Neha Deshpande Husband Arrest: హీరోయిన్ నేహా దేశ్ పాండే భర్త మైరాన్ మోహిత్ ని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో బంజారాహిల్స్ పోలీసులు మైరాన్ మోహిత్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నేషనల్ డీజే ఆర్గనైజర్ గా నేహా దేశ్ పాండే భర్త మైరాన్ మోహిత్ పని చేస్తున్నాడు. మైరాన్ మోహిత్ అతిపెద్ద డ్రగ్ నెట్ వర్క్ కలిగి ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ తో పాటు ముంబై, గోవా నగరాలకు డ్రగ్స్ సప్లై చేసే ముఠాలతో మైరాన్ మోహిత్ సంబంధాలు కొనసాగిస్తున్నాడు.

పబ్ లో వెయిటర్ గా జీవితం మొదలుపెట్టిన మైరాన్ మోహిత్ డ్రగ్ సప్లయర్ గా మారాడు. చాలా ఏళ్లుగా మైరాన్ మోహిత్ డ్రగ్ దందా చేస్తున్నాడు. 12 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుండి ముంబై వెళ్లిన మైరాన్ డ్రగ్ ముఠాలతో పరిచయాలు పెంచుకున్నాడు. ఇక టాలీవుడ్ లో చిన్నా చితక సినిమాల్లో నటించిన హీరోయిన్ నేహా దేశ్ పాండేను వివాహం చేసుకున్నాడు. అరెస్ట్ అనంతరం విచారణ చేపట్టారు. ఈ కేసులో మరింత సమాచారం రాబట్టాల్సి ఉంది.
చిత్ర పరిశ్రమలు డ్రగ్స్ దందాకు అడ్డాలుగా మారుతున్నాయి. 2020లో కన్నడ పరిశ్రమను డ్రగ్స్ కేసు కుదిపేసింది. హీరోయిన్స్ సంజనా గల్రాని, రాగిణి ద్వివేది అరెస్ట్ అయ్యారు. కొన్నాళ్లు పరప్పణ అగ్రహారం జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇంకా పలువురు డ్రగ్స్ ఆరోపణలపై అరెస్ట్ చేయబడ్డారు. ఇక బాలీవుడ్ లో సైతం డ్రగ్స్ ఆరోపణలు వినిపించాయి. సుశాంత్ రాజ్ పుత్ డెత్ విచారణ… డ్రగ్స్ కోణం తీసుకుంది. సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె తమ్ముడు షోవిక్ చక్రవర్తి అరెస్ట్ చేయబడ్డారు.

దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్దా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్ కేసులో ఎన్ సీ బీ విచారణ ఎదుర్కొన్నారు. ఇక టాలీవుడ్ లో ప్రముఖులు డ్రగ్స్ విచారణకు హాజరయ్యారు. రానా దగ్గుబాటి, రవితేజ, ఛార్మి, పూరి, తరుణ్, మొమైత్ ఖాన్, నవదీప్, రకుల్ ప్రీత్… ఎలా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు డ్రగ్స్ బాధితులుగా, సప్లయర్స్ గా ఉన్నట్లు తేలింది. రాజకీయ ఒత్తిడులతో ఈ కేసు నీరుగార్చారనే ఆరోపణలు ఉన్నాయి.