
Heart Attacks: ఈ మధ్యకాలంలో గుండెపోట్లు మనుషులను కబళిస్తున్నాయి. హార్ట్ అటాక్ తో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గుండెపోటు ఎవరిని ఎప్పుడు మట్టుబెడుతుందో తెలియని పరిస్థితి. ఒకప్పుడు వయసు మీరిన వారు, స్థూలకాయులకు గుండెపోటు వస్తుందని భావించేవారు. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు, యువకులు, విద్యార్థుల్లో కూడా ఈ మాయదారి రుగ్మత వెలుగుచూస్తోంది. కూర్చున్న వాళ్లు కూర్చున్నట్టే.. నిలబడిన వాళ్లు నిలబడిన చోటే కుప్పకూలిపోతున్నారు. ప్రతీరోజూ ఏదో మూలన ఈ ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
Also Read: International Women’s Day 2023: ఉమెన్స్ డే: పడిలేచిన హీరోయిన్ల కథ..
ఏపీలో వారం రోజుల వ్యవధిలో ఇద్దరు యువకులు గుండెపోటు బారిన పడి ప్రాణాలు వదిలారు. వారు 20 సంవత్సరాల్లోపు యువకులు కావడం గమనార్హం. నిన్నటికి నిన్న పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రులో సోమవారం రాత్రి అందరితో కలిసి సరదాగా కబుర్లు చెప్పి భోజనం చేసి నిద్రపోయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఫిరోజ్ ఖాన్ (17) అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గుండె పోటుకి గురై ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. నిద్రలో ఉండగా తీవ్ర గురకతో బాధపడిన ఫిరోజ్ ఖాన్ కు సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలాడు. తన కుమారుడికి ఎటువంటి ఒత్తిళ్లు లేవని.. అయినా గుండెపోటుతో మృతిచెందాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

అనంతపురం జిల్లాకు చెందిన తనూజ నాయక్(19) అనే యువకుడు గుండెపోటుకు గురయ్యాడు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలాడు.మడకశిర మండలం అచ్చంపల్లి తాండాకు చెందిన తనూజ నాయక్ పీవీకేకే కాలేజీలో బీఫార్మసీ చదువుతున్నాడు. తనూజ నాయక్ తన ఫ్రెండ్స్ తో కలిసి కాలేజీ గ్రౌండ్ లో కబడ్డీ ఆడుతుండగా ఒక వైపు వెళ్తూ వెళ్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే అతడ్ని తీసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్ ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ కన్నుమూశాడు. తనూజ్ నాయక్ చివరి సారిగా ఆడిన కబడ్డీ, కుప్పకూలిపోయిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. స్నేహితులు, తోటి విద్యార్థులు వైరల్ చేస్తున్నారు.
కొవిడ్ అనంతరం మాత్రం గుండెపోట్ల ప్రభావం అధికంగా ఉంది. ప్రధానంగా యువతే ఆ మాయదారి రుగ్మత బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడే మృత్యువు తలుపు తడుతోంది. అయితే విపరీతమైన ఒత్తిడి, జీవితంలో ఎదగాలన్న బలమైన ఆకాంక్షతో పనిచేసేవారు తీవ్ర ఒత్తిడిబారినపడుతున్నారు. ఈ క్రమంలో రుగ్మతలకు గురవుతున్నారు. గుండెపోటు వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడి మూల్యం చెల్లించుకుంటున్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా బాల్యంలోనే గుండెపోట్లు పలకరిస్తుండడంతో ఈ ఉపద్రవం మరింత పంజా విసిరే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read:Naveen Murder Case: నవీన్ హత్య కేసులో నిహారిక ప్రమేయం..అందరి చెవిలో ఇలా పూలు పెట్టింది!
