Karnataka: భారత దేశానికి రైతు దేశానికి వెన్నెముక.. 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడే జీవనం సాగిస్తున్నారు. రైతులు వ్యవససాయం చేసి పండిస్తేనే ఆ 60 శాత మందితోపాటు.. మిగతా 40 శాతం మందికి ఐదు వేళ్లు నోట్లకి వెళ్తున్నాయి. పట్టెడు అన్నం దొరుకుతోంది. మూడు దశాబ్దాల క్రితం రైతు అంటే పిలిచి పిల్లను ఇచ్చేవారు. రైతుకు ఉన్న భూమిని బట్టి కట్న కానుకలు ఇచ్చేవారు. కానీ నేడు పరిస్థితులు మారిపోతున్నాయి. వ్యవసాయంలో ఆధునిక పరిజ్ఞానం వచ్చినట్లే.. కష్టపడడానికి ఇష్టపడని యువతులు రైతులను పెళ్లి చేసుకోవడానికి కూడా విముఖత చూపుతున్నారు. ఈ విషయం వినడానికి బాధగా ఉన్నా వాస్తవం. ఉన్నత చదువులు చదివిన యువకులు వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ ఆ యువ రైతులను పెళ్లి చేసుకోవడానికి మాత్రం యువతులు ముందుకు రావడం లేదు. ఈ సమస్య దేశవ్యాప్తంగా ఉంది.

ఆ ఊళ్లో మరీ దారుణం..
కర్నాటక రాష్ట్రంలోని ధర్వాడ జిల్లా కుందగోళ తాలూకా హోసళ్లి గ్రామంలో యువ రైతులకు వధువు దొరకడం లేదు. కేవలం రైతు అనే కారణంతో ఆ ఊళ్లోని యువకులను పెళ్లి చేసుకునేందుకు యువతులు వెనుకాడుతున్నారట. ఈ విషయాన్ని ఆ గ్రామ యువకులే తహసీల్దార్ వద్దకు వెళ్లి మొర పెట్టుకున్నారు.
పనులు చేయలేమని..
రైతులను పెళ్లి చేసుకుంటే వ్యవసాయ పనులు చేయాల్సి ఉంటుందని, రైతుల ఇళ్లలో పనులు కూడా ఎక్కువగా ఉంటాయని, ఎండకు, వానకు శ్రమించాల్సి వస్తుందని యువతులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తున్నారు. రైతులైన తల్లిదండ్రులు కూడా తమ కూతురును యువ రైతుకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఆసక్తి చూపడం లేదు. తమ బిడ్డ తమలాగా కష్టపడొద్దని, ఉన్నంతలో సుఖంగా జీవించాలని భావిస్తున్నారట. దీంతో యువ రైతులకు పిల్ల దొరకడం లేదు.
వ్యవసాయం జూదంలా మారిందని..
ప్రస్తుత పరిస్థితిలో వ్యవసాయం ఎప్పుడు కలిసి వస్తుందో.. ఎప్పుడు నష్టం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా.. కచ్చితంగా దిగుబడి వస్తుందని, లాభాలు వస్తాయని చెప్పలేని పరిస్థితి. ఈ కారణంగా కూడా రైతులకు తమ ఆడపిల్లలను ఇవ్వడానికి అమ్మాయిల తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో యువ రైతులు ఆడపిల్లలు దొరక్క ఎంతో ఆవేదన చెందుతున్నారని హోసళ్లి గ్రామస్తులు తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ వినతిపత్రంపై ఇప్పడు అందరి దృష్టి మళ్లింది.

చిన్నదో పెద్దదో ఉద్యోగముంటే చాలు..
చాలా మంది అమ్మాయిల తల్లిదండ్రులు ఇప్పుడు తమ కూతురును కుదిరితే ప్రభుత్వ ఉద్యోగి.. లేకపోతే సాఫ్ట్‌వేర్.. ఇకా కుదరకపోతే ప్రైవేటు ఉద్యోగి అయినా పరవాలేదు అనుకుంటున్నారు. పట్టణాల్లోనే నివాసం ఉండాలని కోరుకుంటున్నారట. అమ్మాయిలు కూడా ఉన్నత చదువులు చదువుకుంటుండడంతో చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసేవాడే మొగుడు కావాలని కోరుకుంటున్నారట. లేదంటే మంచి వ్యాపారం చేసేవాడు కావాలనుకుంటున్నారట. రైతు మాత్రం కాకుండా ఉంటే చాలని భావిస్తున్నారట. సిటీల్లో నివాసముండాలని కలలు కంటున్నారు.
దేశానికి అన్నం పెట్టడానికి రైతులు కావాలి, అలాంటి యువ రైతులకు కన్యను ఇవ్వడానికి జనం నిరాసక్తి చూపడం అందరినీ కలవర పెడుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే యువ రైతులు వ్యవసాయం చేయడానికి కూడా వెనుకాడే పరిస్థితి. ఈ విషయంపై ప్రభుత్వాలు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది .