Dog Death Anniversary: ఆ మూగజీవిని పెంచిన నాటి నుంచి ఆ ఇంటికి కలిసి వచ్చింది. ఆర్థికంగా వృద్ధిలోకి వచ్చారు. సొంత ఇంటిని నిర్మించుకున్నారు. కుమారులు ఇద్దరు సాఫ్ట్ వేర్ రంగంలో స్థిరపడ్డారు. ఒక ఐటీ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే ఆ మూగజీవి అనారోగ్యంతో కన్ను మూసింది. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరయింది. ఆ మూగ జీవికి ఏకంగా సమాధి నిర్మించి.. పూజలు చేయడం ఆ కుటుంబానికి నిత్య కృత్యంగా మారింది.
కడప బిల్డప్ సర్కిల్లో బాలు, సౌజి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు 2008లో ఒక కుక్కను తెచ్చుకొని పెంచుకోవడం ప్రారంభించారు. దానికి ముద్దుగా టైసన్ శర్మ అని పేరు పెట్టుకున్నారు. ఇంటిల్లపాదికి కుక్కతో అనుబంధం ఉండేది. అయితే టైసన్ శర్మ 2018 జూలై 29న చనిపోయింది. సమీపంలోని మరియాపురం స్మశానములో ఖననం చేసి సమాధి నిర్మించారు. నిత్యం ఆ సమాధి వద్ద పూజలు చేసి కుక్క జ్ఞాపకాలను స్మరించుకుంటున్నారు. పదిమందికి అన్నం పెడుతుంటారు.
టైసన్ శర్మ అడుగుపెట్టిన తర్వాత కుటుంబ పరిస్థితులే మారిపోయాయని వారు చెబుతున్నారు. అప్పటివరకు వారు అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు. కుక్క వచ్చిన వేళా విశేషం ఏమిటో తెలియదు గానీ సొంత ఇంటిని నిర్మించుకున్నారు. ఆ ఇద్దరు పిల్లలకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు వచ్చాయి. హైదరాబాదులో ఏకంగా సొంత కంపెనీని ప్రారంభించారు. ఆర్థికంగా ఎంతో వృద్ధి సాధించారు. దీనంతటికీ కారణం టైసన్ శర్మ అని వారి ప్రగాఢ నమ్మకం. కానీ కుక్క అర్ధాంతరంగా చనిపోవడంతో వారి బాధ వర్ణనాతీతం. అందుకే కుక్కను ఖననం చేసిన చోట సమాధిని నిర్మించారు. నిత్య పూజలు చేస్తున్నారు. శనివారం ఐదో వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టారు. సమాధి వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. పదిమందికి అన్నదానం చేశారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More