Polgar Sisters Story: ఆడపిల్లలను ఈసడించుకునే సమాజం ఒకసారి ఇతని గురించి తెలుసుకోవాలి. ప్లస్ మైనస్ ల లెక్కల్లో భ్రూణ హత్యలకూ తెగిస్తున్న తల్లిదండ్రులు ఇతడి చరిత్ర చదవాలి. ఆడపిల్లలంటే భారం అనుకునే కుటుంబ సభ్యులు ఇతడి గురించి ఒకసారి సెర్చ్ చేయాలి. ఇంతగా చెబుతున్నారు అంతలా ఏముంది ఆయన గొప్పతనం అని మీరు మమ్మల్ని ప్రశ్న వేస్తే మేము ఇచ్చే సమాధానం కూడా ఆ ప్రశ్న కంటే వెయ్యి రెట్లు సాలిడ్ గా ఉంటుంది. ఆడపిల్లల్ని ఎలా పెంచాలి? వారిని లక్ష్యం వైపు ఎలా తీసుకెళ్లాలి? ఇప్పటి సమాజం ఆ విషయాల మీద ఇతడి నుంచి బాగా నేర్చుకోవాలి.

శివంగిల్లా పెంచాడు
లాస్లో పోల్గార్ హంగేరీ కి చెందిన ఓ చెస్ టీచర్. మనస్తత్వ విద్యావేత్త.. ఇతడికి ముగ్గురు కుమార్తెలు.. వారి పేర్లు సుసాన్ , సోఫియా, జుడిట్. చిన్నతనం నుంచే వీరికి చదరంగం ఆటలో ప్రావీణ్యం నేర్పించాడు. చదువుతోపాటు చదరంగం ఆటలో మెలకువలు నేర్పడం ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడాకారిణులుగా ఈ ముగ్గురు సోదరీమణులు ఎదిగారు.. జుడిట్ ఏకంగా మహిళల ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది. ఇప్పటివరకు చదరంగంపై ఎన్నో పుస్తకాలు వచ్చాయి..కానీ లాస్లో పాల్గర్ చదరంగంలో తలెత్తే 5,334 సమస్యలు, ఎత్తులకు పై ఎత్తులు అనే అంశాల మీద పుస్తకాలు రాశారు.. అంతేకాకుండా ఆటలో పిల్లల్ని ప్రావిణ్యులుగా చేసేందుకు రకరకాల ప్రయోగాలు వారి మీద చేసేవాడు. వాళ్లు బాత్రూం వెళ్లినా కూడా కేవలం ఆట గురించే ఆలోచించేలా పరీక్షలు పెట్టేవాడు. దీనిపై అతడు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ… పెద్దగా లెక్క చేయలేదు. ఒకానొక దశలో పిల్లలు ఇబ్బంది పడినప్పటికీ ఆయన వెనకడుగు వేయలేదు. అతని వ్యతిరేకులు “ప్రాంకెన్ స్టేయిన్” గా గేలి చేసేవారు. అతని విధానాలు నచ్చేవారు “హౌడీ” అని పిలిచేవారు. 1992లో వాషింగ్టన్ పోస్ట్ లో ఇతడి దూర దృష్టి గురించి పెద్ద కథనమే ప్రచురితమైంది.. పోల్గార్ తన పిల్లలు చదరంగంపై తీవ్రంగా దృష్టి సారించేందుకు చేసిన ప్రయత్నాలు కొన్ని వర్గాల్లో విమర్శలు ఎదుర్కొన్నాయి.
క్రీడాకారిణులుగా ఎదిగారు
పోల్గర్ ముగ్గురు కుమార్తెలు అతడు ఇచ్చిన తర్ఫీదు వల్ల అద్భుతమైన క్రీడాకారిణులుగా ఎదిగారు ముగ్గురిలో సోఫియా తక్కువ విజయాలు సాధించినప్పటికీ ప్రపంచంలో ఆరవ ఉత్తమ మహిళ క్రీడాకారిణిగా అవతరించింది. ఆమె పెయింటింగ్, ఇంటీరియర్ డిజైన్ నేర్చుకుంది. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది. జుడిట్ ప్రపంచ అత్యుత్తమ మహిళా చెస్ క్రీడాకారిణిగా ఎదిగింది. 2008 నాటికి ఆమె దాదాపు 20 ఏళ్లుగా ప్రపంచంలో అత్యుత్తమ ర్యాంకు కలిగిన క్రీడాకారిణిగా వినతి కెక్కింది. సూసాన్ కూడా 17 ఏళ్ల వయసులోనే అనితరసాధ్యమైన రికార్డులు సొంతం చేసుకుంది.

బుడాపెస్ట్ లో ఉండేది
పోల్గార్ కుటుంబం బుడాపెస్ట్ లో ఉండేది.. పెద్ద కుమార్తె సూసాన్ కు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడే చదరంగం ఆడటం నేర్పించాడు. ఆరు నెలల తర్వాత సుసాన్ బుడాపెస్ట్ చెస్ క్లబ్ లోకి ప్రవేశించింది. అనుభవం ఉన్న క్రీడాకారులను ఓడించింది.. బాలికల అండర్ 11 టోర్నమెంట్లో ప్రతిభ చూపింది.. జుడిట్ తన ఐదు సంవత్సరాల వయసులో తండ్రిని ఓడించింది.. అయితే హంగేరీలో పుట్టిన మూడో ఏట పిల్లలకు విద్యాభ్యాసం చేయించడం నేరం. కానీ పోల్గర్ ఈ విషయంలో ప్రభుత్వంతో పెద్ద పోరాటం చేశాడు. పిల్లలకు ఆరో ఏడు వచ్చేంతవరకు ప్రాథమిక విద్యాభ్యాసం నేర్పి… దానితో పాటు చెస్ లో మెలకువలు నేర్పించాడు. చిన్న వయసులో పిల్లలకు జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుందని… ప్రతి చిన్న విషయాన్ని కూడా గుర్తుంచుకుంటారని అతని నమ్మకం.. ఇదంతా చూసే చుట్టుపక్కల వాళ్ళు పిల్లల బాల్యాన్ని నాశనం చేస్తున్నాడని గేలి చేసే వారు. అయితే నవ్విన నాప చేనే పండుతుందన్నట్టు.. అతడు చేసిన కృషి వల్ల ఆ ముగ్గురు ఆడపిల్లలు ఇవాళ ప్రపంచం గర్వించే స్థాయి చెస్ క్రీడాకారిణులు అయ్యారు. అయితే మొదటి నుంచి కూడా బాలికల సాధికారత గురించి మాట్లాడే పోల్గర్.. వారి వికాసాన్ని అడ్డుకోవద్దని హితవు పలికేవాడు.. ఇది కొంతమందికి రుచించలేదు. కానీ అతని పిల్లలు ప్రయోజకులు అయిన తర్వాత పొగడడం ప్రారంభించారు.. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోతున్న పుస్తకాల్లో పోల్గర్ రాసిన చదరంగం పుస్తకాలు కూడా ఉన్నాయి. ఒక 40 ఏళ్ల కాలాన్ని ముందుగానే ఊహించి అమల్లోకి పెట్టిన పోల్గర్ ఎంతో మంది తల్లిదండ్రులకు ఆదర్శనీయుడు. చివరగా తెలివి అనేది పుట్టుకతో రాదు. అది కేవలం సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది..