RK Kotha Paluku: మనం చాలా సార్లు చెప్పుకున్నదే. ఇప్పుడూ చెప్పుకుంటున్నదే. చంద్రబాబును ఆ రెండు పత్రికలు కాపాడుతుంటాయని.. ఆయన వేసే అడుగులు గొప్పవని, చెప్పే మాటలు మంచివని, చేసే పనులు జాతిని ఉద్దరిస్తాయని.. ఠాం ఠాం వేసి చెబుతాయని.. ఇప్పుడు స్కిల్ కేసులో రాజమండ్రి జైల్లో శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో అదే పని కొనసాగిస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ జాతికి ద్రోహమని, ఆయన సుద్ధపూసని తాటికాయంత అక్షరాలతో రాసుకొస్తున్నాయి. ఆ రెండు పత్రికల్లో ఈనాడు కొంచెం పద్ధతి పాటిస్తుంది. మొన్నామధ్య అది కూడా వదిలేసింది. ఇక ఆంధ్రజ్యోతి అయితే పోతురాజు మాదిరి పసుపు రంగు పూసుకుని, చర్నాకోల్‌తో కొట్టుకుంటూ ఉంటుంది. దాని ఓనర్ రాధాకృష్ణ అయితే తన పసుపు భక్తిని ఎక్కడా దాచుకోడు.
ప్రతీ ఆదివారం తన ఆంధ్రజ్యోతి పత్రికలో కొత్తపలుకులో వర్తమాన రాజకీయాలపై రాస్తుంటారు. అయితే ఇవన్నీ జగన్ వ్యతిరేక కోణంలో సాగుతుంటాయి(ఇక్కడ జాతి వైరం అనుకోవాలేమో). అప్పుడప్పుడూ కాంగ్రెస్‌కు అనుకూలంగా(చంద్రబాబు రాజకీయ ఇష్టాల ఆధారంగా) రాస్తుంటారు. అయితే ఇప్పుడు స్కిల్ కేసులో చంద్రబాబు రాజమండ్రి జైల్లో కేసు అనుభవిస్తున్న నేపథ్యంలో ఏపీ సీఐడీ గురించి, జగన్ వ్యవహార శైలి గురించి, ఏపీ స్కిల్ పథకానికి సంబంధించి ఆడిట్ చేసిన సంస్థ గురించి రాసుకొచ్చారు. అయితే తను రాసిన వ్యాసంలో చంద్రబాబు మీద భక్తిన ప్రదర్శించిన ఆర్కే.. కొన్ని కొన్ని విషయాలను జస్ట్ అలా టచ్ చేసి వదిలేశారు. కానీ ఇవే బాబు వైపు వేళ్లు చూపేలా చేస్తాయని మర్చిపోయాడు.
‘అల్పబుద్ధులకు అధికారమిస్తే ఏమి జరుగుతుందో యోగి వేమన ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు వేమన శతకాన్ని గుర్తుచేస్తున్నాయి. రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి ఉందని శుక్రవారం సుప్రీం కూడా వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తలుచుకుంటే కనీస ఆధారాలు లేకపోయినా ఎవరిపైనైనా కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించవచ్చునని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రుజువు చేసింది.’ అంటే జగన్‌కు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు అల్పులా? కనీస ఆధారాలు లేకుండా కేసు పెడితే చంద్రబాబు పెట్టుకున్న లాయర్ లూథ్రా ఊరుకునేవాడా? కోర్టులో వాదించేవాడు కదా? టీడీపీకి బలమైన లీగల్ టీం ఉంది కదా? ఆ టీం ఎందుకు ఇది తప్పు అని నిరూపించలేకపోయింది? మరి.
‘చంద్రబాబును అరెస్టు చేసిన తీరు, ఆ తర్వాత రిమాండ్‌కు పంపడంలో జరిగిన జాప్యం అనేక ప్రశ్నలను మన ముందు ఉంచుతోంది. అధికారుల స్థాయిలో అవకతవకలు జరిగితే సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిపై కేసు పెట్టి అరెస్ట్ చేయవచ్చునా? ఇందులోని ఔచిత్యాన్ని పరిశీలించాల్సిన అవసరం కోర్టులకు లేదా? వంటి ప్రశ్నలుత్పన్నమవుతున్నాయి.’ అని రాసిన ఆర్కేకు.. నాడు జగన్ విషయంలో ఏం రాశాడో గుర్తుకు లేదా? వైఎస్ హయాంలో మేళ్లు చేయడం వల్లే జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని పేజీలకు పేజీలు వార్తలు ప్రచురించలేదా? నాడు ఇదే కోర్టును రాధాకృష్ణ ప్రశసించలేదా? సీబీఐ జేడీగా పని చేసిన లక్ష్మీనారాయణ మీద అద్భుతమైన కథనాలు వండి వార్చలేదా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్ పథకం మదిలో మెదిలిందట? తర్వాత కేబినేట్ ఆమోదించిందట? ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు ఆయనకు ఆ పథకాన్ని ప్రవేశపెట్టాలి అనుకున్నప్పుడు కేబినెట్ ఎలా వ్యతిరేకిస్తుంది?
‘చంద్రబాబును రిమాండ్‌కు తరలించిన రోజు న్యాయస్థానంలో జరిగిన జాప్యం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఉదయం 6 గంటలకు ఏసీబీ కోర్టుకు చంద్రబాబును సీఐడీ అధికారులు తీసుకుపోయారు. ఉదయం 6 నుంచి దశల వారీగా విచారణ చేసిన న్యాయాధికారి రాత్రి 7 గంటలకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. ముద్దాయి ఎవరైనా కావొచ్చు! ఈ 14 గంటలు వారి పరిస్థితి ఏమిటి? ముద్దాయిలకు ఆహారం సరఫరా చేసే బాధ్యతను ఇటు సీఐడీ గానీ అటు కోర్టు గానీ తీసుకోలేదు. ఇతరత్రా ప్రకృతి అవసరాలకు వారు ఎక్కడికి వెళ్లాలి? 73 ఏళ్ల వయసులో చంద్రబాబును ఈ విధంగా బాధించడం న్యాయమా?’ అని బాధపడిన ఆర్కే.. నాడు జగన్ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? జగన్ కుటుంబ సభ్యులు రోడ్డు మీదకు వచ్చినప్పుడు ఎలాంటి కవరేజీ ఇచ్చారు? జగన్ ను అరెస్ట్ చేసినప్పుడు ఇలానే వ్యవహరించారు కదా? నంద్యాలలో అరెస్ట్ చేస్తున్నప్పుడు చంద్రబాబు తనకు ఏ ఆరోగ్య పరీక్షలు వద్దూ అన్నది నిజం కాదా? ప్రత్యేకమైన బస్సులోకి వెళ్లింది అబద్ధమా? ఒకవేళ అనారోగ్యానికి గురయితే ఆయన వారికి సహకరిస్తారా? కేవలం చంద్రబాబు మీద భక్తితో ఇవ్వాళ వ్యవస్థలను దునుమాడుతున్న ఆర్కే ఒకప్పుడు ఎలాంటి రాతలు రాశారో తెలుసుకోవాలి.