https://oktelugu.com/

Kurnool: భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన భార్య.. నిస్సహాయ పరిస్థితిలో దుస్సాహసం!

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో హరికృష్ణ ప్రసాద్, లలిత దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులున్నారు. పెద్దకుమారుడు దినేశ్‌ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉద్యోగి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 30, 2023 10:13 am
    Kurnool

    Kurnool

    Follow us on

    Kurnool: పిల్లల్ని కని.. అల్లారు ముద్దుగా పెంచుకుంటారు తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి వారికి కావాల్సినవి సమకూర్చి, వారి కోసం రాత్రిపగలు కష్టపడతారు. సమాజంలో తమ పిల్లలను ఉన్నతస్థాయిలో చూడాలని ప్రతి పేరెంట్స్‌ కోరుకుంటారు. కానీ నేటి సమాజంలో జరుగుతున్న తీరు వేరు. పెరిగి పెద్దయ్యాక పిల్లలు తల్లిదండ్రులను మర్చిపోతున్నారు. ఆలనాపాలనా చూడకుండా వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పిల్లలు వేరు కాపురాలంటూ తల్లిదండ్రులకు దూరంగా బతుకుతున్నారు. వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటారునుకున్న పిల్లలు.. ఆస్తులు పంచే వరకు ఒకలాగా, రాసేశాక మరోలా ప్రవర్తిస్తున్నారు. పిల్లలు కారణంగా మనో వేదనకుగురై అనారోగ్యం బారిన పడి మరణిస్తున్నారు. కన్నవారి కడసారి చూపుకు కూడా రావడం లేదు. ఇదే జరిగింది ఆ దంపతుల విషయంలో.. నిస్సహాయ స్థితిలో ఏ భార్య తీసుకోకూడని నిర్ణయం తీసుకుంది. చేయకూడని పని చేసింది.

    పిల్లలు ఉన్నా.. అనాథలుగా…
    ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో హరికృష్ణ ప్రసాద్, లలిత దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులున్నారు. పెద్దకుమారుడు దినేశ్‌ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉద్యోగి. చిన్న కుమారుడు ముఖేశ్‌ కెనడాలో స్థిరపడ్డాడు. 15 ఏళ్లుగా హరికృష్ణ ప్రసాద్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భార్య లలిత ఆయనకు సపర్యలు చేస్తోంది. ఏడాది క్రితం ఆరోగ్యమ మరింత క్షీణించింది. దీంతో అన్నీ మంచపైనే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం హరికృష్ణ మంచంపై అచేతనంగా ఉండడంతో చనిపోయినట్లు భార్య లలిత గుర్తించింది. సహాయం కోసం ఎవరిని పిలవకుండా ఇంట్లోనే భర్త దహనసంస్కరాలు చేసే ప్రయత్నం చేసింది.

    ఇంట్లో నుంచి పొగలు రావడంతో..
    సోమవారం ఉదయం వీరి ఇంటి నుంచి∙పొగలు రావడంతో చుట్టుపక్కల వారు చూసి.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వచ్చి పరిశీలించారు. అప్పటికే బాడీ 80 శాతం కాలిపోయింది. భార్య లలితను విచారించగా.. తన భర్త సోమవారం ఉదయం చనిపోయినట్లు తెలిపింది. వారికి ఇద్దరు కొడుకులు ఉన్నట్లు, వారు ఆస్తి కోసమే తమ వద్దకు వస్తారని తెలిపింది. వారు తన భర్త చనిపోయాడని తెలిస్తే ఆస్తి కోసం గొడవ చేస్తారని.. ఇంట్లోనే అట్టపెట్టెలతో దహన సంస్కారాలు చేశానని చెప్పింది.

    మానసిక స్థితి సరిగా లేదంటున్న పోలీసులు..
    ఇదిలా ఉంటే లలిత మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు పేర్కొంటున్నారు. స్థానికంగా విచారణ చేసిన పోలీసులు స్థానికులు, కొడుకులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ నిర్ణయానికి వచ్చారు. 15 ఏళ్లుగా భర్తకు సపర్యలు చేస్తున్న లలిత.. భర్తకు అంత్యక్రియలు కూడా తనే చేయాలని ఇలా చేసి ఉంటుందని కొంతమంది పేర్కొంటన్నారు. కొందరు ఆమె చంపి ఉంటుందని ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.