Honey Trap: హనీట్రాప్.. ఇటీవల తరచూ వినపడుతున్న పదమిది. దేశంలోని అంతర్గత విషయాలను తెలుసుకునేందుకు శత్రుదేశాలు దీనిని త్రివిధ దళాలపై ప్రయోగిస్తుంటాయి. కానీ ఇటీవల కి‘లేడీ’లు రెచ్చిపోతున్నారు. డబ్బుల కోసం సంపన్నులకు, సాఫ్ట్‌వేర్లకు గాలం వేస్తున్నారు. తమ వలలో పడ్డాక.. నిలువు దోపిడీ చేస్తున్నారు. కొంతమంది పోలీసుల సహకారంతో ఇందులో నుంచి బయట పడుతుండగా, చాలా మంది విలవిలలాడుతున్నారు. తాజాగా హనీట్రాప్‌లో చిక్కిన ఓ పెద్దయన పోలీసుల సహకారంతో బయటపడ్డాడు. అయితే అప్పటికే కిలేడీలు అతడిని నిలువు దోపిడీ చేసేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
సాయం కావాలని..
‘మా అబ్బాయి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడని, చికిత్స కోసం ఆర్థిక సాయం చేయాలంటూ ఓ మహిళ (40) చేసిన ఫోన్‌కు కు ఆయన(60) మనసు కరిగిపోయింది. గతంలో కాస్త పరిచయం ఉన్న నేపథ్యంలో మాటకలిపి ఆమె అడిగేసరికి కాదనలేక పోయారు. సరేనంటూ ఉత్తరహళ్లి రహదారిలోని ఓ హోటల్‌కు ఆమెను పిలిచి రూ.5 వేల సొమ్ము అందించారు. అక్కడితో ఆ ఇద్దరి మధ్య అనుబంధం కాస్త ముడిపడటం మొదలైంది. ఆమె చెప్పే కష్టాలన్నీ వింటూ ఊరడించడం ఆయనకు అలవాటుగా మారింది.
హోటల్‌కు పిలిచి..
ఇలా ఊరడిస్తూ.. ఓరోజు బాధితుడు ఆమెను ఎలక్ట్రానిక్ సిటీ హొస్కూర్ గేట్ సమీపంలో ఉన్న ఓ హోటల్‌కు పిలిపించాడు. గది తీసుకుని అక్కడే ఆ రోజు గడిపారు. ఇలా.. ఆ హోటల్‌లోనే రెండు, మూడుసార్లు కలిసి కాలం గడపడం ఆయనకు అనుకోని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఆయనకు తెలియకుండా ఆమె చెల్లి సెల్‌ఫోన్‌లో వారిద్దరి వ్యవహారాలు చిత్రీకరించింది.
పెద్దాయనకు వీడియోలు పంపి..
వారం రోజుల తరువాత చిత్రాలు, వీడియోలు ఆ పెద్దాయన (60)కు పంపి.. మీ రాసలీలలు ఇవీ.. అంటూ బాంబు పేల్చింది. ఆ చిత్రాలు మీ ఇంటికి చేరకుండా ఉండాలంటే కాస్త ‘సాయం’ చేయాలంటూ బేరం మొదలు పెట్టింది. ఇలా.. బలవంతపు సాయంగా రూ.82 లక్షలు గుంజారు. సతాయింపులు అంతటితో ఆగలేదు. మరో రూ.40 లక్షలు కావాలంటూ ఒత్తిడి పెంచారు.
పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..
ఆ సొమ్ము ఇవ్వకపోతే నమ్మించి, అత్యాచారానికి పాల్పడ్డావంటూ కేసు పెడతామని హెచ్చరించారు. కానీ, విషయం ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని ఆ పెద్దాయన అప్పటికే రూ.82 లక్షలు నష్టపోయాడు. మళ్లీ రూ.40 లక్షలు ఇచ్చినా వేదింపులు ఆగవని తెలుసుకున్నాడు. విధిలేని పరిస్థితిలో మంగళవారం ఠాణాకు పరుగులు తీశాడు. జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కి‘లేడీ’ల కోసం గాలిస్తున్నారు.