
Venkatesh Daggubati: 30 ఏళ్ల సినీ చరిత్ర.. కరుడు గట్టిన వాళ్ల కంట్లో నుంచి కూడా కన్నీళ్లు తెప్పించే నటుడు.. ఫ్యామిలీ చిత్రాల హీరో.. అని రకరకాల బిరుదులు సొంతం చేసుకున్నారు విక్టరీ వెంకటేశ్. యాక్షన్, మాస్ సినిమాల కంటే సెంటిమెంట్ చిత్రాలు తీసి ప్రేక్షకుల మనసు దోచుకున్నారీయన. మరోవైపు డిఫరెంట్ మూవీస్ తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న వెంకటేశ్ పై తాజాగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లు కాపాడుకున్న ఆయన పేరు ప్రతిష్టలు, ప్రేక్షకాదరణను ఒక్క వెబ్ సిరీస్ తో పొగొట్టుకున్నారని ఇండస్ట్రీలో తీవ్ర చర్చ సాగుతోంది. వెంకటేశ్ నటించి ప్రతీ సినిమాను చూసే మహిళా ప్రేక్షకులు చూడాలనుకుంటున్నారు. కానీ ఈ వెబ్ సిరీస్ చూడొద్దని వెంకటేశ్ ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి ఎందుకీ ప్రయోగం? డబ్బు కోసమేనా? లేక వినూత్నంగా కనిపించాలని ఆరాటమా?
ఈ మధ్య వెబ్ సిరీస్ లు హద్దు, అదుపు లేకుండా రిలీజ్ అవుతున్నాయి. మిగతా వాటికంటే తమది భిన్నంగా ఉండాలని కొందరు కోరుకుంటే.. మరికొందరు ఎక్కువ మంది చూడాలని ఆరాటపడుతున్నారు. ముఖ్యంగా కరుడుగట్టిన యాక్షన్ తో పాటు అదపులేని రొమాన్స్ ను జోడించి జనాల్లోకి వదులుతున్నారు. ప్రేక్షకులు ఇలాంటి వాటినే ఆదరిస్తారని వివిధ ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఇవి ఒక్కోసారి శృతి మించుతున్నాయి. సమాజానికి భిన్నంగా ఈ వెబ్ సిరీసులు ఉండడంతో నేటి యువత వీటిని అనుకరిస్తోంది. ఫలితంగా చెడు వ్యసనాలకు అలవాటు పడుతోంది.
ఇలాంటి వెబ్ సిరీస్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న వెంకటేశ్ నటించడం ఆశ్చర్యంగా ఉందని కొందరు అంటున్నారు. ‘కలియుగ పాండవులు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విక్టరీ వెంకటేశ్ ఖాతాలో వందల కొద్దీ హిట్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాలే ఉండడం విశేషం. దీంతో వెంకటేశ్ అనగానే మంచి కథతో పాటు సినిమా బాగుంటుందన్న ప్రచారం ఆడియన్స్ లో ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో ఎక్కువగా ఉంది. అయితే ఈమధ్య వెంకీ హీరోగానే కాకుండా సైడ్ పాత్రల్లోనూ కనిపిస్తున్నారు. అయితే అవి హుందాగా ఉండడంతో ఆయన అభిమానులు పెద్దగా నిరాశ చెందడం లేదు. అయితే అవకాశాలు తగ్గాయనో.. లేకా మరే కారణమో తెలియదు కానీ.. వెంకటేశ్ మొదటిసారిగా వెబ్ సిరీసులో నటించారు. అదే ‘రానా నాయుడు’.

‘రానా నాయుడు ’ట్రైలర్ రిలీజ్ నుంచే చర్చనీయాంశంగా మారింది. ఈసినిమా నిండా ఇన్ని బూతులేంటి సామి? అని అప్పటి నుంచే విమర్శలు మొదలుపెట్టారు. అయితే ముందుగా ట్రైలర్లో అలా చూపించి మెయిన్ సిరీస్ లో సెన్సార్ కటింగ్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఈనెల 10న రిలీజైన ఈ వెబ్ సీరీసులో అలాగే బూతులు వినిపించడంతో దీనిని చూసిన వాళ్లు నోరెళ్లబెడుతున్నారు. ఫ్యామిలీ చిత్రాల హీరోగా గుర్తింపు ఉన్న వెంకటేశ్ మరీ ఇలాంటి సినిమాలో నటించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
పైగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాను ఒంటరిగా చూడండంటూ హింట్ ఇవ్వడం మరింత ఆశ్చర్యకరంగా చర్చించుకుంటున్నారు. అంటే ఈ సీరీస్ ను ఎవరికోసం తీశారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలని మీరు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు మంచి పేరున్న వెంకటేశ్ ఈ ఒక్క సినిమాతో మూడు దశాబ్దాల పరుగువు పోగొట్టుకున్నారని అంటున్నారు. ఇప్పటికే కొన్ని బాలీవుడ్ వెబ్ సీరీస్ లు అడ్డు అదుపు లేకుండా ప్రసారమైన పలువురి చేత విమర్శలు తెప్పించుకున్నాయి. ఇందుతో మేమేం తక్కువ కాదని చెప్పడానికే దీనిని తీశారా? అని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.