AP Police: కంచే చేను మేస్తే . రక్షించాల్సిన వాడే చేతులెత్తేస్తే. ఏకపక్షంగా ఓ పార్టీకి కొమ్ము కాస్తే. ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుందా ?. పౌరులు స్వేచ్చగా జీవించగలుగుతారా ?. ఇవే ప్రశ్నలు ఏపీ పౌర సమాజాన్ని వేధిస్తున్నాయి. ఏపీ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఉద్యోగ బాధ్యతల స్వీకరణ సమయంలో చేసిన ప్రమాణం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలీసు వ్యవస్థను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు. శాంతిభద్రతల పర్యేవేక్షణకు కాకుండా సొంత పార్టీ పనులకు వాడుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే పోలీసులకు పని అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఒక కుప్పం ఘటన.. మరొక విజయవాడ ఘటన ఎక్కడ చూసినా అధికార దుర్వినియోగమే. బాధితుల పైనే రివర్స్ కేసులు పెట్టడం . ఇదొక పరిపాటిగా మారింది. పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే బాధితులు భయపడే పరిస్థితి ఏపీలో నెలకొంది.
గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు ఏపీలో దాపురించాయి. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయడం గత ప్రభుత్వాల విషయంలో కూడ జరిగింది. కానీ ఇంత ఏకపక్షంగా అధికార పార్టీ సొంత సైన్యంలా పని చేయడం ఇదే తొలిసారి. పోలీసులంటే భయం, గౌరవం రెండు ఉన్నాయి. కానీ క్రమంగా అవి తొలగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులను ప్రజలు ఓ పార్టీ ప్రతినిధులుగా చూసినప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే పరిస్థితి తగ్గిపోతుంది. సమాజంలో అశాంతి నెలకొంటుంది. పోలీసులతో న్యాయం జరగదన్నప్పుడు జనం వేరే దారుల్ని వెతుక్కుంటారు. సమాజంలో అంతర్యుద్దం రగిలే అవకాశం ఏర్పడుతుంది.

బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాలు పెట్టుకోవద్దని ప్రభుత్వం జీవో తెచ్చింది. కానీ వైసీపీ నేతలు యథేచ్చగా ఆ జీవోను ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వంలోని వారికి ఒక న్యాయం, ప్రతిపక్షంలోని వారికి ఒక న్యాయం ఉంటుందా అన్న ప్రశ్న పోలీసులు వేసుకోవాలి. వేల మందితో సభలు, సమావేశాలు అడ్డుకోవడం బదులు, వందల మందితో భద్రత కల్పించొచ్చు కదా. ఆ మాత్రం ఆలోచన చేయలేరా ? అన్న ప్రశ్న బుద్ధిజీవుల నుంచి వినిపిస్తోంది. పోలీసుల తీరు మార్చుకోకపోతే భవిష్యత్ పరిణామాలు ఊహకందని విధంగా ఉంటాయన్న భయం సామాన్యులలో కనిపిస్తోంది. పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. లేనిపక్షంలో ఇన్నేళ్ల విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదం ఉంది.