
Tiktok CEO Shou Zi Chew: టిక్‌టాక్.. రెండేళ్ల క్రితం వరకు ఇండియాలో ఇదొక అట్రాక్టివ్ యాప్.. అప్పుడప్పుడే యూత్ దీనికి అలవాటు పడుతున్నారు. రీల్స్ చేయడం మొదలు పెట్టారు. చాలా మంది టాలెంట్ ఈ టిక్‌టాక్ ద్వారా బయటపడింది. అంతవరకు ఓకే. కానీ, చైనావోడు తయారు చేసిన ఈ టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం నిసేధించింది. దేశ సరిహద్దులో భారత సైనికులపై చైనా సైన్యం దాడిచేయడం, కల్నల్ సంతోష్‌కుమార్‌తోపాటు పలువురు సైనికులు చనిపోవడం, అదే సమయంలో యాప్స్‌తో మన దేశ రహస్యాలు చైనా తెలుసుకుంటుందని ప్రచారం జరుగడంతో భారత ప్రభుత్వం టిక్‌టాక్‌తోపాటు పలు చైనా యాప్స్‌ను నిషేధించింది. దీంతో చైనాకు ఆర్థికంగా తీవ్ర నష్టం కలుగగా, మనం బతికిపోయా అడిక్ట్ యాప్ నుంచి భారతీయ యువత బయటపడింది. ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో టిక్‌టాక్ ఎదుర్కొంటోన్న నిషేధం, దానిపై ఉన్న ఆందోళనల గురించి ఆ సంస్థ సీఈఓను యూఎస్ కాంగ్రెస్ ప్రశ్నించింది.
యూఎస్ కాంగ్రెస్ విచారణ..
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ఇప్పటికే చాలా దేశాల్లో నిషేధం ఎదుర్కొంటోంది. భద్రతా కారణాల దృష్ట్యా పలు దేశాలు దీనిపై చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆ సంస్థ సీఈవో షో జి చ్యూ యూఎస్ కాంగ్రెస్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనకు తీవ్రమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.
బైట్ డాన్స్ నుంచే కార్యకలాపాలు..
టిక్‌టాక్ కార్యకలాపాలు మొత్తం చైనా కేంద్రంగా పనిచేస్తున్న దాని మాతృసంస్థ బైట్‌డాన్స్ నుంచే సాగుతాయి. అయితే యూఎస్ కాంగ్రెస్ ఎదుట సీఈవో షోజిచ్యూ టిక్‌టాక్ కార్యకలాపాలపై వివరణ ఇచ్చారు. టిక్‌టాక్ యాప్ వినియోగదారుల డేటాను చైనా ప్రభుత్వంతో పంచుకోదని స్పష్టం చేశారు. అలాగే 150 మిలియన్ల అమెరికన్ యూజర్ల డేటాకు ఇది ఎలాంటి ప్రమాదం కలిగించదు అని పునరుద్ఘాటించారు.

అవన్నీ ఊహాజనిత ఆరోపణలేనట..
ఇదిలా ఉంటే భారత్ సహా ఇతర దేశాల్లో టిక్‌టాక్‌పై ఉన్న నిషేధం గురించి చట్టసభ్యుల్లో ఒకరు ప్రశ్నించారు. ‘ఈ యాప్ చైనా ప్రభుత్వం పరిధిలో పనిచేస్తోంది. ఈ క్రమంలో భద్రతాపరమైన ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఇవి తప్పని మీరు ఎలా చెప్పగలరు..?’ అని ఆ సభ్యుడు అడిగారు. స్పందించిన సీఈవో ఈ ఆరోపణలన్నీ ఊహాజనితమైనవని కొట్టిపారేశారు. వీటికి సంబంధించి ఎటువంటి ఆధారాలు మాకు కనిపించలేదని తెలిపారు. అయితే భారతదేశం విధించిన నిషేధంపై కాంగ్రెస్ సభ్యుడు మరోసారి ప్రస్తావించారు. ‘టిక్‌టాక్‌ను భారత్ 2020లో నిషేధించింది. మార్చి 21న వెలువడిన ఫోర్బ్స్ కథనం.. భారత యూజర్ల డేటా ఉద్యోగులకు, సంస్థకు ఏ విధంగా అందుబాటులో ఉందో వెల్లడించింది’ అంటూ ఆ కథనం గురించి ప్రశ్నించారు. అందుకు సీఈవో సమాధానం ఇస్తూ.. ‘ఇది తాజా కథనం. దీని గురించి పరిశీలించమని మా సిబ్బందికి సూచించాను. మా వద్ద కఠినమైన డేటా యాక్సెస్ విధానాలు ఉన్నాయి. ఇలాంటి కథనాలతో మేం ఏకీభవించం’ అని వివరించారు. మరి ఫోర్బ్స్ కథనంలో డాటా ఎక్కడిదన్న ప్రశ్న తలెత్తుతోంది.
మీ పిల్లలు టిక్‌టాక్ వాడతారా..?
ఇక తన పిల్లలు టిక్‌టాక్ ఉపయోగించరంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా చ్యూ వెల్లడించారు. ‘వారు సింగపూర్‌లో ఉంటారు. ఆ దేశంలో 13 ఏళ్లలోపు పిల్లలకు.. టిక్‌టాక్ చైల్డ్ వెర్షన్ అందుబాటులో లేదు. ఈ వెర్షన్ అమెరికాలో అందుబాటులో ఉంది. నా పిల్లలు అమెరికాలో ఉంటే వారు ఆ యాప్‌ను వాడేందుకు అంగీకరిస్తాను’ అని తెలిపారు.