
BJP- TDP And JanaSena: తెలుగునాట ఎన్నికల వేడి రగులుతోంది. వేసవిలో సెగలు కక్కుతోంది. పార్టీల మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు నడుస్తున్నాయి. ఒకరికొకరు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నారు. రాష్ట్రంగా వేరుపడినా.. రాజకీయాలను మాత్రం విడదీయలేని అనివార్య పరిస్థితి నెలకొంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నా.. జాతీయ పార్టీలు సైతం సై అంటున్నాయి. దీంతో శత్రువుకు శత్రువులు మిత్రులవుతున్నారు. మరికొందరు అవసరం కోసం మిత్రులుగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాక్షేత్రంలో కంటే పార్టీ మధ్య నడుస్తున్న వ్యవహారాలే అసలు సిసలైన రాజకీయాలను తలపిస్తున్నాయి.
కర్నాటక ఎన్నికల తరువాత క్లారిటీ..
ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి నడవాలని డిసైడయినట్టు వార్తలు వస్తున్నాయి. అటు బీజేపీని కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే జనసేన వరకూ పొత్తు ఓకే అయినా.. టీడీపీతో కలిసి వెళ్లలేమని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో బీజేపీ అగ్రనేతలు నోరు మెదపడం లేదు. సరిగ్గా ఇటువంటి సమయంలో జనసేన అధినేత పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు కీలక నేతలను కలిశారు. వైసీపీ విముక్త ఏపీ కోసం ప్రయత్నిస్తున్నట్టు ఢిల్లీ వేదికగా ప్రకటించారు. బీజేపీది కూడా అదే విధానంగా చెప్పుకొచ్చారు. అయితే ఏపీలో పొత్తుల విషయం కర్నాటక ఎన్నికల తరువాత తేలుద్దామని ఢిల్లీ పెద్దలు చెప్పినట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
కర్నాటక ఎన్నికల తరువాత క్లారిటీ..
కర్నాటక ఎన్నికల తరువాత నవంబరులో కానీ.. డిసెంబరులో కానీ తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. కర్నాటకలో హంగ్ వచ్చి బీజేపీ వెనుకబడితే ఏపీ విషయంలో నిర్ణయం వేగంగా తీసుకునే చాన్స్ ఉంది. తెలంగాణ ఎన్నికల నాటికి ఈ నిర్ణయం తీసుకోవడం అనివార్యం. ప్రస్తుతం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు బీజేపీ ధీటైన సవాలే విసురుతుంది. కానీ వచ్చే ఎన్నికల్లో విజయానికి సరిపడా బలం బీజేపీకి లేదన్న వాదన ఉంది. అందుకే టీడీపీ, జనసేనను కలుపుకొని వెళితే ఆ రెండు పార్టీలకు ధీటుగా జవాబు చెప్పొచ్చన్న టాక్ ఉంది. అందుకే కర్నాటక ఎన్నికల అనంతరం గ్రీన్ సిగ్నల్ ఇస్తే మూడు పార్టీల కలయికకు ముందడుగు పడే అవకాశం ఉంది. అదే జరిగితే తెలంగాణలో బీజేపీ టెంపర్ పెరిగేందుకు అస్కారముంది.

మూడు జెండాలు కలిస్తే..
తెలంగాణ ఎన్నికల్లో కానీ బీజేపీ తమ రూటుకు వస్తే.. ఏపీలో కూడా ఆ పార్టీకి కూటమిలోకి తేవొచ్చన్నది చంద్రబాబు భావన. అందుకే తెలంగాణలో పార్టీని యాక్టివ్ చేస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీని బలోపేతం చేస్తున్నారు. సెటిలర్స్ ఎక్కువగా ఉండే స్థానాలపై ఫోకస్ పెంచారు. అక్కడ పార్టీ కార్యక్రమాలు పెరిగే ఆటోమేటిక్ గా బీజేపీ ఎదురొచ్చి స్నేహం అందించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురవుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అందుకే గ్రేటర్ ను టార్గెట్ చేసుకుంటూ గతంలో టీడీపీలో పనిచేసిన వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తెలంగాణలో మద్దతు ఇచ్చి.. ఏపీలో తిరిగి తీసుకోవాలన్నదే చంద్రబాబు కాన్సెప్ట్. సో కర్నాటక ఎన్నికల అనంతరం బీజేపీ, టీడీపీ, జనసేన జెండాలు కలిసి కనిపించే చాన్స్ ఉందన్న మాట. అదే జరిగితే బీజేపీ టెంపర్ అమాంతం పెరుగుతందని విశ్లేషకులు భావిస్తున్నారు.