TS Jobs Notifications: మంత్రాల బలం లేకున్నా తుంపిర్ల బలం ఉండాలన్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకున్నా నోటిఫికేషన్లు మాత్రం వెలువరిస్తూనే ఉంది. వరుసగా ఉద్యోగాల భర్తీ కోసం పలు నోటిఫికేషన్లు ప్రకటిస్తూనే ఉంది. ఇంతవరకు ఉద్యోగాలు కల్పించింది తక్కువ నోటిఫికేషన్లు వేసింది ఎక్కువ. దీంతో సర్కారు తీరుపై అనుమానాలు వస్తున్నాయి. అసలు ఉద్యోగాల భర్తీ చేస్తారా? లేక ఇలాగే నోటిఫికేషన్లు వెలువరిస్తూనే ఉంటారా? అనే సంశయాలు అందరిలో వస్తున్నాయి. నోటిఫికేషన్లు వేయడం దరఖాస్తులు తీసుకోవడంతోనే సరిపోతోంది. ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తారో చెప్పలేం అని నిరుద్యోగులు నిట్టూరుస్తున్నారు.

తాజాగా విద్యాశాఖలో 544 డిగ్రీ ఉపన్యాసకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువరించింది. జనవరి 31నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు తీసుకోనుంది. ఇంటర్ కమిషనరేట్ లో 40, సాంకేతిక విద్యాశాఖలో 31 లైబ్రేరయన్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసినట్లు చెబుతోంది. పురపాలక శాఖలో 64 సీనియర్ అకౌంటెంట్, 13 జూనియర్ అకౌంటెంట్, 1 అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు రేగుతున్నా ఏదో మూల అనుమానం కలుగుతూనే ఉంది.
ఇంకా 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీనికి గాను దరఖాస్తులు జనవరి 12 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు స్వీకరించనున్నారు. మున్సిపల్ శాఖలో 78 పోస్టులకు గాను ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తులు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు తీసుకోనున్నారు. ఇలా ఉద్యోగాల కల్పనకు నోటిఫికేషన్లు వేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్కారు తీసుకున్న నిర్ణయంతో నిరుద్యోగుల ఆశలు తీరుతాయో లేక మళ్లీ వాయిదాల పర్వం కొనసాగుతుందో తెలియడం లేదు.

రాబోయే ఏడాదిలో ఎన్నికలు వస్తుండటంతో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సమాయత్తమవుతోంది. ఇన్నాళ్లు నిరుద్యోగుల్లో గూడు కట్టుకున్న ఆగ్రహాన్ని చల్లార్చేందుకే ఇలా నోటిఫికేషన్లు విడుదల చేస్తుందని చెబుతున్నారు. ఇలా నోటిఫికేషన్లు వేసి అలా కోర్టుల్లో కేసలు వేయించి నియామకాల ప్రక్రియ మరింత ఆలస్యం చేయాలని చూస్తోందనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం నిజంగానే ఉద్యోగాలు భర్తీ చేస్తే నిరుద్యోగుల ఆశలు నెరవేరినట్లే.