
TSPSC Paper Leak: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తెలంగాణ సర్కార్‌ను ఓ కుదుపు కుపేసింది. ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్‌తో ఆటలాడుకున్న టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం కారణంగా కేసీఆర్ సర్కార్‌తోపాటు, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి అభాసుపాలవుతున్నారు. విపక్షాలు కేటీఆర్ టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. విద్యార్థి సంఘాలు ఉద్యమిస్తున్నాయి. కేటీఆర్‌ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కేటీఆర్ కూడా విపక్షాలపై ఎదురు దాడి మొదలు పెట్టారు. కానీ విపక్షాల దాడి ముందు కేటీఆర్ మాటలు తేలిపోతున్నాయి. దీంతో సిట్ సహకారంతో విపక్ష నేతల నోళ్లు మూయించేందుకు నోటీసులు ఇప్పించారు ముఖ్యమైన మంత్రి దీంతో ఈ వ్యవహారం ముందురుతోంది. విపక్షాలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా నిరుద్యోగులకు మాత్రం భరోసా కలుగడం లేదు.
తాజాగా పోస్టర్ల కలకలం..
తెలంగాణలో పోస్టర్ పాలిటిక్స్‌కు తెరలేపిన అధికార బీఆర్ఎస్ను విపక్షాలు అదే పోస్టర్‌తో కొడుతున్నాయి. తాజాగా టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద మంగళవారం వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. టీఎస్పీఎస్సీ ఆఫీస్ ఓ జిరాక్స్ సెంటర్ అని అర్థం వచ్చేలా ఈ పోస్టర్లు వెలిశాయి. బీఆర్ఎస్ నాయకులు వేస్తున్న పోస్టర్లకు పేరు పెట్టుకోవడానికి భయపడుతున్నారు. కానీ, టీ ఎస్పీఎస్సీ వద్ద మాత్రం ఓయూ జేఏసీ చైర్మన్ అర్జున్‌బాబు బాజాప్తా తన పేరుతో పోస్టర్లు ఏర్పాటు చేశారు. ‘టీఎస్పీఎస్సీ జిరాక్స్ సెంటర్.. ఇచ్చట అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ ప్రశ్నాపత్రాలు లభిస్తాయి’ అంటూ సెటైర్లు విసురుతూ పోస్టర్లు అంటించారు.

పోస్టర్లో ఏముందంటే…
– తప్పు చేసిన టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయకుండా కేవలం పరీక్షను రద్దు చేయం ఏంటి? శిక్ష ఎవరికి బోర్డుకా, విద్యార్థులకా? ఇది ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ పనితీరు.
– ముఖ్యమంత్రి గారు.. మీరు తక్షణమే తెలంగాణ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి.
– ప్రశ్నాప్రతాల లీకేజీలో మీ కుటుంబసభ్యుల పాత్రలేదని చెప్పడానికి వెంటనే సీబీఐకి అప్పగించి టీఎస్పీఎస్సీ బోర్డును, సంబంధిత శాఖ మంత్రిని బర్తరఫ్ చేయండి.
– నష్టపోయిన విద్యార్థులకు ఈనెల నుంచే నెలకు రూ.10 వేల చొప్పున మళ్లీ పరీక్ష నిర్వహించే వరకు నష్టపరిహారం చెల్లించాలి. అని పేర్కొన్నారు.
కొనసాగుతున్న ఆందోళనలు..
మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓవైపు పరీక్ష రాసిన అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. గతకొద్దిరోజులుగా టీఎస్పీఎస్సీ వ్యవహారం అభ్యర్థులను విస్మయానికి గురిచేస్తోంది. టీఎస్పీఎస్సీని రద్దు చేయాలంటూ డిమాండ్ పెరుగుతోంది.
సిట్ విచారణ..
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిందితులను ఐదో రోజు సిట్ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. గ్రూప్ 1 రాసిన వారిలో టీఎస్పీఎస్సీ ఉద్యోగులు కొందరున్నట్లు సిట్ గుర్తించింది. కమిషన్‌లో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న 8 మంది గ్రూప్–1 రాసినట్లు గుర్తించింది. ఈ 8 మందికి నోటీసులు ఇచ్చి.. సిట్ విచారించనుంది. ప్రవీణ్, రాజశేఖర్ ఇళ్లలో పెన్‌డ్రైవ్‌లను స్వాధీనంచేసుకుంది. అయితే పెన్‌డ్రైవ్‌లకు కూడా వీరు పాస్వర్డ్ పెట్టినట్లు తెలుస్తోంది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర లక్ష్మిని సిట్ అధికారులు విచారించారు.
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం మొత్తంగా అధికార బీఆర్ఎస్పై వ్యతిరేకతను మరింత పెంచుతోంది. మంత్రులు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడడం నిరుద్యోగులు, యువతకు ఆగ్రహం తెప్పిస్తోంది. నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలలో సర్కార్ ఏమౌతోందో అన్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తోంది.