Veera Simha Reddy Mass Review: మన దర్శకుల దరిద్రం ఏంటంటే… మన మాటల రచయితల మూర్ఖత్వం ఏంటంటే.. మన నెత్తి మాసిన హీరోల పైత్యం ఏంటంటే… ఓటీటీ రోజుల్లోనూ.. పాత చింతకాయ పచ్చడి మన ముందు పెడతారు.. ఓవైపు ప్రపంచం మొత్తం మారుతుంది రా బాబూ అంటే.. మేము ఇలానే ఉంటాం… ఇలానే తీస్తాం.. మాకు నచ్చినట్టు టిక్కెట్ రేట్లు పెంచుతాం… మీరు చచ్చినట్టు చూడాల్సిందే ఇలా ఉంది వాళ్ళ ధోరణి. ఏళ్ళు గడిచిపోతున్నప్పటికీ అదే ఫ్యాక్షన్, అదే రాయలసీమ, అవే నెత్తి మాసిన డైలాగులు, కైమా కొట్టినట్టు నరుకుడు… బాలకృష్ణకు హిట్ సినిమా కావాలి అంటే మళ్లీ అదే సమరసింహారెడ్డి పాత్ర కావాల్సిందేనా? వేరే పాత్రల జోలికి ఆయన వెళ్లడా? వెళ్లలేడా? ఆ ఇమేజ్ చట్రం నుంచి బయటికి రాలేడా? ఈ తెలుగు దర్శకులకు ఇదేం రోగం? గోపాల్ నుంచి గోపీచంద్ దాకా రాయలసీమలో ఇంకా ఇంకా ఎందుకు అలా చూపించడం? రాయలసీమ అంటే రక్తపు సీమేనా? సీమలో అడుగుపెడితే వేటకొడవళ్ళు, పారే నెత్తురేనా కనిపించేది? అసలు రాయలసీమ ఫ్యాక్షన్ కు దూరమై చాలా సంవత్సరాలు అయిపోయింది కదా? ఇంకా ఆ కత్తుల నీడలే చూపించాలా? మిలినియల్ తరంలోనూ ఈ దర్శకులకు బుద్ధి రాదా.
మాస్ అంటే… నరుక్కోవడమేనా మరి ఇంకేం కాదా? ఫ్యాన్స్ కు అలా చూపిస్తేనే నచ్చుతుందా? అలా అని ఎవరు చెప్పారు? ఓ రొటీన్ కథ, దానికి ఫార్ములా అద్దకాలు, తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే కదా! మరీ ఆ వరలక్ష్మి అన్న మీద విషపు నాగు లాగా అంతలా పగపడుతుంది ఏంటి? మాటికి మాటికి చంపాలని ఎందుకు చూస్తోంది? అసలు ఇదే సెంటిమెంట్? దీనిని మాస్ సినిమా అని ఎలా అంటాం? ఎడా పెడా మీద పడి కొట్టేసుకుని, చంపేసుకుంటే మాస్ అనాల్సిందేనా? తెలుగు హీరోలు మారరు, దర్శకులు అసలు మారరు.. ఇక వీర సింహారెడ్డి ఫస్ట్ ఆఫ్ అంత ఫ్యాన్స్ కే అంకితం.. అవే బిల్డప్పులు, రొటీన్ ఇమేజ్ బాపతు స్టెప్పులు. సెకండ్ హాఫ్ అయితే మరింత దారుణం.. తెర పైన సీరియల్ చూస్తున్నట్టు ఉంది.. బాలకృష్ణకు మాస్ సినిమా అంటే ఇప్పటికీ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, లెజెండ్ బాపతు కథలేనా? ఆ మూస ధోరణి నుంచి ఆయన బయటికి రాలేడా? వాస్తవానికి ఈ సినిమా కథ పెద్ద గొప్పదేం కాదు..క్రాక్ లాంటి సినిమాను తీసిన గోపీచంద్ ఇలాంటి సినిమా తీశాడు అంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు.. ఇక ఈ సినిమాలో బాలయ్య డబుల్ యాక్షన్. కొడుకు, తండ్రి ఆయనే. కొడుక్కి వరసైన శృతిహాసన్ కేవలం పాటల కోసం మాత్రమే ఉంది.. ఇక వాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. శృతిహాసన్ ప్యాంటు బొందెలు లాగుడు నెల బ్యాచ్ అభిమానులతో విజిల్స్ వేయిస్తుంది కావచ్చు కానీ… మిగతా ప్రేక్షకులకు పెద్దగా నచ్చదు.. ఇక థమన్ యథావిధిగా డప్పులతో హోరెత్తించాడు..కానీ బిజిఎం బాగుంది. అఖండ స్థాయిలో బిజిఎం బాదాడు.
ఎప్పటిలాగే బుర్ర సాయి మాధవ్ తన కలానికి పదును చెప్పాడు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద చురకలు అంటించే ప్రయత్నం చేశాడు. ” సవాలు విసరకు.. నేను శవాలు విసురుతా. మూతి మీద మొలిచిన ప్రతి బొచ్చు మీసం కాదు.. ఆయనను చంపే ఆయుధం పుట్టలేదు.. అనుబంధం పుట్టింది” ఇలాంటివి చాలానే ఉన్నాయి. సినిమా మొత్తంలో ఎలివేషన్లు, ఇలాంటి డైలాగులు తప్ప ఏమీ లేవు. అందుకే సినిమా బోర్ కొడుతుంది.. 170 రూపాయలు ఖర్చు పెట్టుకొని బోర్ అనే ఫీల్ అనుభవించేందుకు కాదు కదా ప్రేక్షకులు థియేటర్లకి వచ్చేది? అనేక చోట్ల తండ్రికి, కొడుక్కి మధ్య కనీసం 30 ఏళ్ల తేడా ఉండాలి కదా? కానీ ఇద్దరు సేమ్ లుక్కు.. అన్నట్టు సినిమాలో హనీ రోజ్ అనే మరో నటి కూడా ఉంది. ఈ సినిమాతో ఆమెకు ఐటెం సాంగ్స్ మరిన్ని రావచ్చు. ఇక ఈ సినిమాలో వరలక్ష్మి పోషించిన పాత్ర బాగుంది.. ఇకపై రమ్యకృష్ణ బదులు వరలక్ష్మిని తీసుకుంటారు.. ఏమాత్రం సందేహం లేదు.. ఇందులో కూడా బాలకృష్ణ సోదరి పాత్ర పోషించింది.. క్రాక్ లో కూడా ఇటువంటి పాత్ర దక్కింది. ఇక బాలకృష్ణ నటన గురించి చెప్పాల్సింది ఏమీ లేదు.. స్క్రీన్ మొత్తం ఆయనే ఉన్నాడు కనుక.. మొత్తానికి అఖండ తర్వాత బాలకృష్ణ నుంచి మరో భిన్నమైన పాత్రను ఊహించే వరకు బాగా నిరాశ.. మా బాలయ్య మారడు… తమ్ముడు తురుముడు అనుకునే వాళ్లకు మరో వేట కత్తులు, పారే నెత్తురు లాంటి సినిమా.. అంతే అంతకుమించి ఏమీ లేదు