Snake Revenge: ఓ వ్యక్తిపై మరో వ్యక్తి సంవత్సరాలుగా కక్ష పెట్టుకుంటే అతనిది ‘పాము పగ’ అని అంటుంటారు. అంటే పాము ఒక్కసారి పగబడితే జన్మజన్మలు వెంటాడుతుందని కొందరు ఆధ్యాత్మిక వాదులు చెబుతూ ఉంటారు. ఎప్పుడో పెద్దలు చేసిన తప్పుకు ఏడుతరాలు నాగదోశంతో బాధపడుతూ ఉంటారట. అందుకే నాగదోశం పోవడానికి చాలా మంది పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. అయితే ఓ వ్యక్తి ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా పాము పగ పోవడం లేదు. రాష్ట్రాలు దాటి వెళ్లినా అక్కడా పాములు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆయనకు చాలా సార్లు పాము కాటేసిందట. ఈ చికిత్సకే ఎకరం పొలం అమ్ముకున్నాడట. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోండి..
ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఉంది పెద్ద చెల్లారగుంట గ్రామ పంచాయతీ పరిధిలో మూరుమూల గ్రామం కుమ్మరి కుంట. ఈ గ్రామంలో సుబ్రహ్మణ్యం, శాదర అనే దంపతులు నివసిస్తున్నారు. సుబ్రహ్మణ్యానికి చిన్నప్పటి నుంచే పాములు వెంటాడుతున్నాయి. తాను 10 ఏళ్ల వయసులో ఉండగా పాము కరిచింది. ఆ తరువాత మరికొన్ని సంవత్సరాల తరువాత మరోసారి కరిచింది.
ఇలా తనకు పెళ్లయి, ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కూడా అతనిని పాములు కరుస్తూనే ఉన్నాయి. తనకు పాములు కరవడం వల్ల చికిత్స కోసం ఎకరం పొలం అమ్ముకున్నాడంటే.. అతనికి ఏం రేంజ్ లో ఖర్చవుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే సొంత ఊళ్లో ఉంటే పాములు కరుస్తున్నాయని, అతను కుటుంబంతో సహా కర్ణాటకకు వెళ్లాడు. అక్కడా పాములు వెంటాడాయి. దీంతో చేసేదేమీ లేక సుబ్రహ్మణ్యం దంపతులు ప్రతీ దేవుడని మొక్కుతూ ఈ బాధను తీర్చాలని కోరుతున్నారు.
తనను ఇలా పాములు ఎందుకు వెంటాడుతున్నాయో అర్థం కావడం లేదని సుబ్రహ్మణ్యం కొన్ని మీడియా సంస్థలకు తెలిపాడు. తాను ఎక్కడికి వెళ్లినా పాములు వెంటాడడం మానడం లేదని అంటున్నారు. అయితే పూర్వకాలంలో ఎవరో చేసిన తప్పుకు తానుబలవుతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే తాను చేస్తున్న పూజలకు దేవుడు కరుణించికాపాడాలని వేడుకుంటున్నాడు.