
Ugadi 2023: నిర్దిష్టమైన కొంత కాలం, నిర్దిష్టమైన కొంత శక్తి – ఈ రెండిటినీ కలిపి మనం ‘జీవితం’ అంటాం. వీటిలో కాలం మన ప్రమేయం లేకుండానే గడిచిపోతుంది. ‘కాలం’ అనే ఈ ఆలోచన భూమి చుట్టూ జరిగే చంద్ర పరిభ్రమణం వల్ల, సూర్యుడి చుట్టూ భూమి జరిపే పరిభ్రమణం వల్లా ఏర్పడింది. భూమి చుట్టూ చంద్రుడు ఒకసారి తిరిగితే నెల, సూర్యుడి చుట్టూ భూమి ఒకసారి తిరిగితే సంవత్సరం. మన శరీరం మీద, మనసుల మీదా సూర్య, చంద్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భూమి సూర్యుడి శక్తి వల్లే నడుస్తోంది. ఈ భూమిలో మన శరీరం కూడా ఒక అంశమే. సూర్యుడి శక్తిని మనం ఎంత గ్రహించగలం అనే దాన్ని బట్టే మనకెంత శక్తి ఉందనేది నిర్ణయమవుతుంది. కాబట్టి సుర్యుడి చుట్టూ జరిగే భూ పరిభ్రమణం కాలాన్నే కాదు… మన శక్తిని కూడా నిర్దేశిస్తుంది. అంటే… జీవానికి ప్రధాన అంశాలైన ‘కాలం’, ‘శక్తి’ అనే రెండూ సూర్యుడి వల్లనే నిర్దేశితమవుతున్నాయి. కాబట్టే భూమి మీద సూర్యుడి ప్రభావం అధికంగా ఉంది.
యోగ పరిభాషలో మనం భూమి అన్నప్పుడు… ఒక గ్రహాన్ని గురించే కాదు, మన భౌతిక దేహాలను.. ఆ మాటకొస్తే సర్వాన్నీ నిర్మించడంలో అత్యంత ప్రాథమికమైన ‘మూలకం’ గురించి ప్రస్తావిస్తున్నాం. మన భౌతిక శరీరాలు ప్రాథమికంగా భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశాల సమ్మేళనం. ఈ అయిదు మూలకాల (పంచభూతాల)లో భూమి అత్యంత ప్రాథమికమైనది, స్థిరమైనది. శక్తి వ్యవస్థ, చక్రాల విషయానికి వస్తే… భూమి మూలాధార చక్రానికి సంబంధించింది. ఇతర మూలకాలన్నీ దీని ఆధారంగానే నిర్మితమయ్యాయి. ‘భూమి’ అనే మూలకం మన చుట్టూ ఉన్న భౌతిక పదార్థంలో కూడా భాగమే అయినా, మన జీవిత మూలం నుంచి దాన్ని గ్రహించడం, అర్థం చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే చాలామంది వారి సొంత శరీరాలను, మనసును మాత్రమే అనుభూతి చెందుతారు. మన అంతర్గతమైన మూలం నుంచి భూమి మూలకాన్ని తెలుసుకోవడం, అనుభూతి చెందడం యోగ ప్రక్రియలో ఒక భాగం.

మనం ఆహారం తీసుకున్నప్పుడల్లా భూమిలో ఒక భాగాన్ని తింటున్నాం. ప్రాథమికంగా… మన శరీరాన్ని పోషించుకోవడానికి… భూమి నుంచి కొంత భాగాన్ని లోపలికి తీసుకుంటున్నాం. అదే క్రమంలో… భూగ్రహం పట్ల ఎలా వ్యవహరిస్తామో, మన శరీరం పట్ల కూడా అలాగే వ్యవహరిస్తాం. మన భౌతిక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక పరమైన శ్రేయస్సులో ‘భూమి’ అనే మూలకం ఎలాంటి పాత్ర పోషిస్తోందో తెలుసుకోవడం మరింత ముఖ్యం. భారతీయ సంస్కృతిలో భూమిని అమ్మగా చూడడం ఒక ప్రగాఢమైన అవగాహన.