Vijay Deverakonda new Year Party : కష్టమైనా నష్టమైనా సెలబ్రేట్ చేసుకోవడమే అంటున్నారు విజయ్ దేవరకొండ. తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసిన విజయ్ ఆసక్తికర కామెంట్ పోస్ట్ చేశారు. ముగిసిన ప్రతి ఏడాదిలో విజయాలు, అపజయాలు, నవ్వులు, ఏడుపులు… అన్నీ ఉంటాయి. ఏదేమైనా సెలబ్రేట్ చేసుకోవడమే… అంటూ కామెంట్ చేశారు. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం విజయ్ దేవరకొండ మాల్దీవ్స్ వెళ్లినట్లున్నారు. స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ షాంపేన్ తాగుతున్న ఫోటో షేర్ చేశాడు. బేర్ బాడీలో రౌడీ హీరోగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక విజయ్ దేవరకొండ 2022 ప్రోగ్రెస్ కార్డు పరిశీలిస్తే… పాస్ మార్క్స్ కూడా రాలేదు. అతడు లైగర్ రూపంలో అతిపెద్ద ప్లాప్ ఇచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన లైగర్ పూర్తిగా నిరాశపరిచింది. మూవీపై బజ్ ఏర్పడిన నేపథ్యంలో ఎక్కువ ధరలకు థియేట్రికల్ హక్కులు అమ్మారు. దీంతో బయ్యర్లు పెద్ద మొత్తంలో నష్టపోయాడు. దర్శకుడు పూరితో బయ్యర్లకు వివాదం నడిచింది. ఫెయిల్యూర్ బాధ ఒకవైపు వివాదాలు మరోవైపు విజయ్ దేవరకొండను ఇబ్బంది పెట్టాయి.
లైగర్ మూవీ బడ్జెట్ సమీకరణ, బిజినెస్ వ్యవహారాల్లో ఆర్థిక నేరాలు జరిగాయన్న ఆరోపణలపై దర్శకుడు పూరి, నిర్మాత ఛార్మిలను ఈడీ అధికారులు విచారించారు. చివరకు విజయ్ దేవరకొండ కూడా విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు 11 గంటల పాటు విజయ్ దేవరకొండను అధికారులు ప్రశ్నలు అడిగారు. లైగర్ సినిమాకు విజయ్ రెమ్యూనరేషన్ ఎంత? అది ఏ రూపంలో ఇచ్చారు? అనే కోణంలో ప్రశ్నించారు.
అలాగే పూరితో స్టార్ట్ చేసిన భారీ ప్రాజెక్ట్ జనగణమన మధ్యలో ఆగిపోయింది. లైగర్ ఫలితం చూసిన నిర్మాతలు జనగణమన మూవీ నుండి తప్పుకున్నారు. విజయ్ దేవరకొండ మరో చిత్రం ఖుషి సైతం చిక్కుల్లో పడింది. ఆ చిత్ర హీరోయిన్ సమంత మాయోసైటిస్ బారినపడ్డారు. చికిత్స తీసుకుంటున్న సమంత కొన్నాళ్ల పాటు కెమెరా ముందుకు వచ్చే అవకాశం లేదు. ఈ క్రమంలో ఖుషి చిత్రం ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2022 విజయ్ దేవరకొండకు చేదు అనుభవాలు మిగిల్చిన నేపథ్యంలో 2023 స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కావాలి అనుకుంటున్నారు. ఖుషితో పాటు దర్శకుడు సుకుమార్ తో విజయ్ దేవరకొండ ఒక మూవీ ప్రకటించారు. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లేందుకు చాలా సమయం ఉంది.