Vantara: 600 ఎకరాల వంతారా అడవి .. ముకేశ్ అంబానీ చిన్న కొడుకు పెద్ద మనసు

దేశంలోనే అతిపెద్ద సంపన్నుడి కొడుకు అయినప్పటికీ ఎటువంటి గర్వాన్ని చూపించని అనంత్.. అడవి జంతువులపై చూపిన ప్రేమ.. అందుకు అతడు పడిన కష్టం పట్ల సర్వత్రా అభినందనలు దక్కుతున్నాయి.

Written By: Suresh, Updated On : February 27, 2024 3:02 pm

Vantara

Follow us on

Vantara: ముఖేష్ అంబానీ.. లక్షల కోట్లకు అధిపతి.. ఎన్నో కంపెనీలకు, ఎందరో ఉద్యోగులకు బాస్.. అలాంటి ముకేశ్ అంబానీ కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా సరే మీడియా అటెన్షన్ చూపిస్తుంది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ముందస్తు వివాహ వేడుకకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అనంత్ అంబానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం జాతీయ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. హై ఫై లైఫ్ కు దూరంగా ఉండే అనంత్ అంబానీ.. చేసిన పని పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.

దేశంలోనే అతిపెద్ద సంపన్నుడి కొడుకు అయినప్పటికీ ఎటువంటి గర్వాన్ని చూపించని అనంత్.. అడవి జంతువులపై చూపిన ప్రేమ.. అందుకు అతడు పడిన కష్టం పట్ల సర్వత్రా అభినందనలు దక్కుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు ముఖేష్ అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ ను నెలకొల్పారు. సామాజిక సేవలో భాగంగా వంతారా అనే సమగ్ర జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. కోవిడ్ సమయం తీవ్రంగా ఉన్నప్పుడు దీనిని ప్రారంభించారు. గుజరాత్ లోని జామ్ నగర్ కు సమీపంలోని 600 ఎకరాల్లో ఒక అడవిని సృష్టించారు. అయితే దీని వెనుక ఉన్నది మొత్తం అనంత్ అంబానీనే. ఎందుకంటే అతడికి జంతువులంటే చాలా ఇష్టం. జంతువులు గాయపడితే అస్సలు తట్టుకోలేడు. పైగా అతడు పూర్తిగా శాకాహారి. తన కొడుకు అభిరుచిని కాదనలేక ముఖేష్ అంబానీ కూడా వంతారా బాధ్యతను మొత్తం ఆనంత్ అంబానీకే అప్పగించాడు. అనంత్ అంబానీ కూడా వంతారా పనుల్ని దగ్గరుండి పర్యవేక్షించాడు. ఈ అడవిలో జంతువులను పెంచడం మాత్రమే కాదు.. గాయపడ్డ జంతువులకు శస్త్ర చికిత్స చేసి సంరక్షిస్తుంటారు.. అయితే ఈ విషయాన్ని అనంత్ ఎక్కడ బయట చెప్పలేదు. ఇటీవల ఒక మీడియా ప్రతినిధితో ఈ విషయాన్ని పంచుకున్నాడు. దాంతో ఒక్కసారిగా ఈ విషయం బయటకు పొక్కింది. వంతారా ద్వారా అనంత్ చేస్తున్న సేవకు సంబంధించి ఇటీవల అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది.

అనంత్ అంబానీ సృష్టించిన ఈ అడవిలో 200 కంటే ఎక్కువ ఏనుగులు ఉన్నాయి. అంతకంటే ఎక్కువ జాతులకు చెందిన జీవులున్నాయి. ఈ అడవిలో అరుదైన, అంతరించిపోతున్న జంతువుల్ని సంరక్షిస్తున్నారు. ఇక్కడ బతికే ప్రతి జంతువులో తాను దైవాన్ని చూస్తున్నానని ఆనంద్ చెబుతున్నాడు. ఈ అడవిని సంరక్షించేందుకు సుమారు 400 మంది దాకా పనిచేస్తున్నారు. వారందరికీ అనంత్ ఆధ్వర్యంలోనే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ అడవి చుట్టూ సౌర కంచె నిర్మించారు. అక్కడక్కడ భారీ కాంతి వెదజల్లే సౌర దీపాలు ఏర్పాటు చేశారు. భారత్ మాత్రమే కాకుండా ప్రపంచంలోని అగ్రశ్రేణి జంతు శాస్త్ర నిపుణులు, పశు వైద్య నిపుణులు కొందరు ఈ వంతారా మిషన్ లో కీలకంగా పనిచేస్తున్నారు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఈ మిషన్ కోసం తోడ్పాటు అందించాయి. ఈ అడవి జామ్ నగర్ లోని రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ కు సమీపంలో ఉండడం విశేషం. మొన్నటిదాకా ఆనంత్ అంటే భారీ శరీరం ఉన్న వ్యక్తిగానే చూసిన మీడియా.. ఇప్పుడు ఈ అడవిని సృష్టించిన విధానాన్ని చూసి సెల్యూట్ చేస్తోంది. లావు ఒకింతయు బాధ కాదు. లావు ఉన్నానని అనంత్ బాధపడితే ఈ వంతారా అడవి ఏర్పడేదే కాదు. ఈ అడవి చూసిన తర్వాత ముఖేష్ అంబానీ అనంత్ ను ఆలింగనం చేసుకున్నాడట.. పుత్రోత్సాహం అంటే అలానే ఉంటుందేమో..