
BRS MLAs Poaching Case: ఏ ముహూర్తాన మొయినాబాద్ ఫాం హౌస్ కేసు వెలుగులోకి వచ్చిందో కానీ.. అప్పటి నుంచి కేసీఆర్ సుడి బాగున్నట్టు అనిపించడం లేదు. ఒక్క మునుగోడు ఫలితం తప్పిదే మిగతాదంతా భబ్రజమానం.. భజగోవిందం. అసలు ఈ కేసే పూర్తి అబ్సర్డ్. అందులో ఆధారాలు లేవు. ఎమ్మెల్యేలను కొనేంత దమ్ము బీఆర్‌ఎస్ ఆరోపిస్తున్న వ్యక్తులకు లేదు. పైగా ఆ ఎపిసోడ్‌లో ఉన్న ఎమ్మెల్యేలు సుద్ధపూసలు కారు. వారిలో అచ్చంపేట ఎమ్మెల్యే తప్ప మిగతావారంతా కాంగ్రెస్ గూటి పక్షులే. ఈ ఎమ్మెల్యేల కొనుగోలుతో దేశమంతా గాయిగత్తర చేద్దామని, బీజేపీ అగ్రనాయకులను బయటకు లాగుదామని కేసీఆర్ ప్లాన్ వేశాడు. కానీ అది బెడిసికొట్టింది. ఇప్పుడది ఆయన మెడకే చుట్టుకుంటోంది. అటు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసు, ఇటు మొయినా బాద్ ఫాం హౌస్ కేసులో సీన్ రివర్స్.. పాపం కేసీఆర్‌కు సుడి బాగున్నట్టు లేదు.
క్లిప్పింగ్‌లు ఎలా పంపిస్తారు?
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగులను ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయమూర్తులకు ఎలా పంపిస్తారని సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడం కేసీఆర్‌కు తాజా ఎదురు దెబ్బ. ముఖ్యమంత్రి తీరు సరికాదని న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం కేసీఆర్‌ను తుర్పార పట్టింది. ముఖ్యమంత్రి సామాన్యమైన వ్యక్తి కాదని, ఆయన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారని గుర్తు చేసింది. దీంతో, ఈ విషయంలో న్యాయమూర్తులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానని తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే విచారం వ్యక్తం చేయాల్సి వచ్చింది.
ఇక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ప్రయత్నిస్తోంది
‘‘దర్యాప్తులో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటున్నారనే ప్రశ్న ఎందుకు తలెత్తుతుంది. అక్రమ మార్గాల్లో ఆయన ప్రభుత్వాన్ని కూల్చడానికి వాళ్లు ప్రయత్నించారు. విలేకరుల సమావేశం నిర్వహిస్తే దర్యాప్తులో జోక్యం చేసుకున్నట్లు అవుతుందా? ఆరోపణలు చేయవచ్చు. కానీ, వాటిని హేతుబద్ధంగా నిరూపించాలి. మాది ప్రాంతీయ పార్టీ. జాతీయ పార్టీ బీజేపీ ఇక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ప్రయత్నిస్తోంది’’ అని దవే వివరించారు. కేసు దర్యాప్తును ఎట్టి పరిస్థితుల్లోనూ సీబీఐకి అప్పగించవద్దని ఆయన మరోసారి విజ్ఞప్తి చేయడమే(ఈ రోజు నమస్తే తెలంగాణ ఇదే విషయాన్ని ప్రస్తావించింది.) కేసీఆర్‌కు కొంతలో కొంత ఊరట. అయితే ఈ కేసును దుష్యంత్ దవే తిరిగి సిట్‌కు అప్పగించాలని కోరారు. ‘‘కేంద్ర ప్రభుత్వం చేతిలో సీబీఐ పంజరంగా మారింది. ఈ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ ఒకసారి సమర్థించి.. మరోసారి వ్యతిరేకించింది. ఒకవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే బీజేపీ నేతలు దురుద్దేశపూర్వకంగా మరో పిటిషన్ దాఖలు చేశారు. అందులో సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఇప్పుడు కేసు దర్యాప్తు సీబీఐ చేతుల్లోకి వెళితే.. అన్ని ఆధారాలూ ధ్వంసం అవుతాయి. కేసు పూర్తిగా నీరుగారి పోతుంది’’ అని దుష్యంత్ దవే వాదించారు.

సిట్ కూడా ఇక్కడి ప్రభుత్వ అజామాయిషీలోనిదే కదా?
దుష్యంత్ వాదన నేపథ్యంలో ‘సిట్ కూడా ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ అజమాయిషీలోనే ఉంది కదా!?’ అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. దాంతో, నేరం అక్కడే జరిగింది కనక సిట్‌కు అధికారం ఉందని దుష్యంత్ దవే తెలిపారు. దాని దర్యాప్తును కోర్టు పర్యవేక్షించవచ్చని వివరించారు. ఈ కేసులో ఆధారాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ సమయంలో కేసును సీబీఐకి ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ‘‘బీజేపీపాలిత రాష్ట్రాల నుంచి ఎన్ని కేసులను సీబీఐకి బదిలీ చేస్తున్నారు? వాటిలో ఎన్నిటిని తిరిగి రాష్ట్ర పోలీసులకు అప్పగిస్తున్నారు? దర్యాప్తు చేయడానికి సీబీఐకి అనుమతి ఇస్తే.. న్యాయ ప్రక్రియలో తీవ్ర తప్పిదం చేసినట్లే’’ అని దవే వాదించారు. అప్పటికే కోర్టు సమయం ముగియడంతో ధర్మాసనం ఆయన వాదనలను అక్కడితోనే నిలిపివేసింది. శనివారం నుంచి సుప్రీం కోర్టుకు హోలీ సెలవులు. దాంతో, శుక్రవారమే విచారణ చేపట్టాలని దుష్యంత్ దవే కోరారు. అది సాధ్యం కాదంటూ ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసును సీజేఐ ధర్మాసనానికి రిఫర్ చేస్తామని, తదుపరి విచారణకు మరో బెంచిని నియమిస్తారా? లేక వెకేషన్ బెంచ్‌కు పంపుతారా అనే అంశంపై ప్రధాన న్యాయమూర్తే నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. దాంతో, కేసు తదుపరి విచారణపై సందిగ్ధం ఏర్పడింది.