Journalists Life: మేడిపండు పైకి చూస్తే ఎర్రగా ఉండి.. లోపల పురుగులు ఉన్నట్టు.. జర్నలిస్టుల బతుకులు కూడా అలాగే ఉంటాయి. పై ఉపోద్ఘాతంలో పాత్రికేయుల గురించి ఒక కోణం మాత్రమే కనిపిస్తుంది.. రెండవ కోణం అత్యంత దారుణంగా ఉంటుంది.. మేనేజ్మెంట్లు జీతాలు ఇవ్వక.. కొన్ని మేనేజ్మెంట్లు జీతాలు ఇచ్చినప్పటికీ అవి దేనికీ సరిపోక పాత్రికేయులు పడుతున్న ఇబ్బందులు మామూలుగా ఉండవు. ఇక కరోనా సమయంలో మేనేజ్మెంట్లు చాలామంది ఉద్యోగులను అడ్డగోలుగా తొలగించాయి. వారిని రోడ్డుమీద పడేశాయి. ఆ సమయంలో వారికి ఎటువైపు నుంచి భరోసా లభించక.. ఈ ఫీల్డ్ నుంచి వేరే ఫీల్డ్ లోకి వెళ్లిపోయారు.. ఇంకా కొందరైతే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తనవులు కూడా చాలించారు.. పైకి కనిపించే డాబు, దర్పం ఏవీ మీడియా ఫీల్డ్ లో అంతర్గతంగా ఉండవు. ఇక్కడ సాగిన రాజకీయాలు ఎక్కడా ఉండవు.. పరమపద సోపానాన్ని మించి ఇక్కడ కుతంత్రాలు సాగుతుంటాయి. నిచ్చన ఎక్కడానికి ఎంత సమయం అయితే పడుతుందో.. అంతకంటే తక్కువ సమయంలోనే కిందికి లాగే శక్తులు చాలా ఉంటాయి.
Also Read: ఆ హీరోకు భార్యగా, ఫ్రెండ్ గా, తల్లిగా నటించిన టబు. ఇంతకీ ఎందుకిలా?
మీడియా ఫీల్డ్ లో టైమింగ్స్ అంటూ ఉండదు. ఇప్పుడు ఇక సోషల్ మీడియా విస్తృతమైన తర్వాత బ్రేకింగ్ కోసం జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. కేవలం ఎలక్ట్రానిక్ మీడియానే కాదు ప్రింట్ మీడియాలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. ప్రింట్ మీడియాలో సర్కులేషన్, యాడ్స్ అంటూ మేనేజ్మెంట్లు విలేకరులకు నరకం చూపిస్తుంటాయి.. తెలుగులో ఒక పత్రిక మినహా మిగతా అన్ని కూడా ఇలానే వ్యవహరిస్తున్నాయి. దీంతో చాలామంది విలేకరులు ఒత్తిడికి తట్టుకోలేక బలవంతంగా తనవులు చాలిస్తున్నారు. 24/7 లాగా ఉద్యోగం చేయాల్సి వస్తుండడంతో చాలామంది కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక వైవాహిక జీవితంలో ఆటుపోట్లను చవిచూస్తున్నారు. సమయం అంటూ లేకపోవడం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం కూడా దెబ్బతింటున్నది. అంతంత మాత్రం వేతనాలతో ఆర్థిక సమస్యలు కూడా తీవ్రంగా ఉంటున్నాయి. అందువల్లే చాలామంది అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో మేనేజ్మెంట్ల ఒత్తిళ్లు తట్టుకోలేక చాలామంది పాత్రికేయులు గుండెపోటు మరణాలకు గురయ్యారు. బయటికి చెప్పుకోవడం లేదుగాని.. చాలామంది పాత్రికేయులు లోలోపల నలిగిపోతున్నారు. కుటుంబ బాధ్యతలు పెరిగిపోవడం.. ఆర్థికంగా సవాళ్ళు ఎదుర్కొంటున్నారు.. జర్నలిస్టు స్వేచ్ఛ మరణం వెనుక ఎలాంటి కారణం ఉన్నప్పటికీ.. అంతిమంగా మాత్రం మానసిక ఒత్తిడి..
మీడియా ఫీల్డ్ లో పని చేసేవారు కుటుంబానికి అంతగా సమయం కేటాయించే అవకాశం ఉండదు. వ్యక్తిగత ఆరోగ్యం పై దృష్టి సారించే అవకాశం ఉండదు. ఇక ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇన్ని ప్రతి బంధకాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి మీడియా ఫీల్డ్ లో పని చేసేవారు ఆరోగ్యాన్ని పణంగా పెట్టాల్సి వస్తోంది. అంతిమంగా అనారోగ్య సమస్యలకు గురై ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోంది. మీడియాలో వార్తలు చదివేవారు.. వార్తలు సేకరించేవారు.. చివరికి వారే ఒక వార్త కావడం అత్యంత విషాదం.. చెప్పలేనంత బాధాకరం.