
Naveen Murder Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నవీన్‌ను చంపిన తర్వాత పోలీసులకు పట్టుబడే వరకు హరి హరకృష్ణ ఏం చేశాడు? ఈ హత్యలో నవీన్ ప్రియురాలి పాత్ర కూడా ఉందా? హరికృష్ణ తండ్రి ప్రియురాలిని కూడా విచారణ చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నాడు? నవీన్ ప్రియురాలు పోలీసుల దర్యాప్తుకు సహకరిస్తుందా? వంటి అనేక అంశాలు చర్చనీయాంశమయ్యాయి.
మర్డర్ చేసి తండ్రి వద్దకు వెళ్లిన హరి..
ట్రయాంగిల్ లవ్.. సంచలన క్రైంగా మారిన నవీన్ హత్య కేసులో హరిహర కృష్ణ కేవలం ప్రేమ కోసం నవీన్‌ను పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంపై హరి హరికృష్ణకు పూర్తి అవగాహన ఉండడంతో హత్యకు అదే ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా పోలీసులు పేర్కొన్నారు. మర్డర్ తర్వాత హరికృష్ణ వరంగల్‌లో ఉన్న తండ్రి దగ్గరకు వెళ్లాడు. అప్పటికే నవీన్ అదృశ్యంపై వరుసగా ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. ఇంకా వరంగల్‌లో ఉంటే విషయం తండ్రికి తెలుస్తుంది భావించిన హరి ఈనెల 19వ తేదీ తెల్లవారుజామున ముసారంబాగ్‌కు తిరిగి వాచ్చాడు.
మర్డర్ తర్వాత ప్రియురాలికి ఫోన్..
ఇక నవీన్‌ను హతమార్చిన తర్వాత హరి ప్రియురాలికి ఫోన్ చేశాడు. నవీన్‌ను చంపేశానని చెప్పాడు. దీంతో ఆమె పోలీసులకు లొంగిపోవాలని సూచించింది. కానీ హరి వినలేదు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నార్కెట్‌పల్లి పోలీసులు కేసు దర్యాప్తును చేయడంతో హరి పేరు తెర మీదకు వచ్చింది. హరి అక్క, బావను పోలీసులు ప్రశ్నించడంతో పరిస్థితి సీరియస్ అని భావించిన నిందితుడు జరిగిన విషయం తన తండ్రికి చెప్పాడు. తర్వాత తండ్రి సూచన మేరకు అబ్దుల్లాపూర్‌మెట్‌లో పోలీసులకు లొంగిపోయాడు హరి.
హత్య వెనుక ఇంకెవరున్నారు?
అయితే పోలీసులకు లొంగిపోయే ముందు హరి తన ఫోన్‌లో డేటాను తొలగించాడు. డేటా రికవరీ కోసం ఫోన్‌ను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు అంత దారుణంగా నవీన్‌ను హరి ఒక్కడే చంపి ఉండడు అన్న అనుమానాలను నిందితుడి తండ్రి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ హత్య వెనుక మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులనే బెదిరించిన ప్రియురాలు?
ఇదిలా ఉంటే హరి తండ్రి నవీన్ ప్రియురాలిపైన కూడా అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో హత్య కేసులో నవీన్ ప్రియురాలి పాత్రపై కూడా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయితే తనను ఈ కేసులోకి లాగితే ఆత్మహత్య చేసుకుంటానని సదరు యువతి పోలీసులకే దమ్కీ ఇస్తుందని సమాచారం. తనకు ఈ వివాదంతో సంబంధం లేదని తన మానాన, తనను ఉండనివ్వాలని కోరుతున్నట్లుల తెలిసింది. అయినా పోలీసులు సదరు యువతీని సఖీ సెంటర్‌కు తరలించారు.
ప్రియురాలి ట్విస్ట్‌తో పోలీసులు షాక్ అయ్యారు. అందుకే ఆమెను సఖి కేంద్రానికి తరలించారు. హరిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేసిన తర్వాత నవీన్ ప్రియురాలి పాత్రపై క్లారిటీ వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. అప్పటి వరకు యువతిని సఖీ కేంద్రంలోనే ఉంచనున్నట్లు తెలిసింది.