
JanaSena On Early Election: ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వెలువడుతున్న వేళ అన్ని పార్టీలు అలెర్టయ్యాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అయితే ఈ విషయంలో జనసేన కొంచెం భిన్నంగా వ్యవహరిస్తోంది. పవన్ ప్రస్తుతం సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది చివరి వరకూ ఆయన సినిమాల చిత్రీకరణ జరగనుంది. అయితే ముందుస్తుకు చాన్స్ లేదన్న సమాచారంతోనే ఆయన సినిమా షూటింగ్ లను కొనసాగిస్తున్నారన్న టాక్ ఉంది. అయితే మిగతా పార్టీల ముందస్తు సన్నాహాలు చూసి జన సైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు వస్తే వెనుకడిపోతామన్న బెంగ వారిని వెంటాడుతోంది.
గత ఏడాది యాక్టివ్ గా…
గత ఏడాది జనసేన కార్యక్రమాలు చాలా యాక్టివ్ గా జరిగాయి. పవన్ కౌలురైతు భరోసా యాత్ర చేపట్టింది ఆ ఏడాదిలోనే. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సక్సెస్ ఫుల్ గా కార్యక్రమం సాగింది. ఒక్కో రైతు కుటుంబానికి రూ.లక్ష చొప్పున సాయమందించారు. ప్రజల నుంచి కూడా కార్యక్రమానికి విశేషస్పందన లభించింది. అదే ఊపుతో పార్టీ అనుబంధ విభాగాలను భర్తీచేశారు. జన సైనికులు చాలా యాక్టివ్ గా పనిచేశారు. దీంతో జనసేన గ్రాఫ్ పెరిగినట్టు విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. అదే ఊపుతో నారసింహ యాత్ర, వారాహి యాత్రలు చేపడతారని జనసేన వర్గాలు చెబుతూ వచ్చాయి. కానీ పవన్ అవేవీ చేపట్టకుండా సినిమాలపైనే కాన్సంట్రేట్ చేశారు.
అధికార పార్టీలో విస్మయం..
అయితే ఇప్పుడు ముందస్తు ముచ్చట సందడి చేస్తున్న వేళ పవన్ చర్యలపైనే చర్చ నడుస్తోంది. జగన్ ముందస్తుకు వెళితే నవంబరు, డిసెంబరులో తెలంగాణతో పాటే ఎన్నికలు జరగనున్నాయి. రమారమి ఆరు నెలల కూడా సమయం లేదు. అయితే పవన్ సినిమాల షెడ్యూల్ చూస్తే ఈ ఏడాది చివరి వరకూ ఉన్నాయి. దీంతో పవన్ వ్యూహం ఏమిటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. అంతరంగం ఎవరికీ తెలియడం లేదు. ముఖ్యంగా వైసీపీలో విస్మయం వ్యక్తమవుతోంది. మేమింతగా హడావుడి చేస్తున్నా పవన్ లో కనీస స్పందన లేకపోవడం ఏమిటని చర్చ నడుస్తోంది. పవన్ వద్ద ఏదో ప్లాన్ ఉందన్న అనుమానం వ్యక్తమవుతోంది.

వ్యూహాత్మకంగా పవన్?
అన్ని పార్టీల కంటే జనసేన ముందంజలో ఉంది. పవన్ సినిమాల్లో బిజీగా ఉన్నా.. పార్టీ బాధ్యతలను నాదేండ్ల మనోహర్ చూస్తున్నారు. మరోవైపు ద్వితీయ శ్రేణి నాయకత్వం సైతం ఎన్నికలకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది రణస్థలంలో యువశక్తి, బందరులో పార్టీ ఆవిర్భావ సభతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. పార్టీ కేడర్ వరకూ ఓకే కానీ.. పవన్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై కాన్సంట్రేట్ చేస్తే మంచి ఫలితాలు వచ్చే చాన్స్ ఉంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉన్నా.. లేకున్నా జనసేన గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకోవడంతో పాటు కింగ్ మేకర్ గా మారేందుకు అవసరమైన గెలుపు అనివార్యం. అందులో భాగంగానే పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు విశ్లేషణలు వెలువడుతున్నాయి. మిగతా రాజకీయ పక్షాలకు అందని రీతిలో పవన్ వ్యూహాలు రూపొందించుకున్నట్టు తెలుస్తోంది.