
దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి. మరో పది రోజుల్లో దేశంలో అన్ లాక్ 3.0 ముగియనుంది. కేంద్రం అన్ లాక్4.0లో భాగంగా సెప్టెంబర్ నెల నుంచి థియేటర్లకు అనుమతి ఇవ్వనుందని తెలుస్తోంది. రెస్టారెంట్లు, మాల్స్, జిమ్, యోగా కేంద్రాలకు కేంద్రం అన్ లాక్ సడలింపుల్లో భాగంగా ఇప్పటికే అనుమతులు ఇచ్చింది.
మార్చి నెల చివరి వారంలో లాక్ డౌన్ ప్రకటించిన రోజు నుంచి దేశవ్యాప్తంగా థియేటర్లు మూతబడ్డాయి. దీంతో చిత్ర పరిశ్రమ భారీ నష్టాలను చవిచూస్తోంది. సామాజిక దూరం, శానిటైజేషన్ వంటి నిబంధనలు పాటిస్తూ థియేటర్లు తెరిచేందుకు కేంద్రం అనుమతులు ఇవ్వనుందని తెలుస్తోంది. సీటింగ్ సామర్థ్యం, సీట్ల మధ్యలో దూరం లాంటి వాటి గురించి కేంద్రం త్వరలో ఆదేశాలను జారీ చేయనుంది.
వైరస్ విజృంభణ దృష్ట్యా థియేటర్లలో కనీస ఉష్ణోగ్రత 24 డిగ్రీలు ఉండే విధంగా కేంద్రం జాగ్రత్తలు తీసుకోనుంది. ప్రేక్షకులు సినిమా చూస్తున్నంత సేపు మాస్క్ ధరించాలనే సరికొత్త నిబంధన కూడా అమలులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. థియేటర్ యాజమాన్యాలు ప్రభుత్వానికి పలుమార్లు థియేటర్లు ఓపెన్ చేసేందుకు అనుమతులు ఇవ్వాలని కోరాయి. థియేటర్ల యాజమాన్యాల విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
కాంటాక్ట్‌లెస్ టికెటింగ్, రెగ్యులర్ శానిటైజేషన్‌తో థియేటర్లను తిరిగి తెరవడానికి కేంద్రం సిద్ధమవుతోందని సమాచారం. ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు త్వరలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలవుతాయని చెప్పారు. మరోవైపు పాఠశాలలు, ఆంక్షలు విధించిన వాటి విషయంలో సైతం కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది.