
Undercover Cop : దొంగలను పట్టుకోవడానికి పోలీసులు అనేయ ప్రయత్నాలు, మార్గాలు అనుసరిస్తారు. అనుమానితుల విచారణ మొదలు.. మారువేషాల్లో తిరుగుతూ నిందితుల కోసం వేట సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో ఓ గొలుసు దొంగను పట్టుకునేందుకుగానూ పోలీసులు.. పండ్లు, కూరగాయలు విక్రయించారు. దిక్కుమొక్కులేని నిరాశ్రయులుగా నటించారు. ఆటోలూ నడిపారు. చివరకు ఓ ఆటోలోనే నిందితుడిని నిర్బంధించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ వ్యవహారం పాల్ఘర్ జిల్లాలో వెలుగుచూసింది.
చైన్ స్నాచింగ్ చేస్తూ చిక్కకుండా..
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని అంబివలీ ప్రాంతానికి చెందిన అబ్బాస్ అమ్జద్ ఇరానీ(24) పాత నేరస్థుడు. చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్నాడు. నిందితుడి ఆచూకీ లభించినప్పటికీ.. అరెస్టు చేద్దామంటే అతని సంబంధీకుల నుంచి పోలీసులకు దాడుల ముప్పు పొంచి ఉంది. గతంలో ఇటువంటి ఘటనలే చోటుచేసుకున్నాయి.
మారువేషాల్లో..
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు మారువేషాల్లో ఆపరేషన్ చేపట్టాలని పోలీసులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే పండ్లు, కూరగాయల విక్రయదారులు, ఆటో నడిపేవారు, రోడ్లపై తిరిగే నిరాశ్రయులుగా అవతారమెత్తారు. ఇలా దాదాపు రెండు వారాలపాటు అతనిపై నిఘా ఉంచారు. ఎట్టకేలకు ఇటీవల అతన్ని ఒంటరిగా గుర్తించి, చాకచక్యంగా ఆటోలో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇరానీ అరెస్టుతో జిల్లాలో ఏడు గొలుసు చోరీల కేసులు పరిష్కారమైనట్లు పోలీసులు తెలిపారు. ఓ ద్విచక్ర వాహనంతోపాటు దాదాపు రూ.3.31 లక్షల విలువైన బంగారు ఆభరణాలనూ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడిపై 21 కేసులు ఉన్నట్లు వెల్లడించారు.
శాంతిభద్రతలూ ముఖ్యమే..
దొంగలను పట్టుకోవడం ఎంత ముఖ్యమో శాంతిభద్రతలు కూడా పోలీసులకు అంతే ముఖ్యం. ఇరానీ విషయంలో పోలీసులకు శాంతిభద్రతల సమస్య ఎదురైంది. అతన్ని అరెస్టు చేస్తే అల్లర్లు జరుగతాయని గుర్తించారు. గత అనుభవాలను గుర్తించారు. అరెస్ట్ కన్నా.. శాంతిభద్రతలే ముఖ్యమని భావించారు. దీంతో శాంతికి భంగం కలుగకుండా ఎవరికీ అనుమానం రాకుండా.. అరెస్ట్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయం బయటకు పొక్కకుండా సైలెంట్‌గా పని కానిచ్చేశారు. మారు వేషాల్లో మహారాష్ట్ర పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించింది.