https://oktelugu.com/

Monsoon : మృగశిర వచ్చిన వానలు లేవు.. ఈసారి డేంజర్ వేవ్..

ముందు చెప్పుకున్నట్టు గానే బిపర్ జోయ్ తుఫాను అరేబియా సముద్రంలో ఏర్పడింది. ఇది గోవాకు నైరుతి దిశగా 950 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

Written By:
  • Rocky
  • , Updated On : June 8, 2023 12:00 pm
    Follow us on

    Monsoon : సాధారణంగా రోహిణి కార్తె లో రోకళ్ళు పలిగే విధంగా ఎండలు ఉంటాయి. రోహిణి ముగింపుకు వచ్చేసరికి వాతావరణం మారుతుంది. ఈలోగా కేరళ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకుతాయి. దంచి కొట్టిన ఎండల స్థానంలో మబ్బులు ఏర్పడతాయి. వాతావరణం చల్లగా మారుతుంది. వర్షాలు పడటం ప్రారంభమవుతుంది. ఇది ఏటా జరిగేదే. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా వాతావరణం ఉంది. మృగశిర కార్తె ప్రవేశించినప్పటికీ మబ్బుల ఆనవాళ్లు కనిపించడం లేదు. అంతేకాదు రోహిణి భగభగలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇంతకీ ఇలాంటి వాతావరణం ఏర్పడేందుకు కారణాలు ఏమిటో మీరూ చదివేయండి.

    ఏరువాక పౌర్ణమి వచ్చిందంటే చాలు
    సాధారణంగా ఏరువాక పౌర్ణమి వస్తే చాలు అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోతారు. విత్తనాలు వేసేందుకు దుక్కులను సిద్ధం చేసుకుంటారు. పత్తి సాగు చేసే రైతులు అచ్చు తోలుతారు. ఇక ఇతర వాణిజ్య పంటలు సాగు చేసే రైతులు తమ పొలాలను అందుకు అనుగుణంగా మార్చుకుంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. జూన్ 4న ఏరువాక పౌర్ణమి అయినప్పటికీ కనీసం దూకి దున్నేందుకు పొలంలోకి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఆ స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. పైగా ఈ ఏడాది వేసవిలో విపరీతమైన వర్షాలు కురిసాయి. ధాన్యం, వాణిజ్య పంటలు సాగు చేసే రైతులకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చాయి. కురవ కూడని సమయంలో వర్షాలు కురిసి రైతులను ఇబ్బందికి గురిచేసాయి. ఇప్పుడు కురవాల్సిన సమయంలో ముఖం చాటేస్తున్నాయి. వ్యవసాయ సీజన్ ప్రారంభం అయిన నేపథ్యంలో వర్షాలు కురిస్తే పనులు ముమ్మరంగా సాగుతాయని అన్నదాతలు అంచనా వేస్తున్నారు. వారి అంచనాలను నైరుతి రుతుపవనాలు తలకిందులు చేస్తున్నాయి.
    జూన్ మొదటి వారంలోనే రావాలి
    ముందుగానే మనం చెప్పినట్టు షెడ్యూల్ ప్రకారం నైరుతి రుతుపవనాలు కేరళ ప్రాంతాన్ని తాకాలి. వాస్తవానికి ఈ ప్రక్రియ మొత్తం జూన్ ఈ వారంలో ప్రారంభమవుతుంది.. గత మూడు సంవత్సరాలుగా దేశంలోకి నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయంలోనే ప్రవేశించాయి. కానీ ఈసారి మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. దేశంలో ప్రవేశానికి సంబంధించి దోబూచులాటాడుతున్నాయి. సర్వ సాధారణంగా ఈ సమయానికి కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కానీ ఆ స్థానంలో ఈ ఎండలు ప్రజలకు మరింత కాకను పుట్టిస్తున్నాయి. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఋతుపవనాలు సముద్రం పైనే నిలకడగా ఉండటంతో కేరళ తీరాన్ని తాకడం లేదు. దీనికోసం మరింత సమయం పట్టే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.. ఈ ప్రక్రియ మొత్తం  అడ్డుకుంటున్నాయని తెలుస్తోంది.
    అన్నదాతల్లో ఆందోళన
    వాస్తవానికి దోబూచులాటాడుతున్న నైరుతీ రుతుపవనాలు బుధవారం నాటికి కేరళ ప్రాంతాన్ని తాకాల్సి ఉంటుంది. అయితే మారిన వాతావరణ పరిస్థితుల వాతావరణ నిపుణులు మాత్రం మరో తొమ్మిది రోజుల దాకా ఎదురు చూడాల్సి ఉంటుందని అంటున్నారు. గత పది రోజులుగా రుతుపవనాలు అండమాన్, లక్షద్వీప్ ప్రాంతంలోనే తిష్ట వేశాయి. అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో అవి ముందుకు కదలడం లేదు. ఇవి దేశంలోకి ప్రవేశించాలంటే మరికొద్ది రోజులు సమయం పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
    జూన్ రెండో వారంలో
    ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ప్రకారం జూన్ రెండో వారం లో కేరళ రాష్ట్రాన్ని నైరుతీ రుతుపవనాలు తాకుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రకారం తెలంగాణను ఆ నైరుతి రుతుపవనాలు తాకాలి అంటే జూన్ మూడో వారం వరకు పట్టే అవకాశం ఉందని అధికారుల అంచనా ప్రకారం తెలుస్తోంది. ఇక ఈ ప్రకారం చూస్తే జూన్ మూడో వారం వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం చల్లబడే పరిస్థితి లేకుండా పోయింది. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. అయితే అవి నైరుతీ రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్నవి కావని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఈ వర్షాలను నమ్ముకుని పంటలు సాగు చేస్తే నిండా మునగక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
    ముందు చెప్పుకున్నట్టు గానే బిపర్ జోయ్ తుఫాను అరేబియా సముద్రంలో ఏర్పడింది. ఇది గోవాకు నైరుతి దిశగా 950 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ముంబై మహానగరానికి 1050 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతున్న ఈ తుఫాను గంటకు నాలుగు కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. మరో 24 గంటల్లో తుఫాన్ మరింత బలపడి తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు