Viral Video : వానొస్తే మనం ఏం చేస్తాం.. ఎగిరి గంతేస్తాం. చల్లని వాతావరణంలో వేడి వేడి మిర్చి బజ్జీనో, గరం గరం సమోసాను తింటూ వర్షాన్ని ఆస్వాదిస్తాం. కళాపోషణ ఎక్కువ ఉన్న వారయితే కిటికీ పక్కన కూర్చుని కప్పులో నిండుగా వేడి వేడి కాఫీని తాగుతూ వాన చినుకులను చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇంకొందరయితే వానలో బైక్ మీద డ్రైవ్‌కు వెళ్తారు. వానలో తడుస్తూ ఒళ్లంత తుళ్లింత కావాలిలే అంటూ సయ్యాటలాడుతారు. కాగితపు పడవలను నీటిలో వదులుతూ సయ్యాటలాడుతుంటారు. ఇప్పటి దాకా వాన గురించి పాజిటివ్ కోణమే మీరు చదివారు. కానీ కురిస్తే వాన అందరికీ ఒకేలా ఉండదు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. జోరుగా వర్షం కురుస్తుంటే ఓ మహిళ నెత్తిపై గొడుగు పెట్టుకుని బజ్జీలు వేస్తోంది. వర్షం కూడా భారీగా కురుస్తుండటంతో రోడ్డుపై పెద్దగా జన సంచారం లేదు. గిరాకీ లేకపోవడంతో ఆ మహిళ అలానే దీనంగా చూస్తోంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గాని ఓ నెటిన్ వీడియో తీసి ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. ఫలితంగా ఆ వీడియో చూస్తుంటే హృదయం ద్రవిస్తోంది.
ఇప్పటికే ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ నమోదు చేసుకుంది. ఈ వీడియో పోస్ట్ చేసిన నెటిజన్ ‘రెయిన్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఆల్’ అనే క్యాప్షన్ రాశాడు. అయితే ఈ వీడియోలో ఉన్న మహిళకు ఎదురుగా ఉన్న బోర్డులో తమిళ అక్షరాలు కన్పించాయి. అంటే ఈ ప్రాంతం తమిళనాడు రాష్ట్రంలోని ఓ పట్టణం లేదా నగరం అని తెలుస్తోంది. సాధారణంగా బజ్జీల దుకాణం అంటే మనకు నాలుగు చక్రాల బండి గుర్తుకు వస్తుంది. కానీ ఈ మహిళ మాత్రం అలాంటిదేమీ లేకుండా మాములుగా ఓ పాస్టిక్ స్టూల్ మీద కూర్చుంది. ఆమె ముందు చిన్నపాటి గ్యాస్ స్టౌ ఉంది. చుట్టూ ఇనుపరేకు ఉంది. అంటే ఆమె ఎంత పేదరికంలో ఉందో? ఈ వీడియో చూసిన వారు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘ ఆ మహిళ అడ్రస్ చెప్పండి మేం ఆర్థిక సాయం చేస్తామంటూ’ తమ ఉదారతను చూపిస్తున్నారు.