Websites: ప్రముఖ పో** సైట్లలో ఒకటైన ‘పో** హబ్’ లెక్కల ప్రకారం.. తమ సైట్‌ను మొబైల్ ద్వారా సందర్శిస్తున్న వారి సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లోనే ఉంది. 2013తో పోలిస్తే ఆ సంఖ్య 121 శాతం మేర పెరిగింది. ఆ సంస్థ విడుదల చేసిన డేటా ప్రకారం.. భారత్ 121%, జపాన్ 115%, కెనడా 65%, యూకే 49%, అమెరికా 38%, మంది ఆ తరహా దృశ్యాలను రోజు చూస్తున్నారు. ఫలితంగా దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం కఠువాలో పన్నెండేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం! మరింకేదో రాష్ట్రంలో 2 నెలల పసికందుపైనా అఘాయిత్యానికి పాల్పడి ఆ చిన్నారిని చిదిమేశాడింకో రాక్షసుడు!! ఎందుకిలా? దేశంలో అత్యాచారాలు ఎందుకు పెరిగిపోతున్నాయి? అరచేతిలోకి వస్తున్న ఆధునిక టెక్నాలజీ దుర్వినియోగమే దీనికి కారణమా? తినే తిండి కన్నా తక్కువ ధరల్లో అందుబాటులోకి వచ్చిన మొబైల్ డేటా విప్లవానికి.. దేశంలో పెరుగుతున్న అత్యాచారాలకు సంబంధం ఉందా? పో** సైట్ల ప్రభావం వల్ల.. మహిళలు, బాలికలపై దురాగతాలకు అంతేలేకుండా పోతోందా? విశ్లేషకులు ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే ఇస్తున్నారు.
గుజరాత్‌లోని పటాన్‌లో గతంలో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే సంఘటన జరిగింది. పో** వీడియోలు చూడటానికి అలవాటు పడిన ఓ బాలుడు.. రోజూ తల్లి, చెల్లి ముందే సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూసేవాడు. చివరకు జన్మనిచ్చిన తల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. యువతపై పో** వీడియోల ప్రభావానికి పరాకాష్ఠగా నిలిచిన దారుణమిది! రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో పోర్న్ వీడియోలు చూసిన 50 ఏళ్ల వ్యక్తి.. 11 ఏళ్ల చిన్నారిని రేప్ చేశాడు. గత ఏడాది మేడ్చల్‌లో 17 ఏళ్ల అబ్బాయి.. పో** వీడియోల ప్రభావంతో ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రోజూ ఎన్నో అకృత్యాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.
మొబైల్ డేటా తెచ్చిన ముప్పు..
దేశంలో మొబైల్స్‌లో అపరిమిత డేటా అందుబాటులోకి వచ్చిన దగ్గర్నుంచీ..మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా ఒక ప్రముఖ సంస్థ టెలికం రంగంలోకి దిగి 4జీ టెక్నాలజీని పప్పుబెల్లాల ధరకే అందుబాటులోకి తెచ్చి మొబైల్ డేటా రంగంలో పోటీకి తెరతీయగా.. అప్పటికే పాతుకుపోయిన టెలికం కంపెనీలూ ధరల యుద్ధానికి దిగి రేట్లు తగ్గించేశాయి. ఫలితంగా, మొబైల్ ఇంటర్నెట్ ఇప్పుడు తిండికన్నా చవకైపోయింది. అందుబాటు ధరలలో లభిస్తున్న 4జీ డేటాను చాలామంది అశ్లీల చిత్రాలు చూడటానికి ఉపయోగిస్తున్నారు. 5జి డాటా కూడా దానికోసమే వాడుతున్నారు. గణాంకాల ప్రకారం.. దేశంలోని ప్రముఖ సంస్థ టెలికం రంగంలోకి దిగకముందు, అంటే 2016 సెప్టెంబరుకు ముందు నెలకు భారతీయుల సగటు డేటా వినియోగం ఒక జీబీ నుంచి ఐదు జీబీల దాకా ఉండేది. ఇప్పుడది 12 జీబీకి చేరింది. గతంలో మొబైల్ డేటాను అత్యంత ముఖ్యమైన పనులకే వాడేవారు. బ్యాండ్‌విడ్త్ కేటాయింపులను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండేవారు. చాలామంది నెలకు 1 జీబీ నుంచి 5 జీబీలకు మించి డేటా వాడేవారు కాదు. కానీ ఇప్పుడు రోజుకు 3 జీబీ కూడా చాలామందికి చాలడం లేదు. నిత్యం వాట్సాప్, యూట్యూబ్‌ల నుంచి ఎన్ని వీడియోలను డౌన్‌లోడ్ చేస్తున్నారో లెక్కేలేదు. రోజుకు 1 జీబీ డేటా తక్కువ ధరకు రావడంతో యువత ఆన్‌లైన్‌లో పో**కు అలవాటుపడుతున్నారు.
ఇవీ లెక్కలు..
ప్రపంచవ్యాప్తంగా చిన్నారులపై లైంగిక దాడులు అత్యధికంగా మన దేశంలోనే జరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం దేశంలో ప్రతి 30 నిమిషాలకు ఓ చిన్నారి లైంగిక దాడికి గురవుతోంది. ఇళ్లలో 53 శాతం, స్కూళ్లలో 49 శాతం, పని ప్రదేశాలు, షాపులు, ఫ్యాక్టరీల్లో 61 శాతం, బాలల సంరక్షణ కేంద్రాలలో 47 శాతం చిన్నారులు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. బాధితుల్లో ఎక్కువమంది 11 నుంచి 16 ఏళ్లలోపు బాలికలే! 2013లో బాలికలపై 12,363 అత్యాచార ఘటనలు జరగ్గా, 2014లో ఈ సంఖ్య 13,766కు పెరిగింది. 2015లో మైనర్లపై అత్యాచార ఘటనలు 10,854 నమోదవగా.. మొబైల్ డేటా అపరిమితంగా అందుబాటులోకి వచ్చిన 2016లో ఏకంగా 19,765 దారుణాలు చోటుచేసుకున్నాయి.
పెరుగుతాయా? తగ్గుతాయా?
పో**చూడటం వల్ల అత్యాచారాలు పెరుగుతాయా? తగ్గుతాయా? అంటే.. రెండు రకాల వాదనలూ ఉన్నాయి. పో** చూసి స్వీయతృప్తి పొందడం వల్ల నిజానికి అత్యాచారాలు తగ్గుతాయని చాలా మంది వాదిస్తారు. అదే సమయంలో.. అందరూ అలా తృప్తి చెందరని, సాధారణ పో** స్థాయి దాటి అసహజ లైంగిక కార్యకలాపాలను చూస్తేగానీ తృప్తి చెందని స్థాయికి కొందరు చేరుతారని, అలాంటివారు లైంగిక నేరాలకు పాల్పడే ప్రమాదం ఉన్నదని మరికొందరి వాదన. వారు చెబుతున్నదాని ప్రకారం.. మెదడు తాను చూసిన దాన్ని, విన్నదాన్ని పునరావృతం చేస్తుంది. మనిషి ఏ విషయాన్నైనా నేర్చుకునే క్రమం ఇదే. ఒక విషయాన్ని ఎంత తరచుగా చూస్తే, వింటే దాని ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది. ఆ కోణంలో చూస్తే పో** చెడు చేస్తుందని వారు అంటారు. ఉదాహరణకు.. అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం వారు దర్యాప్తు చేసిన లైంగిక నేరాల్లో 80 శాతం కేసుల్లో పో** కంటెంట్ ఉంది. అలాగే.. యూనివర్సిటీ ఆఫ్ న్యూహ్యాంపషైర్ (అమెరికా) పరిశోధకులు చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. అమెరికాలో ప్లేబోయ్, పెంట్‌హౌస్ లాంటి మేగజైన్ల పాఠకులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అత్యాచారాల రేటు కూడా ఎక్కువగా ఉన్నట్టు తేలింది. పో** చూసిన ప్రతి ఒక్కరూ రేపిస్ట్ కాకపోవచ్చుగానీ.. అతి తక్కువ రేట్లకు మొబైల్ డేటా కోట్లాది మందికి అందుబాటులోకి వచ్చి అంతమంది పో** చూసినప్పుడు అందులో ఒక శాతం దాని ప్రభావానికి గురైనాగానీ పరిస్థితులు దారుణంగా ఉంటాయనేది మాత్రం సత్యం.