంగ తిరుగుబాటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు ప్రకటనలు చేయడం.. రేవంత్‌కు అనుకూలంగా ఆయన వర్గం నేతలు ఆయా కమిటీలకు రాజీనామా చేయడం వంటి పరిణామాలను బీజేపీ నాయకత్వం సునిశితంగా గమనిస్తోంది.

BJP Operation Akarsh
BJP Operation Akarsh

అమ్మో ఆ మంత్రి మాకొద్దు..
ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఒక టీఆర్‌ఎస్‌ నేతను చేర్చుకునేందుకు బీజేపీ నేతలు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివాదాస్పద మంత్రిగా ముద్రపడిన ఆ నేతను చేర్చుకుంటే పెద్ద ప్రయోజనం ఉండదని భావిస్తున్నట్టు సమాచారం. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నుంచి ముఖ్యనేతలను చేర్చుకోవడానికి ఆయన ప్రతిబంధకంగా మారొచ్చని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఈ మంత్రితోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు, ముగ్గురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ నేతలను సంప్రదించినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ముగ్గురు దాకా ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే విషయంపై ప్రాథమిక చర్చలు జరిపినట్టు సమాచారం.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version