Jagan Politics : ఏపీ సీఎం జగన్ కు 2022 మిశ్రమ ఫలితాలను అందించింది. గత మూడేళ్లుగా ఏకపక్షంగా సాగిన అధికార పార్టీ రాజకీయానికి ఈ ఏడాదిలోనే కాస్తా బ్రేకులు పడ్డాయి. గత ఎన్నికల్లో ఏకపక్ష విజయంతో జగన్ ఆత్మవిశ్వాసం పెరిగింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల్లో గెలుపుతో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. కానీ జగన్ మూడు సంవత్సరాల పాలన ముగించుకొని నాలుగో ఏడాదిలో అడుగుపెట్టేసరికి సీన్ రివర్స్ అయ్యింది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగింది. విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల గ్రాఫ్ పెరిగిన సంకేతాలు ప్రజల నుంచి స్పష్టంగా కనిపించాయి. దీంతో సహజంగానే జగన్ గ్రాఫ్ తగ్గినట్టయ్యింది. తమకు తిరుగులేదన్న అతి ధీమా నుంచి ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న మాట మాత్రమే వినిపిస్తోంది. అటు జగన్ సైతం కొత్త సంవత్సరంలో వ్యూహాలకు పదును పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది.
ఈ ఏడాది జగన్ కు అత్యంత కీలకం. ఇప్పటివరకూ సంక్షేమ తారక మంత్రాన్ని పఠిస్తూ వచ్చిన జగన్ అభివృద్ధిని గాలికొదిలేశారన్న అపవాదును మూటగట్టుకున్నారు. దానిని నుంచి బయటపడేందుకు ఆయన ప్రయత్నించే చాన్స్ ఉంది. మరోవైపు విపక్షాలు బలపడకుండా రాజకీయంగా పావులు కదుపుతున్నారు. కానీ అదంతా ఈజీగా వర్కవుట్ అయ్యేలా లేదు. ఇప్పటికే టీడీపీ, జనసేనలు ఒకే భావంతో పనిచేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ ను అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా ఇరు పార్టీలు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు జగన్ కు కత్తిమీద సామే. ఎన్నికలకు చివరి ఏడాది కావడంతో అన్నివర్గాలనూ సంతృప్తిపరచాలి. తాను ఒకబైబిల్ గా భావించే నవరత్నాలు, మరో వైపు అభివృద్ధి సమ ప్రాధాన్యం ఇవ్వాలి. అందులో ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా విపక్షాలకు అది అస్త్రంగా మారుతుంది.
పార్టీలోనూ క్రమశిక్షణ కట్టుదాటుతోంది. భయం అన్న పరిస్థితి నుంచి అధినేతకు భయపెట్టే రేంజ్ లో ఎమ్మెల్యేలు బాహటంగానే మాట్లాడుతున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ప్రకటించేసరికి ప్రతిబంధకంగా మారుతోంది. ఇన్నాళ్లూ సంక్షేమ పథకాలు అందించినా ప్రజల నుంచి కూడా ఏమంత ఆమోదం కనిపించడం లేదు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో సహాయ నిరాకరణ చేస్తోంది. వినయ విధేయతలు చూపుతున్నాకేంద్ర పెద్దలు అనుమానపు చూపులు చూస్తున్నారు. పైగా రాష్ట్రంలో ఉన్న తన ప్రత్యర్థులకు సహకరిస్తున్నారు. అలాగని ఇప్పటికిప్పుడు కేంద్ర పెద్దలను దూరం చేసుకుంటే కేసుల రూపంలో ఇబ్బందులు తప్పవు అన్న బెంగ వెంటాడుతోంది. ప్రజా వ్యతిరేకత ఒక వైపు, విపక్షాల ఐక్యత ఇంకో వైపు, కేంద్రం సహాయ నిరాకరణ మరోవైపు జగన్ ను కలవరపెడుతున్నాయి. అటు పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు చికాకు తెప్పిస్తున్నాయి. అందుకే బడ్జెట్ సమావేశాల తరువాత అసెంబ్లీని రద్దు చేస్తారన్న ప్రచారమూ ఉంది.
అయితే ఇప్పటివరకూ చేసిన రాజకీయం ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి జరగబోయేది మరో ఎత్తు. అందుకే జగన్ అచీతూచీ అడుగులు వేయాల్సిన సమయమిది. ప్రజలను సంతృప్తిపరచాలి. వారి ఆమోదం పొందాలి. మూడేళ్ల పాటు ఏకపక్ష అధికారాన్ని నడిపిన జగన్ కు తొలిసారిగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఝలక్ ఇచ్చారు. అప్పటి నుంచి ప్రజా వ్యతిరేకత ప్రారంభమైంది. ఒక్కో వర్గం దూరమవుతూ వచ్చింది. అటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగవర్గాలకు గ్యాప్ పూడ్చలేని స్థాయికి చేరుకుంది. దానిని తగ్గించుకునేందుకు జగన్ కు ఈ ఏడాదే ఉంది. అయితే ఈపాటికే ఆ రెండు వర్గాలు డిసైడ్ అయిపోయాయి. జగన్ ను అధికారానికి దూరం చేసేందుకు విపక్షాలు ఎంత పోరాడుతున్నాయో.. అదే రేంజ్ లో రెండు వర్గాలు చాపకింద నీరులా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. నవరత్నాల్లో చాలా కీలకమైన హామీలు మిగిలిపోయాయి. లక్ష ఉద్యోగాలు, సంపూర్ణ మద్య నిషేధం వంటివి అమలుచేయడానికి జగన్ కు ఈ ఏడాదే చివరి అవకాశం. కానీ క్షేత్రస్థాయిలో ఉద్యోగాల భర్తీ, అంటే ఖర్చుతో కూడుకున్న పని. మద్య నిషేధం అంటే ఆదాయం వదులుకోవడమే. అంటే ఈ రెండు హామీలు అమలయ్యే చాన్సే లేదు. మొత్తానికైతే సీఎం జగన్ కు కొత్త ఏడాది అనేక సవాళ్లతో స్వాగతం పలుకుతోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: What is jagans politics in the new year
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com