
AP MLC Elections Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ సర్కారుకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో ఏకపక్షంగా ఫలితాలు వచ్చినా.. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం ప్రతికూల అంశాలు ప్రభావితం చూపుతున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారు. అవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ లో ఉద్యోగులు తమ ప్రతాపం చూపారు. వైసీపీని కిందకు పడేశారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ అనంతపురంలోని జేఎన్ టీయూ కళాశాలలో ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. కానీ అధికార వైసీపీకి ఉద్యోగులు గట్టి షాకిచ్చారు.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానానికి సంబంధించి మొత్తం 280 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. అయితే ఇందులో 155 ఓట్లు చెల్లనివిగా నిర్ధేశించడం అనుమానాలకు తావిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ లో ప్రతికూల ఫలితాలు వస్తాయనే ఇలా ఇన్ వేలిడ్ ఓట్లుగా సైడ్ చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే మిగతా 125 ఓట్లలో పీడీఎఫ్ అభ్యర్థి పోతల నాగరాజుకు 75 ఓట్లురాగా.. టీడీపీ బలపరచిన రాంగోపాలరెడ్డికి 31 ఓట్లు వచ్చాయి. వైసీపీ బలపరచిన రవీందర్ రెడ్డికి మాత్రం కేవలం 19 ఓట్లే రావడం గమనార్హం. అధికార పార్టీకి ఏకంగా మూడో ప్లేస్ కు నెట్టేసిన ఉద్యోగులు తమ ఆగ్రహాన్ని బయపెట్టారు. అయితే పీడీఎఫ్ తరువాత టీడీపీ నిలబడడంతో ఆ పార్టీలో ఆనందం వ్యక్తమవుతోంది, మొత్తం ఓట్లు చెల్లుబాటు అయితే వైసీపీకి చుక్కలు కనిపించి ఉండేవని విపక్షాలు ఘాటుగానే కామెంట్స్ చేస్తున్నాయి.

గత సాధారణ ఎన్నికల ఫలితాల సమయంలో పోస్టల్ బ్యాలెట్లలోనే వైసీపీ విజయం తెలిసిపోయింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆ ఎన్నికల్లో ఏకపక్షంగా వైసీపీకి మద్దతు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లలో మెజార్టీని ఆ పార్టీకే కట్టబెట్టారు. నియోజకవర్గంలో 3 వేల వరకూ పోస్టల్ బ్యాలెట్లు ఉంటే అందులో రెండొంతులు.. రెండు వేలకుపైగా వైసీపీకే నమోదయ్యాయి. కానీ నాలుగేళ్ల తరువాత సీన్ మారిపోయింది. ఉద్యోగులకు జీతాలు ఎప్పుడిస్తారో తెలియని స్థితి. అలాగే నూతన పీఆర్సీ, ఇతరత్రా తమ సమస్యలను పరిష్కరించకపోగా, అణచివేత చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందనే ఆవేదన ఉద్యోగుల్లో వుంది. ఉద్యోగుల్లో వ్యతిరేకతను తగ్గించుకోడానికి బదులు, పూర్తిగా వారిని ప్రత్యర్థులుగా వైసీపీ భావిస్తుండడంతో వారి మధ్య ఎడబాటు మరింత పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. వైసీపీ ఏకంగా మూడో ప్లేస్ కు చేరుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ లెక్కింపు పూర్తయిన నాటికి వైసీపీ బలపరచిన అభ్యర్థులు ఎన్నో స్థానంలో ఉంటారోనని అధికార పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.