
Bandi Sanjay: నిన్న వరంగల్లో పదో తరగతి హింది ప్రశ్న పత్రం వాట్సాప్ లో చక్కర్లు కొట్టిన నేపథ్యంలో నాటకీయ పరిణామాలు జరిగాయి. బుధవారం తెల్లవారుజామున ఒంటిగంటకు కరీంనగర్ జిల్లా పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ ని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆయన అరెస్టును ఖండిస్తూ బిజెపి నాయకులు ఆందోళనలు చేశారు.. కరీంనగర్ కు కాకుండా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.
అయితే ఎఫ్ఐఆర్లో పోలీసులు ఎక్కడా కూడా బండి సంజయ్ పేరును నమోదు చేయలేదు. అయితే పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుట్ర చేస్తున్నారని, అందుకే ముందస్తు చర్యగా ఆయనను అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. వికారాబాద్, వరంగల్ జిల్లా కమలాపూర్ లో పదో తరగతి తెలుగు, హిందీ ప్రశ్న పత్రాల లీకేజీకి సంబంధించి బండి సంజయ్ ప్రెస్ నోట్లు ఇచ్చారని, పేపర్ లీకేజ్ లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని పోలీసులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద ధర్నాలు చేయాలని, పరీక్షల నిర్వహణకు విఘాతం కలిగించేలా ఆందోళన చేయాలని బిజెపి శ్రేణులకు ఆయన ఉద్దేశపూర్వకంగా పిలుపునిచ్చారని పోలీసులు పేర్కొన్నారు. బండి సంజయ్ చర్యల వల్ల పరీక్షలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అందుకే ముందస్తుగా అరెస్ట్ చేసామని పోలీసులు చెబుతున్నారు. అనేకమంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, పరీక్షలకు విఘాతం కలగకుండా ఉండేందుకే బండి సంజయ్ ని ప్రివెన్షన్ కింద అరెస్టు చేశామని పోలీసులు వివరిస్తున్నారు.

అయితే మాస్ కాపీయింగ్ వ్యవహారంలో బండి సంజయ్ పాత్రకి సంబంధించి ఎక్కడ పోలీసులు ఎఫ్ ఐ ఆర్ లో మెన్షన్ చేయలేదు. కేవలం రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని, ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారని, అందుకే అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచామని పోలీసులు చెబుతున్నారు. కాగా ఇప్పటికే బిజెపి లీగల్ సెల్ తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే బండి సంజయ్, ప్రశాంత్ చాటింగ్ ల పై పోలీసులు దృష్టి సారించారు.
పేపర్ లీక్ కంటే ముందు రోజు ప్రశాంత్ తో బండి సంజయ్ చాటింగ్ చేశారని, సంజయ్ తో ప్రశాంత్ 100 సార్లకు పైగా కాల్స్ మాట్లాడినట్టు గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. మంగళవారం సంజయ్ కీ పేపర్ పంపిన తర్వాత కూడా ప్రశాంత్ ఫోన్లో మాట్లాడినట్టు తాము గుర్తించామని వారు వివరిస్తున్నారు.. ప్రశాంత్ వాట్సప్ చాట్ ను రీ ట్రీట్ చేస్తున్నామని వారు అంటున్నారు. అయితే సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ మధ్య సోషల్ వార్ జరుగుతోంది. ఇద్దరు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మరో వైపు తెలంగాణ పోలీసులు పలువురు బిజెపి నాయకులను అరెస్ట్ చేశారు. వి నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.