Jagan Delhi Tour: ఏపీలో ముందస్తుకు జగన్ సిద్ధపడుతున్నారా? కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అందుకే ఢిల్లీ నుంచే జగన్ కేబినెట్ భేటీకి ఆదేశాలిచ్చారా? ..ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో దీనిపైనే చర్చ నడుస్తోంది. సీఎం ఢిల్లీ టూర్ తో ఈ ఊహాగానాలు రెట్టింపయ్యాయి. మూడు రోజుల పాటు జగన్ ఢిల్లీ టూర్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. నీతి ఆయోగ్ సమావేశంతో పాటు పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవంలో జగన్ పాల్గొన్నారు.మూడో రోజు సోమవారం ఎవరితో భేటీ అయ్యారో స్పష్టత లేదు కానీ అక్కడ్నుంచే కేబినెట్ భేటీ ఏర్పాటు చేయమని సమాచారం ఇచ్చారు. దానికి ఏడో తేదీన ముహుర్తంగా నిర్ణయించారు.
అత్యవసర కేబినెట్ భేటీ ఎందుకు ఏర్పాటుచేయాల్సి వచ్చింది? అదీ కూడా ఢిల్లీలో ఉండగా ఎందుకు ఆదేశాలిచ్చినట్టు?అన్నదానిపై చర్చ నడుస్తోంది. అత్యవసర నిర్ణయాల కోసం ఈ ఆకస్మిక కేబినెట్ భేటీలు ఉంటాయి. దీంతో ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారన్న చర్చ అయితే ప్రారంభమైంది. కీలక నిర్ణయం అంటే.. ముందస్తు ఎన్నికలే. సీఎం జగన్ తెలంగాణతో పాటు ముందస్తుకు వెళ్లడానికి సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. నవంబర్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ రావాల్సి ఉంది. అసెంబ్లీల గడువు పూర్తయ్యే రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది.
జగన్ ముందస్తుకు వెళ్లాలంటే ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకోవాలి. అందుకు ముందుగా అసెంబలీ రద్దు చేయాలి. అప్పుడే ఆ ఐదు రాష్ట్రాలతో కలిపి ఏపీ కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సాధ్యపడుతుంది. లేకపోతే ఈసీ సన్నాహాల కోసం మరికొంత సమయం తీసుకుంటుంది. అంటే ముందస్తు ఎన్నికలు పెట్టాలంటే ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. ముందస్తుకు వెళ్లాలంటే కేంద్రం సహకారం తప్పని సరి. కేంద్రం కాదంటే జరిగే చాన్స్ లేదు. ఆరు నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసినా…కేంద్రం కాదంటే అది రాష్ట్రపతి పాలనకు దారితీసే అవకాశముంది.
ఇప్పటికే జగన్ కు కేంద్ర ప్రభుత్వ సహకారం పుష్కలంగా ఉంది. కష్ట సమయంలో నేనున్నాను అంటూ కేంద్రం భరోసా ఇస్తూ వస్తోంది. ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు జగన్ కు కేంద్రం సపోర్టు లభించిందన్న వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా జగన్ ముందస్తుకు వెళతారన్న ప్రచారం జరిగింది. అప్పట్లో మోదీ, షా ద్వయం గో హెడ్ అంటూ జగన్ భూజం తట్టినట్టు టాక్ నడిచింది. . తాజాగా ఢిల్లీ పర్యటనలోనూ ఆయనకు ఈ అంశంపై స్పష్టత రావడంతో ఏడో తేదీన కేబినెట్ సమావేశం నిర్వహణకు సిద్ధమయ్యారన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తానికైతే జూన్ 7న ఏపీలో ముందస్తు ఎన్నికలపై స్పష్టత రానుందన్న మాట.