
MLC Elections- YCP: ఎవరూ చేజేతులా కష్టాలు కోరి తెచ్చుకోరు. కానీ ఏపీలో మాత్రం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ బాధితవర్గాలుగా మిగిలిపోయారు. గత సాధారణ ఎన్నికల్లో ఏకపక్షంగా మద్దతుగా నిలిచిన ఈ రెండు వర్గాలు వైసీపీ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. ఇప్పుడు నాలుగేళ్లు తిరిగేసరికి అదే వైసీపీకి వ్యతిరేకంగా మారిపోయారు. ప్రభుత్వంతో తలపడుతున్నారు. ఎప్పుడు ఒకటో తేదీకి వచ్చే జీతం జాడలేదు. వేతన బకాయిల చెల్లింపులు లేవు. రుణ రాయితీలు లేవు. పీఆర్సీ అమలు లేదు. ఇలా ఏ అంశం తీసుకున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రతికూలంగా కనిపిస్తోంది. పైగా ఉపాధ్యాయుల సర్దుబాటు, యాప్ లనమోదు.. ఇలా అన్నింటిపై కత్తికట్టిన జగన్ సర్కారు వారిని చేజేతులా దూరం చేసుకుంది. నాడు ఏకపక్షంగా మద్దతు తెలిపిన వారే.. నేడు ప్రత్యర్థులుగా మారిపోయారు.
ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరూ ఎన్నికల జోలికి వెళ్లరు. పైగా పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు వామపక్ష అనుబంధ సంఘాలవి. కానీ ఆ స్థానాలపై కూడా జగన్ గురిపెట్టారు. వాటిని గెలవడం ద్వారా వచ్చే ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలని భావించారు. చాలా లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రతికూల ఫలితాలు వెల్లడయ్యేసరికి మైండ్ బ్లాక్ అవుతోంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్ లో ఏకంగా లాస్ట్ ప్లేస్ లోకి రావడంతో చివరి ఫలితాల్లో అదే సీన్ రిపీట్ అవుతుందని తెగ కంగారు పడుతున్నారు. అనవసరంగా ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల జోలికి వెళ్లామని వైసీపీ నేతలు ఆందోళన పడుతున్నారు.
అయితే ఉద్యోగులు ఏనాడో డిసైడ్ అయ్యారు. పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మిలీనియం మార్చ్ నిర్వహించిన ఉద్యోగులు ప్రభుత్వాన్ని గట్టి అల్టిమేట్ ఇచ్చారు. అప్పటి నుంచే ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు ప్రారంభమయ్యాయి. అయితే తరువాత ఉద్యోగ సంఘాల నేతలను గుప్పెట్లో పెట్టుకున్న ప్రభుత్వం మరోసారి ఆ తరహ ఉద్యమం రాకుండా జాగ్రత్తపడింది. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఉద్యోగ సంఘాల నేతలతో పని లేకుండా ఉద్యోగులు దూకుడు పెంచారు. మరో ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం జాగ్రత్త పడింది. ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించడానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. కానీ ఇవేవీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేయలేదు.

ఒకరకంగా చెప్పాలంటే ఏపీలో ఉద్యోగ, ఉపాధ్యాయులే ఇప్పుడు విపక్ష పాత్ర పోషిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏపీలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వారికి న్యాయబద్ధంగా చేస్తున్న చెల్లింపులు లేవు. గత ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలు లేవు. చివరకు పీఆర్పీలో కోత విధించారు. గత కొన్నేళ్లుగా లెక్కకట్టి కోత విధించి వెనక్కి ఇచ్చేయ్యాలని ఆదేశాలిచ్చారు. అటు సీపీఎస్ పై కూడ మడమ తిప్పేశారు. అప్పుడెప్పుడో అవగాహన లేకుండా హామీ ఇచ్చానని.. అమలుచేయడం చాలా కష్టంగా తేల్చేశారు. దాని బదులుగా వేరే ప్రయోజనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే కొత్త పరీక్ష పెట్టారు. వారు ఆశిస్తున్న ప్రయోజనాలను కట్టడి చేసేందుకు జీతాలు ఆలస్యం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా మూడో వారం దాటిన తరువాత జీతాలు చెల్లిస్తుండడంతో పాత డిమాండ్లను ఉద్యోగులు మరచిపోతున్నారు. ఒకటో తేదీ జీతం ఇస్తే చాలు అన్నట్టు ఒక మెట్టుకు దిగిపోతున్నారు. నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏటా ఉద్యోగాల కేలండర్ ఇస్తానన్న హామీ కార్యరూపం దాల్చలేదు. ప్రత్యేక హోదాతో యువత జీవితాలు మరిపోతాయని భ్రమ కల్పించారు. దానికి అతీగతీ లేదు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు వచ్చిన అవకాశాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి సంకేతాలు ఇప్పటి నుంచే పంపించడంలో సక్సెస్ అయ్యారు.