Pushpagiri: మన దేశంలో ఆధ్యాత్మికతకు కొదవలేదు. దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఎందరో దేవుళ్లకు పూజలందుకునే ఆలయాలు మన దగ్గర ఉండటం తెలిసిందే. అందుకే మన దేశం భక్తి పారవశ్యంతో విరాజిల్లుతోంది. మన దక్షిణ ప్రాంతంలోనే పంచ నదులు కలిసే చోటు ఉందంటే నమ్ముతారా? నిజమే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోనే ఉండటం గర్వకారణమే. కడప నుంచి కర్నూలు వెళ్లే మార్గంలో 16 కిలోమీటర్ల దూరంలో పుష్పగిరి ఉంది. ఇది దక్షిణ కాశీగా పిలువబడుతోంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర శివలింగం ఇక్కడ ఉండటం గమనార్హం. కడప నుంచి కర్నూలు వెళ్లే మార్గంలో చెన్నూరు నుంచి ఎడమ వైపుగా వెళితే పుష్పగిరి వస్తుంది.

పుష్పగిరి ప్రముఖ పుణ్యక్షేత్రంగా పిలువబడుతోంది. శైవులు, వైష్ణవులకు దివ్యధామంగా ఉంది. వైష్ణవులు మధ్య అహోబిలం అని శైవులు మధ్య కైలాసం అని దీన్ని పిలుస్తుంటారు. ఏపీలో ఇదొక్కటే శంకరాచార్య మఠం కావడం విశేషం. పుష్పగిరిలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండని నదులు పెన్నా నదిలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీ క్షేత్రం అని పిలుస్తుంటారు. ఇది ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఖ్యాతి చెందుతోంది. ఇక్కడకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
శివ స్వరూపుడైన వైద్యనాదీశ్వరుడు, విష్ణు స్వరూపుడైన కేశవ స్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా విరాజిల్లుతోంది. పరీక్షిత్తు వంశాన్ని నాశనం చేయడానికి జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశాల మేరకు పుష్పగిరి కొండపై ఆలయం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. చోళులు, పల్లవులు, శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని ప్రతీతి. కొండమీద చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి.

పెన్నా నదికి వరదలు వచ్చినప్పుడు అటు వారు ఇటు ఇక్కడి వారు అటు వెళ్లడానికి అవకాశం ఉండదు. ఇక్కడ ఆదిశంకరాచార్యులు ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని భక్తులు దర్శించుకుని తరిస్తారు. పుష్పగిరిలో పాపవినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాధేశ్వరుడు, కమలసంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలు ఉండటం విశేషం. రుద్ర పాదము, విష్ణు పాదాలు కూడా కొండ మీద కొలువుదీరాయి. దీంతో పుష్పగిరి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా వినుతికెక్కింది. పంచనదుల సంగమ ప్రదేశంగా దీనికి మంచి గుర్తింపు వచ్చింది.